వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తక్షణ న్యాయం సాధ్యపడదు!

December 7, 2019

ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమన్న భావన సరికాదు
అలా జరిగితే న్యాయం స్వరూపాన్ని, అర్థాన్ని కోల్పోతుంది
సుప్రీమ్‌కోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌శరద్‌ అర్వింద్‌ ‌బోబ్దే
దిశ కేసుపై సిట్‌తో ‘సుప్రీమ్‌’ ‌పర్యవేక్షించాలంటూ పిటిషన్‌
ప్రతీకార చర్యలతో న్యాయాన్ని ఆశించలేమని సుప్రీం చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సీజే ఎస్‌ఏ ‌బాబ్డే అన్నారు. న్యాయం ఎప్పుడూ ప్రతీకార రూపంలో ఉండకూడదని బాబ్డే అన్నారు. రాజస్థాన్‌ ‌రాష్ట్రంలోని జయపురలో హైకోర్టు కొత్త భవనాన్ని సీజేఐ జస్టిస్‌ ‌బాబ్డే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణ న్యాయం సాధ్యపడదని తాను భావిస్తున్నానన్నారు. న్యాయం అనేది ప్రతీకార రూపంలో ఉంటే దాని లక్షణం కోల్పోతుందన్నారు. న్యాయ వ్యవస్థలో తప్పులు సరిదిద్దుకునే వ్యవస్థ తేవాల్సి ఉందన్నారు. కేసుల పరిష్కారానికి తప్పనిసరిగా మధ్యవర్తిత్వ వ్యవస్థ ఉండాలన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ‌నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు సీజే ఎస్‌ఏ ‌బాబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించకుండానే.. సత్వర న్యాయం అనేది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. జస్టిస్‌ అనేది ప్రతీకారం రూపంలో ఉండకూడదన్నారు. అలా జరిగితే న్యాయం రూపు రేఖలు కోల్పోతుందని వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌ ‌హైకోర్టు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమనేది ఇన్‌స్టెంట్‌గా జరగడం కుదరదని బోబ్డే స్పష్టం చేశారు. పగ, ప్రతీకారం తీర్చుకోవడమే న్యాయమన్న భావనకు వస్తే.. జస్టిస్‌ అనేది దాని స్వరూపాన్ని, అర్థాన్ని కోల్పోతుందని అన్నారు. అయితే ఇటీవల జరుగుతున్న ఘటనలతో న్యాయం వేగంగా జరగాలని, న్యాయవ్యవస్థ మారాలని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని అన్నారు. కచ్చితంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని, విచారణ ఆలస్యం తగదని, కానీ, ఇన్‌స్టెంట్‌ ‌జస్టిస్‌ అనేది ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు. జస్టిస్‌ అనే ఎప్పటికీ ప్రతీకారంగా మారకూడదని, అలా జరిగితే జస్టిస్‌ అనేది దాని స్వరూపాన్ని కోల్పోయినట్లే అని సీజేఐ అన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయడం గురించి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో కొత్త టెక్నాలజీల అవసరం ఉందని జస్టిస్‌ ‌బోబ్డే అన్నారు. డియేషన్‌ ‌వంటి విధానాల ద్వారా కేసులను త్వరగా పరిష్కరించేలా మార్పులు జరగాలన్నారు. ప్రజలకు న్యాయం అందుబాటులోకి వచ్చేలా ఉన్న వ్యవస్థల్ని పటిష్టం చేయాలని సీజేఐ చెప్పారు. న్యాయం కాస్‌ట్లీగా మారకూడదని, కేసులను త్వరగా పరిష్కరించేందుకు.. ప్రజల్లో నమ్మకం పెంచేందుకు కొత్త మార్గాలను చూడాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఆలస్యం వల్ల నిరాశ, నిస్పహతో ప్రజలకు నమ్మకం పోతుందని సుప్రీంకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌స్పష్టం చేశారు. అంతకుముందు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ‌ప్రసాద్‌ ‌మాట్లాడుతూ.. రేప్‌ ‌కేసుల్లో త్వరగా తీర్పులు వెలువడాలన్న భావనను వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో సీజేఐ విభేదించారు. ఇక వ్యవస్థగా న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూనే.. అప్పటికే ఉన్న సంస్థలను మరింత బలపరుస్తూ.. వేగవంతంగా, సంతృప్తికరంగా వివాదాల్లో రాజీ కుదర్చాలి లేదా పరిష్కారం చూపాలని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ, వ్యాజ్యాలలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక వ్యాజ్యం పరిష్కారంలో ఎక్కువ సమయం తీసుకుంటే నేరానికి పాల్పడినట్టేనన్నారు. ఇదిలావుంటే దిశ కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ ‌దాఖలైంది. ఈ ఘటనపై సిట్‌ ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించాలని కోరుతూ అడ్వకేట్‌ ఎంఎల్‌ ‌శర్మ ఈ పిటిషన్‌ ‌వేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని చంపడాన్ని సమర్ధించిన రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌, ‌ఢిల్లీ మహిళా కమిషన్‌ ‌చీఫ్‌ ‌స్వాతి మలివాల్‌పై చర్యలు తీసుకోవాలని కూడా పిటిషనర్‌ ‌కోరారు. అత్యాచారం కేసుల్లో నిందితులు దోషులుగా తేలేంతవరకూ టీవీ ఛానల్స్‌లో చర్చా కార్యక్రమాలు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును శర్మ కోరారు. కాగా, దీనికి ముందు న్యాయవాదులు జీఎస్‌ ‌మణి, ప్రదీప్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌లు సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌వేశారు. 2014లో అత్యున్నత న్యాయస్థానం నిర్దేశిరచిన మార్గదర్శక సూత్రాల ఉల్లంఘన జరిగిందని వీరు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌పై ఎఫ్‌ఐఆర్‌ ‌నమోదుకు, విచారణకు, ఈ ఘటనలో ప్రమేయమున్న పోలీసు సిబ్బందిపై చర్యలకు ఆదేశించాలని వారు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.
1023 ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌స్పెషల్‌ ‌కోర్టుల ఏర్పాటు మైనర్లతో సహా అత్యాచారం కేసులను త్వరితగతిన విచారించడం మరియు నివారణ కోసం 1023 ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌స్పెషల్‌ ‌కోర్టులను (ఎఫ్‌టిఎస్‌సి) ఏర్పాటు చేసే పథకాన్ని రుపొందించినట్లు మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మ•తి ఇరానీ తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు రూ.767.25 కోట్లు ఖర్చవుతుందని స్మతి ఇరానీ పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమధానం ఇచ్చారు. ఇందులో కేంద్రం రూ.474 కోట్లు సమకూరుస్తుందని ఆమె చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో 218 ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయంలో ఉత్తర ప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు.