వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నల్లమల అడవేకాదు.. తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తిత్వం

September 16, 2019

  • యురేనియం తవ్వకాల నిషేధ•ంపై అసెంబ్లీలో తీర్మానం
  • సభలో ప్రవేశపెట్టిన కేటీఆర్‌
  •  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు

నల్లమలలో యురేనియం తవ్వకాలపై నిషేధ•ం విధిస్తూ తెలంగాణ అసెంబ్లీలో సోమవారం తీర్మానం చేశారు. సోమవారం సభలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభలో మంత్రి కేటీఆర్‌ ‌యురేనియం తవ్వకాలపై నిషేధ•ం విధిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులందరూ మద్దతు తెలపడంతో తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. యురేనియం తవ్వకాలను రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. నల్లమల కేవలం అడవే కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి, అస్తిత్వం అని తెలిపారు. అడవి నుంచి పూచిక పుల్లను కూడా ముట్టనియ్యమని, కేంద్రం బలవంతం చేస్తే పోరాటానికి యావత్‌ ‌తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కేంద్రం తెలంగాణలోని నల్లమల ప్రాంతంలో యురేనియం తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో నల్లమల్ల అటవీ ప్రాంతాల పరిధిలో నాగర్‌కర్నూల్‌ ‌జిల్లా అమ్రాబాద్‌, ‌పదిర ప్రాంతాల్లో యురేనియం తవ్వకాలకు నిర్ణయించింది. దీనికితోడు పలు ప్రాంతాల్లో బోర్లు వేసుకొనేందుకు కేంద్రం నుంచి పలువురు సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ గత రెండు నెలలుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆందోళనలు నిర్వహించగా, ఇతర పార్టీలు, ప్రజా సంఘాలు, గిరిజనులు, చెంచెలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో హన్మంతరావు నేతృత్వంలో నల్లమలలో ఉద్యమానికి కమిటీనిసైతం వేశారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీలో ఆదివారం సీఎం కేసీఆర్‌ ‌కీలక ప్రకటన చేశారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. కేంద్రం వెనక్కు తగ్గకపోతే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. దీనికితోడు సోమవారం అసెంబ్లీలో యురేనియం తవ్వకాలు నిలిపివేయాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని కేసీఆర్‌ ‌ప్రకటించారు. ఆ మేరకు సోమవారం కేటీఆర్‌ ఈ ‌తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నారు.