- 66 కోట్ల వ్యక్తిగత సమాచారం లీక్
- ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ అరెస్ట్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : డేటా లీకు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. 66 కోట్ల మంది డేటా లీక్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. 66 కోట్ల వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేసిన ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తెచ్చిన డేటా లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా దర్యాప్తులో భాగమయ్యాయి. ముంబై, హైదరాబాద్, దిల్లీకి చెందిన ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నారు. జస్ట్ డయల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల నుంచి డేటా చోరీ అయినట్లుగా గుర్తించారు. 6 మెట్రోపాలిటిన్ సిటిల్లో 4.5 లక్షల ఉద్యోగులను భరద్వాజ్ నియమించుకున్నాడు.
మొత్తం 24 రాష్ట్రాలకు చెందిన డేటాను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. 104 విభాగాలకు చెందిన వ్యక్తులు, సంస్థల డేటా విక్రయించగా.. అమోజాన్, నెట్ ప్లిక్స్, యూట్యూబ్, పేటీఎం, ఫోన్ పే, బిగ్ బాస్కెట్, బుక్ మైషో, ఇన్ స్టా గ్రామ్, జొమాటో, పాలసీ బజార్ సహా మరికొన్ని సైట్ల డేటాను వీరు అమ్మేశారు. ఆయా వ్యక్తుల ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, అడ్రస్ లను విక్రయించారు. వీటితో పాటు 9, 10, 11, 12 తరగతులు విద్యార్థులు డేటా, పాన్‌కార్డ్, క్రెడిట్‌కార్డ్, డెబిట్ కార్డ్, ఇన్సూరెన్స్, ఇన్‌కంట్యాక్స్, ఢిఫెన్స్ డేటా కూడా చోరికి గురైంది. 66 కోట్ల మంది డేటా చోరీకి గురవ్వగా…ఇందులో హైదరాబాదీలకు చెందిన కోటి మంది డేటా చోరీ అయ్యింది. అదే విధంగా ఆంధప్రదేశ్‌కు చెందిన రెండు కోట్ల 50 లక్షల మంది డేటా.. మహారాష్ట్రకు చెందిన నాలుగు కోట్ల మంది డేటా చోరీ అయ్యిందని అధికారులు గుర్తించారు.