Take a fresh look at your lifestyle.

దేశ పౌరుడిని తయారు చేసుకునే విధానం ఇదేనా?!

అన్నేసి ఏండ్లు చదువుకున్న తర్వాత కూడ వారు చదువుకున్న అన్ని పుస్తకాల్లో ఎక్కడ కూడా తమను చదివిస్తున్నది ఎవరో కూడా చెప్పని ఒక దేశ ద్రోహం పాఠ్యపుస్తకాల్లో ఉండటం ఈ దేశ విద్యావిధానంలోని దౌర్భాగ్యానికి చిహ్నం. చివరకు వారు చదువుకున్న కాలేజి పేరు, పాఠశాల పేరు అడిగి, అవి ప్రభుత్వ పాఠశాల, కళాశాల అంటున్నారు కదా మరి ప్రభుత్వం అంటే ఎవరు? అని అడిగే వాన్ని. ఆ ఒక్క సమాధానం మాత్రం చాలా ఆలస్యంగానైన ‘ప్రజలు’ అని ఇచ్చే వారు. ఈ మొత్తం చర్చలో మీకు అర్థమైంది ఏంటి అని మళ్ళీ అడిగితే అప్పుడు మాత్రం ‘మమ్మల్ని ప్రజలు చదివిస్తున్నారు’ అని సమాధానం వచ్చేది. అందులో ఎవరో ఒకరు దీనిపై చర్చను ప్రారంభించేవారు.నేను జన్నారం(పూర్వపు ఆదిలాబాద్‌ ‌జిల్లా)లోని కరిమల జూనియర్‌ ‌కళాశాలకు మూడు సంవత్సరాలు ప్రిన్సిపాల్‌గా పనిచేశాను, 1996లో ఉపాధ్యాయ వృత్తిని చేబట్టిన తరువాత కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్టటైమ్‌ ‌పి.హెచ్‌.‌డి. రిసెర్చ్ ‌కొనసాగిస్తూ తీరిక దొరికినప్పుడల్లా 2000 సం।।నుండి 2011 వరకు హన్మకొండలోని శ్రీవేణి ఎంట్రెన్స్ ‌కాలేజిలో హిస్టరీ సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలపై టి.టి.సి., బి.ఎడ్‌., ‌గ్రూప్స్, ‌డి.యస్‌.‌సి., లాంటి అనేక పోటీ పరీక్షలకు గెస్ట్ ‌లెక్చర్స్ ఇవ్వడానికి వెళ్ళేవాన్ని. చాలామంది విద్యార్థులు డిగ్రీ, పి.జి., కోర్సులు చేస్తున్నవారు, పూర్తిచేసిన వారితో పాటుగా చాలా మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులతో పాటు వివిధ సామాజిక ఉద్యమాలలో పనిచేస్తూన్నవారు కూడా వచ్చేవారు. దాదాపు 50 వేల మందికి పైబడి విద్యార్థులు ఆ 10 సంవత్సరాల కాలంలో శిక్షణ నుండి బయటకు వెళ్ళి ఉంటారు. కరిమల, ్రవేణి ఎంట్రెస్స్ ‌కాలేజీలో ప్రతి బ్యాచ్‌ ‌యొక్క మొదటి తరగతిని ప్రారంభించేటప్పుడు కూడా లేక ఇప్పటివరకు విద్యార్థులను ఉద్దేశించి నేను మాట్లాడిన అన్ని విద్యార్థి సభల్లో 1. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? 2. మీరు ఎవరి కోసం చదువుకుంటున్నారు? 3. మీరు ఎందుకోసం చదువుకుంటున్నారు? 4. మీరు ఏం కావాలని చదువుకుంటున్నారు? 5. భారతదేశంలో చదువు లక్ష్యం ఏమిటి? లాంటి కొన్ని ప్రశ్నలను విద్యార్థులకు వేసి ప్రారంభించేవాన్ని.
