వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తెలంగాణను తాకిన కశ్మీరం

August 8, 2019

కేంద్రానికి మద్దతు, కాంగ్రెస్‌కు ఝలక్‌లిచ్చిన ఫైర్‌‌బ్రాండ్లు రాములమ్మ, జగ్గారెడ్డి వ్యాఖ్యలు ధిక్కారమేనా?

హైదరాబాద్‌ : ‌కశ్మీర్‌ ‌ప్రకంపనలు తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీని  తాకాయి. కాంగ్రెస్‌ ‌పార్టీలో చిచ్చుపెట్టే విధంగా అగుపిస్తున్నాయి. ఉత్తరాది కాంగ్రెస్‌ ‌నేతలకు తామేమీ తక్కువేమీ కాదన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో ఫైర్‌‌బ్రాండ్లుగా పేరుపొందిన విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ, తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీకి ఝలక్‌లిస్తున్నారు. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అని ఒకరంటుంటే…మరొకరు మోదీ తీసుకున్న నిర్ణయం సమర్ధనీయంగా ఉందనీ ప్రశంసించిన తీరు పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తుంటే…అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి ఈ కశ్మీర్‌ అం‌శం కాస్త కాంగ్రెస్‌ ‌పార్టీ కూసాలు కదిలించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.  ఇదిలా ఉంటే, కశ్మీర్‌పై కేంద్రంలోని మోదీ సర్కార్‌ ‌తీసుకున్న నిర్ణయానికి సోనియాగాంధీ కుటుంబానికి వీరవిధేయులుగా ఉన్న ఉత్తరాదికి చెందిన జనార్ధన్‌ ‌ద్వివేది, జ్యోతిరాదిత్య సింధియా,రాజ్యసభలో కాంగ్రెస్‌ ‌విప్‌గా వున్న భువనేశ్వర్‌ ‌కలిత తదితరులు మద్దతును ప్రకటించిన విషయం విధితమే. ఉత్తరాది తరహాలోనే దక్షిణాదిలోని తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో ఫైర్‌‌బ్రాండ్లుగా పేరున్న రాములమ్మ, జగ్గారెడ్డి ఇద్దరు నేతలు సమర్థిస్తూ మాట్లాడిన తీరు ఇప్పుడు హాట్‌ ‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ ‌పార్టీని మాత్రం ఒక కుదుపు కుదేపిస్తుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ముఖ్య నేతలెవరూ అంతగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ, విజయశాంతి, జగ్గారెడ్డి మాత్రం  కశ్మీర్‌ ‌విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. సొంత పార్టీకి షాకిచ్చినంత పని చేశారు.

శుభపరిణామమంటున్న రాములమ్మ…
కాంగ్రెస్‌ ‌పార్టీలో గత కొన్ని రోజులుగా సైలెంటుగా ఉంటున్న విజయశాంతి…సోషల్‌ ‌మీడియా వేదిక ద్వారా అటు కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలోని టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సర్కార్‌ను తనదైనశైలిలో విరుచుకుపడుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారంటూ తరుచూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అయితే, ఉన్న ఫలంగా తాజాగా…కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌పై తీసుకున్న నిర్ణయం శుభపరిణామం అని అంటున్న తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇంకా ఏమన్నారంటే.. జమ్మూ-కశ్మీర్‌ ‌విభజన బిల్లుతో పాటూ ఆర్టికల్‌ 370‌ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు రాహూల్‌ ‌గాంధీ కుడిభుజం, కాంగ్రెస్‌ ‌యువనేత జ్యోతిరాదిత్య సింధియా ప్రకటించడం, కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించడం శుభపరిణామం. నిన్న కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, గాంధీ- నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడైన జనార్ధన ద్వివేది కూడా కేంద్రం జమ్ము, కశ్మీర్‌ ‌విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించారు. ఇప్పుడు దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని జ్యోతిరాదిత్య సింధియా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నా…దేశ భద్రత విషయంలో రాజీ పడకూడదన్నది కాంగ్రెస్‌ ‌సిద్ధాంతం. కాంగ్రెస్‌లోని మెజారిటీ కార్యకర్తలు జమ్ము- కశ్మీర్‌ ‌విభజనతో పాటూ ఆర్టికల్‌ 370‌ను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నారు. వీరి అభిప్రాయలను ప్రతిబింభించే విధంగా జనార్ధన ద్వివేదితో పాటూ జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలు కూడా కేంద్రం జమ్ము కశ్మీర్‌ ‌విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించినట్లు భావిస్తున్నాననీ విజయశాంతి అన్నారు. వీరిద్దరితో పాటూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది నేతలు కశ్మీర్‌ ‌విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించవచ్చు.  పార్టీలు వేరైనా దేశ భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడే విషయంలోనూ, శత్రు దేశ కుట్రలను తిప్పి కొట్టడంలోనూ కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా తమ గళాన్ని వినిపిస్తారనే విషయం సింధియా, ద్వివేది ప్రకటనల ద్వారా మరోసారి రుజువైంది. కశ్మీర్‌ ‌విభజనతో సుదీర్ఘ కాలంగా రగులుతున్న సమస్యకు పరిష్కారం లభించాలని, అక్కడి ప్రజలు సుఖ,శాంతులతో జీవనం సాగించాలని కోరుకుంటూ…వందే మాతరం…జైహింద్‌ అం‌టూ విజయశాంతి తన ప్రకటనను ముగించారు.

మోదీ నిర్ణయం సరైందేనంటున్న జగ్గారెడ్డి
కశ్మీర్‌ అం‌శంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ ‌షా వైఖరిని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన మరో ఫైర్‌‌బ్రాండు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డీ సమర్ధించారు. అప్పుడున్న పరిస్థితులను బట్టి కశ్మీర్‌ అం‌శంపై నెహ్రూ చేసిన పని, నేటి పరిస్థితుల నేపథ్యంలో మోదీ, అమిత్‌షా తీసుకున్న నిర్ణయం సరైనవేనని అభిప్రాయపడ్డారు.ఆర్టికల్‌ 370, 35(ఏ) ఎత్తేయాలని ఆరెస్సెస్‌ ‌ముందునుంచీ అనుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మోదీ, షా ఆర్టికల్‌ 370, 35(ఏ) ‌రద్దు చేయడం సరైందే. అప్పటి పరిస్థితుల తగ్గట్టు నాటి ప్రధాని నెహ్రూ చేసింది కూడా సరైందే. కశ్మీర్‌ను కాడాడటంలో నాడు నెహ్రూ కీలక పాత్ర పోషించారు. కశ్మీర్‌ను నెహ్రూ కాపాడారు కాబట్టే ఈ రోజు మోదీ, షా ఈ నిర్ణయం తీసుకోగలిగారు. దేశానికి బీజేపీ, కాంగ్రెస్‌ ‌రెండు పార్టీలు అవసరమేననీ జగ్గారెడ్డి తనదైనశైలిలో కేంద్ర నిర్ణయానికి మద్దతును ప్రకటించారు.

కాంగ్రెస్‌ ‌పార్టీ కూసాలు కదిలిస్తున్న కశ్మీర్‌?

పార్టీ శ్రేణుల్లో అయోమయం
తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో రాములమ్మ, జగ్గారెడ్డి ఈ ఇద్దరు నేతలు ఒక విలక్షణమైన నేతలే. అటు ప్రజల్లో, ఇటు పార్టీలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన నేతలనే చెప్పాలి. అయితే, ఇద్దరు నేతలు స్టైల్‌ ‌కాస్త డిఫరెంటుగా ఉంటుంది. ఒకరేమో కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన గాంధీభవన్‌లోనే కూర్చోని నేను తెలంగాణ భవన్‌(‌టిఆర్‌ఎస్‌)‌లో ఉంటానో, గాంధీభవన్‌(‌కాంగ్రెస్‌)‌లో ఉంటానో చెప్పలేనంటూ తరుచూ వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా ఉంటారు. మరొకరేమో కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్నప్పటికీ…కాంగ్రెస్‌ ‌రాష్ట్ర నేతల తీరుపై రగిలిపోతూ…పార్టీ కార్యకలాపాలకు గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు. జగ్గారెడ్డేమో పార్టీలో ఉంటారో తెలియదు, పార్టీని ఎప్పుడు వీడుతారో ఎవరికీ తెలియని అయోమయ పరిస్థితి. ఇక విజయశాంతికేమో పొమ్మనలేక పార్టీలో ఒకరిద్దరు నేతలు పొగపెడుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. దీనిలో భాగంగా గత కొన్ని రోజులుగా మీడియాకు వరుసగా లీకులివ్వడమేనన్న అభిప్రాయంలో విజయశాంతి సన్నిహితులున్నట్లు తెలుస్తుంది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ ఇద్దరు నేతల పూర్వాశ్రమం బిజెపినే. గత కొన్ని రోజులుగా మీడియాలో ఇద్దరు నేతలే గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనుకుని మాట్లాడినట్లుగానే ఈ ఇద్దరూ కశ్మీరంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న తీరే కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అనేక మంది పార్టీని వీడారు. మరికొందరు అదే బాటలో ఉన్నట్లు సమాచారం. వీరికి తోడుగా…కాంగ్రెస్‌ ‌పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ తీరు సమర్ధనీయమనీ, శుభపరిణామమనీ మాట్లాడటంతో పార్టీ మరింత బలహీనపడే అవకాశం ఉందనీ కొందరు వాదిస్తుండగా..మరికొందరేమో రాములమ్మ, జగ్గారెడ్డి వ్యాఖ్యలు  పార్టీ ధిక్కారణ కిందకే వస్తాయన్న వాదన కూడా పార్టీలో వినిపిస్తున్నారు. ఏది ఏమైనా, మొత్తానికి కశ్మీర్‌ అం‌శం తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలోనూ చిచ్చుపెట్టడమే కాకుండా, పార్టీ కూసాలను కదిలించినా ఆశ్చర్యపడాల్సింది లేదనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరకు ఇది ఎటు వైపు దారి తీస్తుందోననీ కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్న కిందిస్థాయి శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి!