Take a fresh look at your lifestyle.

నల్లగొండ పట్టణ సుందరీకరణకు ప్రాధాన్యం

  • అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలి
  • జిల్లా కలెక్టరేట్‌లో ఉన్నతస్థాయి సమిక్షలో సిఎం కెసిఆర్‌

‌ప్రజాతంత్ర, నల్గొండ : నల్లగొండ మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసి, పట్టణాన్ని సుందరీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సూచించారు. ఇప్పటికే చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. బుధవారం సిఎం కెసిఆర్‌ ‌తన నల్లగొండ పర్యటనలో భాగంగా ఉన్నతస్థాయి సమిక్ష నిర్వహించారు. రోడ్ల విస్తరణ, సెంట్రల్‌ ‌లైటింగ్‌, ‌టౌన్‌ ‌హల్‌, ఆడిటోరియం, మినీ ట్యాంక్‌ ‌బండ్‌లు, గతంలో ఇచ్చిన హామిలపై కూలంకషంగా చర్చించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో మౌలిక వసతుల అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలతో పాటు సమస్యలపై చర్చించారు. పోడు భూముల సమస్య, మెడికల్‌ ‌కాలేజీ నిర్మాణం, దళిత బంధు పథకం అమలుపై కేసీఆర్‌ ‌చర్చించారు.

పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌… ‌తండ్రి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన అనంతరం నల్గొండ కలెక్టరేట్‌లో సిఎం సమిక్ష నిర్వహించారు. ఈ సమిక్షలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, హరీశ్‌రావు, వి.శ్రీనివాస్‌ ‌గౌడ్‌, ‌బడుగుల లింగయ్య యాదవ్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌ప్రశాంత్‌ ‌జీవన్‌ ‌పాటిల్‌, ఎస్పీ రెమా రాజేశ్వరి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ ‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, భగత్‌, ‌రవీంద్ర నాయక్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకముందు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ను సీఎం కేసీఆర్‌… ‌నల్గొండలో పరామర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వెంట మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌కు పయనమయ్యారు. సీఎం కేసీఆర్‌ ‌పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్‌ అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Leave a Reply