పై ప్రశ్నలకు అంతేసి చదువుకున్న విద్యావంతులు (అక్షరజ్ఞానులు అంటే వారు ఒప్పుకోకపోవచ్చు) చెప్పే సమాధానాలు నాకు చాలా ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగించేవి. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్న మొదటి ప్రశ్నకు తరగతి అంతా ‘‘మమ్మల్ని మా తల్లిదండ్రులు చదివిస్తున్నారు’’ లేదా మేమే కష్టపడి చదువుకుంటున్నామని చెప్పేవారు. మీ తండ్రి ఆదాయమెంత? అని అడిగితే లక్ష లేక రెండు లక్షలు వరకు ఉంటుందని చెప్పేవారు. మీరు చదువుకునే పాఠశాలలో కాని లేక కాలేజిలోగాని ఉపాధ్యాయులు లేక అధ్యాపకులు ఎంత మంది? వారి జీతబత్యాలు ఎంత? ఆ పాఠశాల లేక కాలేజి బిల్డింగ్‌ ‌కాస్ట్ ఎం‌త వుంటుంది? మీ తండ్రి ఆదాయం వీరి జీతబత్యాలు ఎన్ని రోజులకు లేక ఎన్ని నెలలకు చెల్లించవచ్చు? అని అడిగితే ఒక్క నెలకు కూడా సరిపోదు అని చెప్పేవారు. అదేమిటి మరి మిగితా 11నెలలు మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అని అడిగితే ఏ సమాధానం చెప్పేవారు కాదు. పై ప్రశ్నలు, సమాధానాల ద్వారా మొత్తానికి రాబట్టిన అంశం ఏంటంటే ఈ దేశంలో ఇంతేసి డిగ్రీలు చదివిన విద్యార్థులకు కూడా తమను ఎవరు చదివిస్తున్నారో తెలియకపోవడం చాలా దురదృష్టకరం. అన్నేసి ఏండ్లు చదువుకున్న తర్వాత కూడ వారు చదువుకున్న అన్ని పుస్తకాల్లో ఎక్కడ కూడా తమను చదివిస్తున్నది ఎవరో కూడా చెప్పని ఒక దేశ ద్రోహం పాఠ్యపుస్తకాల్లో ఉండటం ఈ దేశ విద్యావిధానంలోని దౌర్భాగ్యానికి చిహ్నం. చివరకు వారు చదువుకున్న కాలేజి పేరు, పాఠశాల పేరు అడిగి, అవి ప్రభుత్వ పాఠశాల, కళాశాల అంటున్నారు కదా మరి ప్రభుత్వం అంటే ఎవరు? అని అడిగే వాన్ని. ఆ ఒక్క సమాధానం మాత్రం చాలా ఆలస్యంగానైన ‘ప్రజలు’ అని ఇచ్చే వారు. ఈ మొత్తం చర్చలో మీకు అర్థమైంది ఏంటి అని మళ్ళీ అడిగితే అప్పుడు మాత్రం ‘మమ్మల్ని ప్రజలు చదివిస్తున్నారు’ అని సమాధానం వచ్చేది. అందులో ఎవరో ఒకరు దీనిపై చర్చను ప్రారంభించేవారు. నిజంగా మనదేశంలో ప్రభుత్వం అంటే ప్రజలు అనే భావన ఎక్కడైన ఉందా? ఇది వాస్తవం కూడ. ప్రభుత్వం అంటే రాజకీయ నాయకులు (అది ఓడిన, గెలిచిన), ఐ.ఏ.ఎస్‌., ఐ.‌పి.యస్‌.,‌లు, పోలీసులు, పచ్చ పెన్ను అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రైవేటు యాజమాన్యాలు అంతే గాని సామాన్య ప్రజలు, ఉద్యోగులు కాదు.
పై ప్రశ్న చర్చను ఇక్కడ ఆపండి అంటూ రెండో ప్రశ్న వేసే వాన్ని. ‘మీరు ఎవరి కోసం చదువుకుంటున్నారు’? అని అడిగితే మూకుమ్మడిగా తరగతి గదిలోని అందరు ‘మేము మా కోసం చదువుకుంటున్నాము’ అని చెప్పేవాళ్ళు. మీరు విద్యావంతులు బాగా ఆలోచించి చెప్పండి అని అన్న తర్వాత కూడ అదే సమాధానం వచ్చేది. మిమ్మల్ని ఎవరు చదివిపిస్తున్నారో వాళ్ళ కోసం కాదన్నమాట! మరి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు చదివించాలి?! అంటే ఏ సమాధానం ఉండేది కాదు. మనిషి ఎవరి ఆస్తి? అనే ప్రశ్న వేస్తే దాదాపుగా అందరు తల్లిదండ్రుల ఆస్తి అని లేక కుటుంబం ఆస్తి అని సమాధానం ఇచ్చేవారు.
మళ్ళీ మూడో ప్రశ్న సంధించేవాన్ని ‘మీరు ఎందుకోసం చదువుకుంటున్నారు’? అందరు ‘మంచి ఉద్యోగం కోసం, మంచి జీవితం కోసం, మంచి జీతం కోసం, సుఖంగా బ్రతకడం కోసం చదువుకుంటున్నాం’ అని చెప్పే వాళ్ళు. ఒకరిద్దరు ‘జ్ఞానం కోసం చదువుకుంటున్నాం’ అని కూడా చెప్పే వాళ్ళు. అది ఎక్కడి నుండి వస్తుంది అనే ప్రశ్నకు మాత్రం అందరు పుస్తకాల నుండి వస్తుంది అని చెప్పేవాళ్ళు. సమాజం నుండి జ్ఞానం వస్తుంది అని, జ్ఞానానికి కేంద్రం సమాజం అని మాత్రం చెప్పేవాళ్ళుకాదు. వాస్తవానికి కూడా ఒక విద్యార్థికి పుస్తకాల నుండి వచ్చే జ్ఞానం ఒక్క శాతం అని ఎవరైన జవాబు చెబితే అది చాలా ఎక్కువే. నీ అభిమాన హీరో, హీరోయిన్‌లు ఎవరు? అనే ప్రశ్నవేస్తే విద్యార్థులందరు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, వెంకటేష్‌, ‌రాంచరణ్‌, ‌త్రిష,, కాజోల్‌, ‌విద్యాబాలన్‌ అని ఇంకా ఎవేవో పేర్లు చెప్పేవారు. వారు మీకు ఏమి ఇస్తున్నారు అంటే సమాధానం వచ్చేది కాదు. నీకు తిండి పెడుతున్నారా, నీకు కావలసిన చదువు చెప్పిస్తున్నారా, ఉద్యోగం ఇస్తున్నారా, జీతబత్యాలు ఇస్తున్నారా, తొడుక్కోవడానికి గుడ్డలు ఇస్తున్నారా అని ప్రశ్నిస్తూ ఆ విద్యార్థుల ముఖాలు పరిశీలిస్తే చాలా అవమానంగా ఫీలవుతున్నట్లు కనబడేవారు. కనీసం వారి తల్లిదండ్రులు వారి రియల్‌ ‌హీరోస్‌ అని ఒక్కరు కూడ చెప్పేవారు కాదు. వాస్తవానికైతే రియల్‌ ‌హీరోస్‌ ‌ప్రజలు ముఖ్యంగా మనిషికి, సమాజానికి కావలసిన వాటన్నింటిని అందించే శ్రామిక వర్గం.
‘ఏం కావాలని చదువుకుంటున్నారు’? అని అడిగితే, కొంత మంది ‘టీచర్లం కావాలని, లెక్చరర్స్‌మి కావాలని, డాక్టర్స్ ‌కావాలని, గ్రూప్‌ ‌వన్‌ ఆఫీసర్‌ ‌కావాలని, ఐ.ఏ.యస్‌., ఐ.‌పి.యస్‌ ఇం‌కా ఏవోవో కావాలని చదువుకుంటున్నాం’ అంతిమంగా ‘ఒక మంచి ఉద్యోగం కోసం చదువుకుంటున్నాను’ అని సమాధానం ఇచ్చేవారు. భారతదేశంలో చదువు లక్ష్యం ఏమిటి? అనే ప్రశ్నకు కూడ సమాధానం వచ్చేది కాదు.
