Take a fresh look at your lifestyle.

తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు

  • శ్రీదేవీ సమేతంగా మాడవీధుల్లో ఊరేగిన శ్రీవారు
  • మూడు రోజుల పాటు వివిధ సేవల నిలిపివేత

తిరుమల, ఏప్రిల్‌ 3 : ‌తిరుమల  శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు  ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఈ నెల 5 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 5 వరకూ స్వామివారికి కల్యాణోత్సవం, ఊంజల్‌ ‌సేవ నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది చైత్రశుద్ధ పౌర్ణమికి ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్‌ 3 ‌నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం , సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీదేవి సమేతంగా శ్రీమలయప్ప స్వామి వారుని ఆలయ నాలుగు మాడ వీధిలో ఊరేగించారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. వసంతోత్సవ అభిషేక నివేదన పూర్తయిన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనే, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 4 నుంచి 6.30 గంటల వరకు శ్రీవారి ఆలయంలో ఘనంగా ఆస్థానం నిర్వహించనున్నారు. చివరిరోజైన ఏప్రిల్‌ 5‌న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ’వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం వసంతోత్సవంలో ప్రధాన పక్రియని అధికారులు వెల్లడించారు.

ఒంటిమిట్టలో వార్షిక బ్రహ్మోత్వసాలు
నవనీత కృష్ణాలంకారంలో రామయ్య ముగ్ధమనోహర రూపం

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 3 : ఒం‌టిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం నవనీత కృష్ణాలంకారంలో రాములవారు ముగ్ధమనోహరంగా దర్శనమిచ్చారు. ఉదయం 8 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేరళ డ్రమ్స్, ‌భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. పురాణాల ప్రకారం.. కృష్ణుడు వెన్నదొంగ. రేప్లలెలో బాలకృష్ణుడు యశోదమ్మ ఇంట్లోనే గాక అందరి ఇళ్లలోకి వెళ్లి వెన్న ఆరగించేవారు. ఈ చిన్నికృష్ణుడి లీలలను గుర్తు చేస్తూ రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు.  కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ  నటేష్‌ ‌బాబు, మాన్యుస్క్రిప్ట్ ‌ప్రాజెక్టు ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఈఓ  గోపాలరావు, సూపరింటెండెంట్లు  పి.వెంకటేశయ్య,  ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్‌ ఇన్స్పెక్టర్‌ ‌ధనంజయ పాల్గొన్నారు.

Leave a Reply