Take a fresh look at your lifestyle.

దిగ్గజాలను కోల్పోతున్న కాంగ్రెస్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతున్నది. కోల్పోయిన ప్రాభవాన్ని పునరుద్ధరించుకునేందుకు నాయకులందరిని సమాయత్తం చేసి ప్రోత్సహించాల్సిన రాష్ట్ర నాయకత్వం, పార్టీ క్షీణించిపోతున్నా గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చుంటున్నది. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే మొదటినుంచి భిన్నాభిప్రాయాలు, భిన్నధృవాలుండే పార్టీగా పేరుంది. గ్రూపురాజకీయాలు, పదవుల కాంక్ష, పెత్తందారి తనం కలబోసుకుని పుట్టిందా పార్టీ. ఒక పక్క దిగజారిపోతున్నా తమ పంతాన్ని నెగ్గించుకోవడమే ధ్యేయంగా పనిచేసే నాయకత్వం కారణంగా ఆ పార్టీ గత ఆరేళ్ళుగా ఎదురుదెబ్బలు తింటూనే ఉంది. అయినా పార్టీని పటిష్టపర్చుకోవాలన్న అవగాహన ఇక్కడి నాయకులకు కొరవడిన ఫలితంగానే పార్టీ ఛిన్నాభిన్నమైపోతున్నది. స్థానిక నాయకత్వంపైన అలిగిన పలువురు సీనియర్‌ నాయకులు ఎవరి రాజకీయ భవిష్యత్‌ను వారు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తమకు అనుకూలమనిపించే ఇతర పార్టీల్లోకి మారుతుండడంతో రాష్ట్రంలో ఆపార్టీ అధ్వాన్న పరిస్థితికి చేరుకుంది. తాజా శాసనసభ ఎన్నికల్లో కేవలం 19 స్థానాలను గెలిస్తే నేటికి ఇంచుమించు పద్నాలుగురికి పైగా ఎంఎల్‌ఏలు ఇతర పార్టీల్లో చేరిపోతున్న పరిస్థితులున్నాయి. వీరిలో ఎక్కువగా అధికార పార్టీచేపట్టిన ఆకర్ష్‌ పథకానికి ఆకర్షితులైనవారే. తాజాగా కొల్హాపూర్‌ ఎంఎల్‌ఏ బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా గులాబీకారులో ప్రయాణిస్తాడన్న వార్తలు వస్తున్నాయి. అలా అయితే ఆయన చేరికతో కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన వారి సంఖ్య తొమ్మిదికి చేరుకుంటుంది. ఇప్పటికే కాంగ్రెస్‌, టిడిపి నుండి టిఆర్‌ఎస్‌లోకి చేరికలతో ఇప్పుడాపార్టీ సెంచరీ కొట్టింది.టిఆర్‌ఎస్‌ తాజా శాసనసభఎన్నికల్లో కేవలం 88 స్థానాలను గెలుచుకోగా, ఈచేరికలతో కలిపి ఇప్పుడాపార్టీ ఎంఎల్‌ఏల సంఖ్య 101 కానుంది. ఇదిలా ఉంటే స్థానిక నాయకత్వం సమర్థవంతంగా లేకపోవడంవల్లే కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని నష్టం జరుగుతుందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. పార్టీలో పెత్తనం విషయంలో రాజీపడకపోవడం కారణంగా సీనియర్లమద్య అభిప్రాయభేదాలున్నాయి. అవి ఎన్నికలపైన, పార్టీ ప్రతిష్టపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో ఆపార్టీ దిగ్గజాలను కోల్పోతున్నది. తాజాగా డికె అరుణ నిష్క్రమణ అందుకు ప్రధాన ఉదాహరణ. డికె అరుణ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం యావత్‌ రాజకీయరంగాన్నే ఆశ్చర్యపరిచింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో డికె వర్గీయులదే రాజ్యం. ఇక్కడ పేరున్న గద్వాల సంస్థానానికి రాజులుగా చెలామణి అయిన వీరి పూర్వికులనుండి నేటి వరకు అక్కడి రాజకీయాలు వారి చేయ్యిదాటి పోలేదు. పౌరుషానికి, కళలకు, సాహిత్యానికి ఈ సంస్థానం పూర్వం నుండి ప్రత్యేకతను చాటుకుంది. కృష్ణా, తుంగభద్రా నదుల మధ్య గల ఈ ప్రాంతానికి సుమారు రెండున్నర శతాబ్దాల గొప్పచరిత్ర ఉంది. స్వాతంత్య్రానంతరం 1956లో ఏర్పడిన గద్వాల నియోజకవర్గంలో ఒకటి రెండు సార్లు మినహా డికె వారసులదే