వాస్తవానికి పై వాళ్లు రాసిన ఏ పరీక్ష ప్రశ్నలతో పోల్చిన ఇవి చాలా చిన్న ప్రశ్నలు. మరి ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు? భారతదేశంలో ఇంతేసి చదువుకున్న వాళ్ల పరిస్థితి కూడా ఇలా ఎందుకుంది అని అనిపించేది. పై విద్యార్థులందరు కొన్ని సంవత్సరాలపాటు ప్రార్థన చేశారు. ‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులని… … కాని ఏం లాభం! వాడిని ఎవరు చదివిస్తున్నారో కనీసం ఆ ప్రార్థన అర్థం చేయించలేకపోయింది. అలా కాకుండా ‘భారతదేశం నా మాతృభూమి. భారతదేశంలోని ప్రజలందరు రాత్రింబవళ్ళు శ్రమించి, వారి రక్త మాంసాలు ధారపోసి నన్ను చదివిస్తున్నారు. నేను వారికోసమే చదువుకుంటున్నాను. నా చదువుపూర్తైయిన తర్వాత నా జీవితాన్ని వారి సేవకోసం అంకితం చేస్తాను. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు, నాకు జ్ఞానాన్నిచ్చిన సమాజానికి నేను నా జీవితాంతం ఋణపడి ఉంటాను.’’ అని ఉంటే ఎంత బావుండేది. ఇంతేసి లావున్న ఇన్నేళ్ళు చదువుకున్న ఈ పాఠ్యపుస్తకాలలో ఎక్కడ కూడా ఒక్క వాక్యం ‘మనము నేర్చుకుంటున్న ఈ విద్యను వారి రక్త మాంసాలు ధారపోసి, తమ రెక్కల కష్టంతో ప్రజలు ఇస్తున్నారు’ అని లేకపోవడం ఎంత దురదృష్టకరం! కోట్ల మంది రక్త మాంసాలతో చదివిన ఈ చదువును తిరిగి వారి అభివృద్ధికి కోసం వెచ్చిస్తాను అని చదువుకున్న ప్రతి విద్యార్థికి నేర్పించి ఉంటే ఎంత బావుండు. నేను ఉద్యోగాల కోసం కాదు ‘కనీసం ఒక పౌరుడిని కావడానికి చదువుకుంటున్నాను’ అని ప్రతి చదువుకున్నావాడు ఇన్నేండ్ల స్వతంత్ర భారతదేశంలో అనుకొనివుంటే, అనుకునే విధంగా ఈ దేశ విద్యావిధానం ఉండి ఉంటే ఈ దేశం పరిస్థితి ఈ విధంగా ఉండేదా! ఈ స్వతంత్ర భారతదేశంలో అమలవుతున్న విద్యావిధానం యొక్క లక్ష్యం ‘ఉత్తమ పౌరులను’ తయారు చేసుకోవడంగా లేకపోవడం, కనీసం ఆ వైపు కూడ దృష్టి సారించకపోవడం దురదృష్టకరం. పౌరుడంటే ఎవరు అనే ప్రశ్నకు కాళోజి నారాయణరావు ‘ఎవడైతే అసమ్మతి, నిరసన, ధిక్కారం స్వభావం కలిగి ఉంటాడో వాడే నిజమైన పౌరడు’ అంటాడు.
