అంత్రాన ఆ గోళాలను
గిరగిర తిప్పుతున్న దెవరు
మిన్ను మన్ను ల మధ్యన
ఆ బంతులతో
ఆడుకుంటున్న దెవరు
అటు – ఇటు
అంతు తెలువని మైదానం
గోళాలలోని జీవులకు
సర్కస్ గ్లోబులో సవారి చేసినా
పడిపోనట్లు ఉంటుంది
గోళాల అస్తిత్వానికి
ఊపిరి పోస్తున్న దెవరు
శూన్యం రహదారుల్లో గోళాలకు
గందర గోళం లేకుండా
దారులు చూపుతున్న
ట్రాఫిక్ పోలీస్ ఎవరు?
ఎంతటి క్రమశిక్షణ!
ఎంతటి సమయ పాలన!
అంతటి సుశిక్షిత శిక్షకుడెవరు!
కక్ష్యలలో తిరుగుతున్నా వాటి
కక్షలు లేని అరమరికల
నీడలే
చీకటి వెలుగుల గోడలు !
భ్రమణాలు పరిభ్రమణాలలో
జీవులంతటికి రక్షణ కల్పిస్తున్న
ఆ అదృష్య రక్షకుడెవరు ?
– పి.బక్కారెడ్డి
9705315250