Take a fresh look at your lifestyle.

టీ కాంగ్రెస్‌ ‌లో ముసలం

తెలంగాణ కాంగ్రెస్‌ ‌లో ముసలం మొదలైంది. అలవాటైన గ్రూపు తగాదాలు మళ్ళీ మొదటికొచ్చాయి. అంతర్గత ప్రజాస్వామ్యం మరో సారి ప్రజ్వరిల్లుతోంది.ఐక్యమత్యం డొల్లేనని తేలిపోయింది. నా•యకుల మధ్య ఆదిపత్య పోరు అలవాటుగా మారింది.ముంచుకొస్తున్న ముప్పును వదిలేసి పదవుల కోసం సీనియర్‌ ‌నాయకుల పాకులాటలు ప్రారంభమయ్యాయి. ఒకరి వెనుక మరొకరు గోతులు తీసుకుంటున్నారు. పరుగుతున్న నాయకుల కాళ్లకు అడ్డంకులు స్రుష్టించి ఆనందపడుతున్నారు. పార్టీని పక్కన పడేసి వ్యక్తిగతస్వార్థం కోసం పాకులాడుతున్నారు. కార్యకర్తల మనోభావాలను వదిలేసి తమ మనుగడే ముఖ్యమన్నట్లుగా కొందరు నేతలు వ్యవహారిస్తున్నారు. జాతీయ స్థాయిలో పతనం అంచున ఉన్న కాంగ్రెస్‌ ‌ను కాపాడుకునే ప్రయత్నాలను పక్కన పడేసి మరింత పాతాళానికి నెడుతున్నారు. పాత కాలపు ఆ వాసనలను వదిలించుకోకుండా ఆ మురికిలోనే కొట్టుమిట్టాడుతున్నారు. అవును కాంగ్రెస్‌ ‌బతికి బట్టకట్టడం కష్టంగా కనిపిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం ముసుగులో ఆ పార్టీ నాయకులు వేస్తున్న వేషాలు నవతరానికి ఏవగింపుగా తయారయ్యాయి. ప్రత్యామ్నాయం లేనప్పుడు కాంగ్రెస్‌ ఎన్ని ఆటలు ఆడినా నడిచిపోయింది. ప్రజాచైతన్యం గుడ్డి దీపంగా ఉన్నప్పుడు ఈ పార్టీ మాటలు జనాల చెవికెక్కాయి. నాయకత్వం కరవైనప్పుడు కాంగ్రెస్సే ఆశాదీపమైంది. కాని రోజులు మారాయి. జనం ఆలోచనలు వేగమందుకున్నాయి. ఆశలు పెరిగాయి.వాటికి భావోద్వేగాలు తోడయ్యాయి. అయినప్పటికి కాంగ్రెస్‌ ‌భావజాలం మారడం లేదు. నాయకుల తీరులో మార్పు కనిపించడం లేదు.తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ గుడ్డి దీపంలా మిణుకు మిణుకు మంటోంది. దాన్ని ఆర్పేయడానికి అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌ ఒక వైపు, బీజేపీ మరో వైపు కాంగ్రెస్‌ ‌ను ఖతం చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యాయి. వలసలతో ఆ పార్టీ ఆయువు మరింత తీయడానికి ఈ రెండు పార్టీలు గాంధీ భవన్‌ ‌ముందు కాచుకోని కూర్చుకున్నాయి. అసెంబ్లీలో కాంగ్రెస్‌ ‌శాసనసభా పక్షం ఇప్పటికే మాయమైపోయింది. మిగిలిన ఎమ్మెల్యేలు ఉంటారో ,పోతారో అన్న భయం నిత్యం వెంటాడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి పార్టీ బతికి 2023లో అధికారంలోకి రావాలంటే నాయకులు చేయాల్సి చాలా ఉంది. జనం విశ్వాసం పొందాంటే కాంగ్రెస్‌ ‌నేతలు మహా యజమే చేయాల్సి ఉంటుంది. కాని ఆ పార్టీ నాయకులకు ఏ మాత్రం బుద్ది వచ్చినట్లు కనిపించడం లేదు. తెలంగాణ ఇచ్చి మరీ వరసగా రెండు సార్లు టీఆర్‌ఎస్‌ ‌చేతిలో ఓడిపోయినప్పటికి జానోదయం రాలేదు. ప్రత్యర్థులు శరపరంగా దాడు చేస్తుంటే ఎదురుదాడి చేయాల్సింది పోయి ఆత్మరక్షణలోకి కేడర్‌ ‌నెడుతున్నారు.నాయకత్వం కోసం ఆ పార్టీలో ప్రారంభమైన లొల్లి తారాస్థాయికి చేరుకునేలా వాతావరణం కనిపిస్తోంది. పీసీసీ పగ్గాలు కోసం నాయకుల మధ్య కీచులాటలు ఆ పార్టీ కొంపముంచేలా చేస్తున్నాయి. గాంధీభవన్‌ ‌కుర్చీలో కూర్చోకుండా ఒకరినొకరు వెనక్కు లాక్కుంటున్నారు. కార్యకర్తల మనోభావాలను, నాయకులను ఆశలను పక్కన పడేసి వ్యక్తిగత స్వార్థం కోసం నేతలు పాలకులాడుతున్నారు. తాజాగా పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వివాదాన్ని రా జేశారు. హుజూర్‌ ‌నగర్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపైన ఆయన చేసిన కామెంట్స్ ‌కాంగ్రెస్‌ ‌లో దుమారాన్ని రేపుతున్నాయి. పీసీసీ ఛీప్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిపైన రేవంత్‌ ‌నేరుగా యుద్దాన్ని ప్రకటించారు. అధిష్టానం అనుమతి లేకుండా హుజూర్‌ ‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించడంతో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి మీద ఆయన అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన పీసీసీ ఛీప్‌ ‌పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఉత్తమ్‌ ‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేయాలన్నంత వరకు రేవంత్‌ ‌రెడ్డి వెళ్లారు. ఇప్పుడు ఇది కాంగ్రెస్‌ ‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఉత్తమ్‌ , ‌రేవంత్‌ ‌మధ్య గత కొంత కాలంగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. రేవంత్‌ ‌రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం దాదాపుగా ఒక నిర్ణయం తీసుకుంది. అధికారికంగా ప్రకటించడానికి సిద్ధమౌతున్న సమయంలో ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన టీం ఢిల్లీలో గట్టిగా లాబీయింగ్‌ ‌చేసింది. రేవంత్‌ ‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వొద్దని పట్టుపట్టడంతో హైకమాండ్‌ ‌తమ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. దీంతో రేవంత్‌ ‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తనకు పదవి రాకుండా అడ్డుకున్న ఉత్తమ్‌ అం‌డ్‌ ‌కో మీద ఆయన పగపట్టారు. అందుకే హుజూర్‌ ‌నగర్‌ అభ్యర్థిపైన రేవంత్‌ ‌మెలికపెట్టి ఉత్తమ్‌ ‌ను దెబ్బతీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. నిజానికి హుజూర్‌ ‌నగర్‌ ఉప ఎన్నిక ఉత్తమ్‌ ‌తో పాటు కాంగ్రెస్‌ ‌పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం. సిట్టింగ్‌ ‌సీటును కాపాడుకోవాల్సిన బాధ్యత పైన పార్టీపైన ఉంది. అందుకే గురి చూసి రేవంత్‌ ‌రెడ్డి బాణాన్ని వదిలారు. ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు ఆయన ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకుంటున్నారు.
అయితే ఉత్తమ్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి వ్యవహారం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారుతోంది. కష్టాల్లో ఉన్న పార్టీని కాపాడాల్సింది పోయి వీరు మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. నిజానికి పీసీసీ అద్యక్షుడి మార్పు కోసం పార్టీ కేడర్‌ ‌కూడా ఎదురు చూస్తోంది. ఉత్తమ్‌ ‌నేత్రుత్వంలో కాంగ్రెస్‌ అన్ని ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. నైతిక బాధ్యత వహించి ఆయన గాంధీ భవన్‌ ‌నుంచి తప్పుకుంటారని అంతా భావించారు. కాని ఉత్తమ్‌ ‌మాత్రం పీసీసీ కుర్చీ వదిలిపెట్టడం లేదు. ఆ కుర్చీలో కూర్చోవాలని రేవంత్‌ ‌రెడ్డి ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా రేవంత్‌ ‌కే జై కొడుతున్నారు. కాని సీనియర్లు మాత్రం ఆయను పీసీసీ ఛీప్‌ ‌గా జీర్ణించుకోలేకపోతున్నారు. ఫలితంగా వివాదాలు మొదలయ్యాయి. ఇవి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌ ‌ను కాపాడటం ఎవరి తరం కాదు. సీనియర్‌, ‌జూనియర్‌ అన్న బేషాజాలను పక్కన పెట్టి పార్టీ కోసం కలిసి నడిస్తేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. లేకపోతే అనేక రాష్ట్రాల్లో కనుమరుగైన రీతిలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ ‌కనిపించకుండా పోవడం ఖాయం.
ఉన్నం..శ్రీనివాసరావు, సీనియర్‌ ‌జర్నలిస్టు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy