వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దిగజారిన జిడిపి 5శాతం నమోదు ..!

August 30, 2019

దిల్లీ: ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు ప్రకటించి మూడు రోజుల కాకముందే.. మరోవైపు దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) క్రమంగా 5 శాతాని• పడిపోయినట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి… జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి జీడీపీ వృద్ధిరేటు 5.8 శాతం నుంచి 5 శాతానికి దిగజారింది. ఇది ఆరేళ్ల కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. తయారీ రంగంలో క్షీణత, వ్యవసాయోత్పతుల్లో స్తబ్ధత కారణంగా 2019-20 ఏప్రిల్‌ -‌జూన్‌ ‌త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతానికి పరిమితమైందని శుక్రవారం విడుదలైన కేంద్ర గణాంకాలు వెల్లడించాయి.
మరోవైపు, తయారీ రంగంలో గ్రాస్‌ ‌వాల్యూ యాడెడ్‌ (‌జీవీఏ) వృద్ధి 0.6శాతంగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది 12.1 శాతంగా ఉంది. వ్యవసాయం రంగంలో జీవీఏ 2శాతంగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌ – ‌జూన్‌ ‌త్రైమాసికంలో 5.1గా నమోదైంది. నిర్మాణ రంగంలో గత ఏప్రిల్‌ – ‌జూన్‌ ‌త్రైమాసికంలో 9.6శాతంగా నమోదైన జీవీఏ 5.7 శాతానికి దిగజారింది. మైనింగ్‌ ‌రంగంలో మాత్రం వృద్ధిరేటు 0.4 నుంచి 2.7శాతానికి పెరిగింది. జీడీపీ వృద్ధిరేటు తగ్గవచ్చని ఇటీవల ఆర్బీఐ సైతం పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ అంచనాలను ఇటీవల 7శాతం నుంచి 6.9శాతానికి సవరించిన ఆర్బీఐ .. మొదటి అర్ధభాగంలో 5.8 నుంచి 6.6 శాతం మధ్య నమోదు కావొచ్చని పేర్కొంది. ద్వితియార్థంలో 7.3 నుంచి 7.5శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది.2012-13 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ – ‌జూన్‌ ‌త్రైమాసికంలో 4.9గా నమోదైన జీడీపీ ఆ తర్వాత ఈ స్థాయిలో క్షీణించడం ఇదే తొలిసారి. కార్ల నుంచి బిస్కెట్ల వరకు అమ్మకాల్లో తగ్గుదల, వివిధ రంగాల్లో ఉద్యోగులకు ఉద్వాసన, వినియోగదారుల కొనుగోళ్లలో తగ్గుదలతో పాటు ప్రైవేటు పెట్టుబడుల క్షీణత వల్ల జీడీపీ దిగజారినట్టు ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.