పాలన. విచిత్ర విషయమేమంటే ఏపార్టీ పరంగా గెలిచినా, గెలిచేది మాత్రం డికె కుటుంబ సభ్యులు కావడం విశేషం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికి పద్నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మినహా వారే గెలుస్తూ వస్తున్నారు. అలాంటి సంస్థానం నుండి వచ్చిన డికె అరుణ అలియాస్‌ జేజమ్మ పార్టీ మారడమన్నది కాంగ్రెస్‌పార్టీకి, అందునా పార్లమెంటు ఎన్నికల ముందు పెద్ద షాక్‌ అనే చెప్పాలి. దీనికి డికె అరుణ చెబుతున్న కారణమేమంటే బలమైన అభ్యర్థులను బలహీనపర్చడమే స్థానిక నాయకత్వం చేస్తున్న పని అన్నది. ఈ ప్రాంతంలో బలమైన అభ్యర్థుల ఎదుగుదలకు పార్టీపరంగా కృషిచేయకపోగా, స్వయంగా ఎదుగుతున్న వారికాళ్ళకు అడ్డుపడుతున్నారన్నది ఆమె అభియోగం. ఆ కారణంగానే తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పది స్థానాలకు గాను ఒక్క స్థానాన్ని కూడా కాంగ్రెస్‌ గెలుచుకోలేకపోయిన విషయాన్ని ఆమె గుర్తుచేస్తున్నారు. 1996లో తన రాజకీయ అరంగేట్రం ప్రారంభించిన డికె అరుణ ఇప్పటికి మూడు సార్లు ఎంఎల్‌గా గెలిచి, ఇద్దరు ముఖ్యమంత్రుల క్యాబినెట్‌లో మంత్రిపదవులు నిర్వహించింది. తాజా శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలపైన పెద్దగా ఆసక్తి కనబర్చకుండా మౌనంగా ఉన్న అరుణకు, టిపిసిసి నాయకత్వంపైన అసహనం ఉంది. అంతేకాదు, తనకే ఆపదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ పలుసందర్భాల్లో తన మనసులోని మాటను బయటపెట్టింది. కాని, అధిష్టానం మాత్రం ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. అమె ఇప్పుడు పార్టీ మారడానికి ఇదే ప్రధానకారణమైంది. దానికి తోడు మహబూబ్‌నగర్‌లో దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న తమ కుటుంబానికి కాకుండా మరొకరిని ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్‌ అధిష్టానం ఖరారు చేసి టికెట్‌ ఇవ్వడం మరింత కోపానికి కారణమైంది. ఎవరూ ఊహించనిరీతిలో మంగళవారం రాత్రి ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో కాషాయ కండువ కప్పించుకుంది. దీంతో దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌తో అనుబంధమున్న డికె కుటుంబం ఆ పార్టీకి దూరమైంది. తన రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు టిడిపి నుండి మహబూబ్‌నగర్‌ ఎంపి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిందో ఇప్పుడు బిజెపినుండి అదే నియోజకవర్గ ఎంపిగా ఆమె పోటీచేయబోతున్నట్లు తెలుస్తున్నది. కాగా, కాంగ్రెస్‌లోని మరో దిగ్గజం కుందూరు జానారెడ్డి కూడా తన కుమారుడిని బిజెపిలోకి పంపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దానిపై స్వయంగా రాహుల్‌ ఫోన్‌చేసి సంయమనం పాటించమని ఆయనకు విజ్ఞప్తి చేయడం వేరే విషయం. చాలాకాలంగా జానారెడ్డి కూడా అసంతృప్తితో ఉన్నవిషయం తెలియందికాదు. ఆ పార్టీకి చెందిన మరో సీనియర్‌ నాయకుడు మాజీ ఎంఎల్‌ఏ సోయం బాపురావ్‌ ఇప్పటికే ఆ పార్టీలో చేరిపోయాడు. మరికొందరు ఆ పార్టీ వర్గాలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఒక పక్క టిఆర్‌ఎస్‌, మరోపక్క బిజెపిల ఆకర్ష్‌లతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలవేళ విలవిలలాడిపోతున్నది.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy