వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టీఆర్‌ఎస్‌లో కలకలం

September 12, 2019

బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ ‌నారాజ్‌..!
‌బీజేపీ ఎంపీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భేటీ
పార్టీ మారుతున్నట్లు ప్రచారంతెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల చేపట్టిన్న కేబినెట్‌ ‌విస్తరణ టీఆర్‌ఎస్‌ ‌పార్టీలో పెద్ద చిచ్చు పెట్టిన విషయం తెలిసిందే. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ముఖ్య నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కారు. కేసీఆర్‌ ‌తనకు ఇచ్చిన మాట తప్పారని నాయిని నరసింహ రెడ్డి, కేబినెట్‌లో మాదిగలకు చోటివ్వలేదని మరో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ ‌స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించడంతో వారంతా మెత్తబడ్డారు. అయితే, తాజాగా మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి ఆ ఎమ్మెల్యే షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ ‌బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌ అహ్మద్‌ ‌గురువారం నిజామాబాద్‌ ‌బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. కాగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని షకీల్‌ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన …అర్వింద్‌తో సమావేశం కావడంతో టీఆర్‌ఎస్‌లో కలకలం రేపుతోంది. భేటీ అనంతరం షకీల్‌ ‌పార్టీ మారడంపై
స్పందించారు. పార్టీ మారితే మారొచ్చు అంటూ ఫీలర్లు వదిలారు. ఇక మంత్రివర్గంలో స్థానం దక్కని జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డిని టీఆర్‌ఎస్‌ అధిష్టానం బుజ్జగించడంతో వారిద్దరూ మెత్తపడ్డారు. నాయిని బహిరంగంగానే తన అసంతృప్తి తెలిపితే, జోగు రామన్న మాత్రం అలక వహించి అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికే బీజేపీ పలుమార్లు… టీఆర్‌ఎస్‌ ‌నేతలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తోంది. అంతేకాకుండా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్తారని సోషల్‌ ‌డియాలో ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. అలాగే త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలు సందర్భంగా బీజేపీ కూడా దూకుడు పెంచింది. పట్టణ ప్రాంతాల్లో కొంత పట్టు ఉన్న ఆ పార్టీ స్థానిక నేతలపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో కలకలం రేగుతుంది. పార్టీపై ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో వివరాలు సేరించి బుజ్జగించే పనిలో తెరాస అధిష్టానం సిద్ధమవుతున్నట్లు సమాచారం.