ఒక పౌరసమాజానికి ఈ పరిపక్వత అంశాలు తెలియక పోవడంవల్ల, అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ దేశం ఇవ్వాలిటి వరకు ఉత్పత్తి చేసుకున్న చాలా మంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగులు, లెక్చరర్స్, ‌టీచర్లు, లాయర్లు, జడ్జీలు, పోలీస్‌ ఆఫీసర్లు అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయనాయకులు, ఇతరత్రా ఎవరైతేనేం ఇంత దరిద్రంగా ఉన్నారనిపిస్తోంది. ఎందుకంటే వారిలో పౌరులు లేరు. అన్నింటికంటే ముఖ్యంగా వారిలో మనిషి కూడా లేడు. వారిలో మనిషి భావన, పౌరసత్వ భావన అంతకంటే లేదు. తాము సుఖంగా ఉండటానికి, జీవించడానికి సరిపడ ఆస్తి సంపాదించుకోవాలని అనుకోవడం ఒక అంశం. కాని భారతదేశంలో అడ్డమైన అడ్డదారులన్నితొక్కి తరతరాలకు సరిపడ ఆస్తిని ఎందుకు సంపాదిస్తున్నారో అర్థం కాదు. తన వారసులు కష్టపడొద్దు అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం. దు:ఖం తెలియని వాడికి సంతోషం అంటే ఏమిటో ఎలా అర్థమవుతుంది?! అమెరికా సమాజం గురించి మాట్లాడేవారు అది సంస్క•తి హీనమైన దేశమని, విచ్చలవిడి వ్యవస్థ ఉందని, ఒక కుటుంబ వ్యవస్థ అంటూ ఏది లేదని చెబుతారు. వాస్తవమే కావచ్చు కాని ఆ దేశంలోని ప్రతి మనిషిలో పౌరసత్వ భావన ఉంది. ఆ దేశం తన పౌరునికి భాద్యత వహిస్తుంది. అలాగే ఆ పౌరుడు దేశానికి భాద్యత వహిస్తున్నాడు కాబట్టే ఆ దేశం అంత ఉన్నత స్థితిలో ఉంది. అమెరికా, ఐరోపా ముఖ్యంగా ఫ్రాన్స్ ‌లాంటి దేశాలలో మనిషిని పౌరుడా అని గర్వంగా పిలిచే విధానం అమలులో ఉంది. మనిషి ఎవరి ఆస్తి అనే ప్రశ్నకు అమెరికా, ఐరోపాలాంటి దేశాలలో సమాజం ఆస్తి, ప్రజల ఆస్తి, దేశం ఆస్తి అని అక్కడి విద్యార్థులు సమాధానం చెబితే, భారత దేశంలో కుటుంబం ఆస్తి అని సమాధానం చెబుతున్నారు. స్వతంత్ర భారతదేశం మనకు నేర్పిన జ్ఞానం ఏంటంటే కుటుంబం ముందు, కుటుంబ ప్రయోజనాల ముందు దేశం ప్రయోజనాలు చాలా చిన్నవిగా మారిపోయాయి. అందుకే వాడిలో దేశభుక్తి భావన తప్ప దేశభక్తి భావన రాదు, వచ్చే అవకాశం కూడా లేదు. అందుకే భారతదేశంలాంటి దేశాలలో కుటుంబ ప్రయోజనాలకోసం ఈ దేశాన్ని, ఈ ప్రజలను వ్యక్తులు కావచ్చు ముఖ్యంగా విద్యావంతులు ఏం చేయడానికైన సిద్ధపడుతున్నారు. పై దేశాలలాగా భారతదేశంలో పౌరసమాజ అభివృద్ధిపై దృష్టిబెట్టే ప్రభుత్వాలు రాకపోవడం ఒక రకంగా దురదృష్టకరం. ప్రభుత్వం అంటే భారతదేశంలో ప్రజలు అనే భావన లేదు. ప్రభుత్వం అంటే కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అనే భావన ఉంది. ఈ దేశంలో ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించదు. అలాగే ప్రజలు ప్రభుత్వానికి భాద్యత వహించరు. ఈ రెసిప్రోకల్‌ ‌పౌర సామాజిక అంశాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకు వెళ్ళగలిగే ఒక ఏజెన్సీ కూడా లేదు. విద్య మాత్రమే దానికి ఏకైక సాధనమైనా అది పౌరులను తయారు చేసే విధంగా లేదు. అరిస్టాటిల్‌ అన్నట్లు ‘‘మంచి విద్య మంచి రాజ్యాన్నిస్తుంది, మంచి రాజ్యం మంచి విద్యనిస్తోంది’’. మంచి విద్యను పొందిన వాడు విద్యావంతుడవుతాడు, మనిషి అవుతాడు. వాడు పౌరుడవుతాడు. ఒక దేశం ఎదుర్కొంటున్న చాలా ఋగ్మతలకు పౌరనిర్మాణమే అంతిమ పరిష్కారం.
అందుకే భారతదేశానికి స్వాతంత్య్రం ఇన్ని సంవత్సరాలు గడిచిన పునర్నిర్మాణామం అటుంచి, పౌరనిర్మాణం జరుగలేదు. అందుకే అవినీతి, కుంభకోణాలు ఈ దేశ అత్యున్నత సార్వభౌమాధికారాన్ని చెలాయించే సంస్థ అయిన పార్లమెంట్‌ ‌వేదికగా జరుగుతున్నాయి. కోర్టులు, మీడియా వీరికి అండగా నిలబడటం, చట్టబద్ధత కల్పించడం దురదృష్టకరం. ‘‘మార్బుల్‌ ‌స్టోన్స్‌పై పెరిగిన వాడు, ఈ మట్టిలో ఆడుకోనివాడు పౌరుడు కాలేడు, ఈ దేశ పునర్న్మిణామంలో, పౌరనిర్మాణంలో ఎప్పుడు భాగస్వామి కూడా కాలేడు’’. అందుకే భారతీయ సమా•ంలోని ప్రతి విద్యార్థిని విద్య ద్వారా ప్రాథమిక దశ నుండే మానవీకరణ వికాసాన్ని చేబట్టి, శీల నిర్మాణాన్ని నిరంతరంగా చేయాలి. పౌరనిర్మాణానికి పాఠశాలనే మంచి ఎజెన్సీ. కొఠారి చెప్పినట్లుగా ‘తరగతి నుండే ఈ దేశ భవిష్యత్తు రూపుదిద్దుకొంటుంది’ అనే మాటను ఈ పాలకులు, పార్లమెంట్‌ ‌పదే పదే వల్లెవేయడం కాదు, అదే కొఠారి చెప్పినట్లుగా పాఠశాలను, పాఠ్యాంశాలను, ఉపాధ్యాయులను, తరగతి గదిని మార్చాలి. అప్పుడే ఈ సమాజం నిలబడుతుంది లేకపోతే పతనం చెందుతుంది. ఒక సందర్భంలో వివేకానందుడు ‘‘లక్షల మంది ఆకలితో, అజ్ఞానంతో జీవిస్తున్నప్పుడు వారి ఖర్చుతో చదువుకొని వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ప్రతి మనిషిని ద్రోహిగా పరిగణిస్తాను’’ అని అంటాడు. కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్‌ ‌చాన్స్‌లర్‌, ‌తెలంగాణ ఉద్యమ సిద్దాంతకర్త డా।।జయశంకర్‌ ‌సార్‌ ‌కూడా ‘‘విద్యావంతులు మౌనంగా ఉండటం ఈ దేశానికి, సమాజానికి అనర్థదాయకం’’ అని ఎప్పుడు చెప్పేవాడు. కాబట్టి ఇప్పటికైన ఈ దేశంలోని విద్యావంతులు ఈ వ్యవస్థలో, సమాజంలో అంతరిస్తున్న మానవీయ విలువల్ని, నైతిక విలువల్ని, నీతిని, నిజాయితీని అన్నింటికి మించి పౌరవిలువలను పున:రుద్దరించడానికి నడుంబిగించి ఒక రినైజాన్స్‌ను సృష్టించాలి. అప్పుడే ఈ దేశ స్వాతంత్య్రం కోసం, సామాజిక నిర్మాణం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలకు సార్థకత. లేకపోతే భవిష్యత్తు తరాల చరిత్ర మనలను ద్రోహులుగా చిత్రీకరిస్తుంది. దేశ పునర్నిర్మాణమంలో విద్యావంతుల ముందున్న అతి పెద్ద సవాల్‌ ‌కూడా ఇదే.
‘‘మనిషి సమాజం ఆస్తి అని చెప్పిన మా నాన్న ఏరుకొండ వెంకటేశం సంస్మరణలో… …’’

డా।। ఏరుకొండ నరసింహుడు,
రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి, తెలంగాణ
టీచర్స్ ‌యూనియన్‌
(‌టి.టి.యు) )9701007666

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy