నదికి కొత్త నడక నేర్పిన సిఎం కేసీఆర్
కొడకండ్ల వద్ద గోదావరి జలాలను వదిలిన మంత్రి హరీష్ రావు
గజ్వేల్, మార్చి 19(ప్రజాతంత్ర విలేఖరి) : సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం మొగులు వైపు ఆర్తిగా కళ్లు పెట్టి చూడాల్సిన పరిస్థితి ఉంటే స్వరాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగు నీరు విడుదల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వైపు చూసి నీళ్లు కావాలని అడిగితే నీళ్లు వొస్తున్నాయనీ, నదికి కొత్త నడక నేర్పిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి-భువనగిరి జిల్లాలోని గండి చెరువు(ప్యాకేజీ 15 కాలువ ద్వారా)కు, ఆ వెంటనే కొండ పోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ… మండుటెండల్లో కుడవెళ్లి వాగులోకి, అట్లాగే ప్యాకేజీ 16 కాలువలోకి సాగునీరును విడుదల చేయడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. త్రాగునీటికి గోసపడ్డ ప్రాంతంలో నిండు వేసవిలో గోదావరి జలాలను వాగుల్లోకి, కాలువల్లోకి సమృద్ధిగా విడుదల చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దక్కుతుందని అన్నారు. నిండు వేసవిలో కాల్వల్లో గోదావరి జలాలు పారుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఒక్క ఎకరం కైనా నీళ్లు ఇచ్చారా? అని కళ్లుండి చూడలేని కబొదుల్లా పసలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. గత వేసవిలో గూడవల్లి వాగుకు గోదావరి జలాలను విడుదల చేసి 38 చెక్ డ్యామ్‌లను నింపామన్నారు. దీంతో గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గంలోని 30, 40 వేల ఎకరాలలో కోట్లాది రూపాయల పంటను కాపాడ గలిగామని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు రైతులతో మాట్లాడి నిజమో కాదో తేల్చుకోవాలని చాలెంజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేదా అని ప్రతిపక్షాలను మంత్రి ప్రశ్నించారు. హల్దీవాగు లోకి గోదావరి జలాలు విడుదల చేయడం ద్వారా అక్కడి నుంచి మంజీర నదిలోకి.. అక్కడి నుంచి నిజాంసాగర్‌కు 96 కిలో మీటర్ల మేర ప్రయాణించి వర్గల్‌లోని చెరువులతో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగేలా చేస్తున్నాయని మంత్రి తెలిపారు.కాళేశ్వరం ప్రాజెక్ట్‌కే గుండె కాయ లాంటి మల్లన్న సాగర్ జలాశయం నిర్మాణం చేపడి తే ప్రతిపక్షాలు ప్రాజెక్టు పూర్తి కాకుండా చూడాలన్న ఉద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టాయని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడికి గోదావరి నీళ్లు తేవడం అసాధ్యం అంటూ, ప్రజల నుంచి తీసుకున్న భూములను రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగిస్తారని ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేశారని మంత్రి గుర్తు చేశారు పట్టుదల కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసాధ్యమైన పనిని సాధ్యం చేసి కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్‌కు గోదావరి జలాలు వొచ్చేలా చూశారని అన్నారు.
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పాదాలను గోదావరి జలాలతో అభిషేకిస్తాం..
శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి-భువనగిరి జిల్లాలోని గండి చెరువు(ప్యాకేజీ 15 కాలువ ద్వారా)కు శనివారం విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఆదివారం గండి చెరువుకు గోదావరి జలాలు చేరుకుంటాయని ఇటీవల శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి పాదాలను గోదావరి జలాలతో అభిషేకించిన మాదిరే శ్రీ లక్ష్మీనరసింహస్వామి పాదాలను గోదావరి జలాలతో అభిషేకిస్తామని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.
దేవుళ్ల పేరు పెడితే తప్పా…
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని మూడు సంవత్సరాలలో పూర్తి చేసి దేవుండ్ల పేరును పెట్టామని మంత్రి చెప్పారు. కొందరు దీనిని కూడా తప్పు పడుతున్నారని అన్నారు. ఈ ప్రాంతానికి ఎప్పుడైనా సాగు, త్రాగునీటి సమస్యలకు పరిష్కారం చూపి ఉంటే ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టేవారమని అన్నారు. సిఎం కేసీఆర్ నీరు తెస్తే తమకు నూకలు చెల్లుతాయని, రాజకీయ భవిష్యత్తు ఉండదని ప్రతిపక్షాలు భావించి ప్రాజెక్టుల నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాయనీ మంత్రి తెలిపారు. కాళ్లలో కట్టెలు పెట్టి, పుల్లలు పెట్టి అడుగడుగున అడ్డుపడ్డాయని అన్నారు. 350 కేసులు వేసి ప్రాజెక్టును ఆపాలని విశ్వ ప్రయత్నం చేశారు అని మంత్రి అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి కానే కాదు, నీళ్లు రానే రావు అని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశాయని మంత్రి పేర్కొన్నారు.
అయినా తర తరాలకు నిలబడే పనిని భుజాన ఎత్తుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓపిగ్గా అన్ని అడ్డంకులను అధిగమించి సుమారు అర కిలోమీటరు పైన, అంటే 618 మీటర్ల ఎత్తు కు గోదారమ్మను తీసుకువచ్చి బీడు భూములను అభిషేకించారన్నారు. అంతకు ముందు జలాల విడుదల కోసం మంత్రి హరీష్‌రావు కొడకండ్ల వద్దకు చేరుకోగానే మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో రైతులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణశర్మ, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గజ్వేల్ మునిసిపల్ ఛైర్మన్ రాజమౌలి, ఏఎంసి ఛైర్‌పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ములుగు డివిజన్ ఆత్మ కమిటీ ఛైర్మన్ గూండా రంగారెడ్డి, కొండపోచమ్మ ఆలయ ఛైర్మన్ రాచమల్ల ఉపేందర్‌రెడ్డి, డిసిసిబి ఛైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలక్షన్‌రెడ్డి, దేవి రవీందర్, బెండే మధు, హరిరాం, అశోక్, వేణు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.