Take a fresh look at your lifestyle.

“ధరణీ “లో లేమా ..?

పట్టాలకు మోక్షమెప్పుడు ..రైతన్న ఆవేదన
ధరణి వెబ్‌ ‌సైట్‌ ‌ప్రారంభమైనా ఇక కనికరించరా… అని దుగ్గొండి మండలం రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సాదా బైనామా ఫలాలు చాలా మందికి అందక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పేద రైతులు సాదా బైనామా ద్వారా పట్టాలు పొంది రైతుబంధు పథకం ద్వారా లబ్ధి పొందచ్చనుకున్నారు. కానీ అధికారుల వైఫల్యమో, యాంత్రిక లోపమో చాలా మంది రైతాంగానికి పట్టాలు అందక, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎన్నికల పేరుతో అధికారులు నెట్టుకొచ్చారని వారు చెబుతున్నారు. మొదటి విడత రైతు బంధు చెక్కులు రాలేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తే సరి చేస్తామని చెప్పుకొచ్చారని వారు అంటున్నారు. ఆ వంక ఈ వంక చెబుతూ కాలం వెళ్లదీశారు అధికారులు. అసెంబ్లీ రద్దు, తర్వాత ఎన్నికలు, ఆ పని, ఈ పని ఉందని చెబుతూ అధికారులు పట్టాలను పట్టించుకోలేదని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండో దఫా ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ఇంతకు ముందు పట్టాదారులకే బ్యాంకు ఖాతాలో జమ చేశారని వారు తెలుపుతున్నారు. దీంతో రెండు విడుతలు రావాల్సిన రైతు బంధు డబ్బులు 8 వేల రూపాయలు పట్టాలు లేక పోవడంతో నష్ట పోయామని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఉన్నతాధికారులు వెంటనే తమకు పట్టాలు అందజేసి చేసి రైతు బంధు చెక్కులు అందేలా చూడాలని వారు కోరుతున్నారు.


పట్టాలు అందించాలనీ బందంపల్లి, లక్ష్మిపురం రైతుల దర్నా…
పట్టాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని దుగ్గొండి మండలం బందంపల్లి, లక్ష్మిపురం రైతులు ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆయా గ్రామాల రైతులు దాదాపు 30 మంది పట్టాలు లేకపోవడంతో వ్యవసాయ పరమైన చాలా సంక్షేమ పథకాలకు అనర్హులమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు విడతలుగా ఎకరానికి రావాల్సిన 8 వేల రూపాయలు అందక నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వెంటనే తమకు పట్టాలు అందేలా చూడాలని వారు తహసీల్దార్‌ ‌మంజులకు వినతి పత్రాన్ని అందజేశారు.
నేనొచ్చి నెల రోజులవుతోంది… గ్రామాల వారిగా చేస్తా : తహసీల్దార్‌ ‌మంజుల
తానొచ్చి నెల రోజులే అవుతోందని, ధరణి వెబ్‌సైటు కూడా ఈ మధ్యనే ఓపనైందని, గ్రామాల వారీగా అర్హులను గుర్తించి వారికి పట్టాలు అందేలా కృషి చేస్తానని తహసీల్దారు మంజుల తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy