వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న అసంతృప్తుల సంఖ్య

September 10, 2019

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో రోజుకో అసంతృప్తి గళం వినిపిస్తున్నది. మొదటి దఫా మంత్రివర్గ ఏర్పాటుతో మొదలైన అంతర్ఘత ముసలం తాజా మంత్రివర్గ విస్తరణతో పెల్లుబికినట్లైంది. ఒకరు, ఇద్దరితో ప్రారంభమైన అసంతృప్తివాదుల సంఖ్య ఇప్పటి వరకైతే అయిదారుగురి వరకు చేరుకుంది. మరికొంతమంది కూడా ఇదే దారిలో ఉన్నట్లు సమాచారం. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర పార్టీల నుండి చేరిన వారి సంఖ్య కూడా బాగానే పెరిగింది. వారందరికీ న్యాయం చేసేందుకు కెసిఆర్‌ ‌ప్రభుత్వం తీవ్రంగానే కసరత్తు చేస్తోంది. ఇతర అధికార పదవులను ఏదో విధంగా పెంచుకున్నా, మంత్రి పదవులను మాత్రం విస్తృతపర్చే పరిస్థితి లేదు. రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడుతలుగా ముఖ్యమంత్రితో కలిపి పన్నెండుగురు ఆమాత్యులుగా కొనసాగుతుండగా మరో ఆరుగురికి మాత్రమే క్యాబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉండింది. ఆరుగురిలో తమపేరు తప్పకుండా ఉంటుందని ఇంతకాలం ఎదురుచూస్తూ కూర్చున్న వారికి తీరా జాబితా ప్రకటన తీవ్ర నిరాశ కలిగించింది. ఉద్యమంలో పాల్గొన్నవారిని కాదని, ఇతర పార్టీనుండి తెచ్చుకున్నవారికి మంత్రిపదవులివ్వడాన్ని ఉద్యమకారులు తట్టుకోలేక పోతున్నారు. పోలీసు లాఠీలకు, అరెస్టులకు భయపడకుండా తెలంగాణ సాధనే ధ్యేయంగా పనిచేసిన వారిని ఇది పూర్తిగా నిరాశపర్చింది. అందుకే నాయిని నర్సింహారెడ్డి లాంటి సీనియర్‌ ‌నాయకులు కూడా తమ మనస్సులో మాటను బహిర్ఘతం చేయకుండా ఉండలేకపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన వివిధ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినాయకుడు కెసిఆర్‌ ఎప్పుడూ ఒకమాట అంటూ ఉండేవాడు. ఇంటి పార్టీని గెలిపించుకోవాలని. నాయిని అదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇంటిపార్టీ అంటే ఇంట్లో ఉన్నవారందరి పార్టీ అన్న భావనను వ్యక్తపరుస్తూ, ఆ ఇంటి పార్టీకి చెందిన గులాబీ జండాకు తామంతా ఓనర్లమేనని ఆయన కుండబద్దలుకొట్టినట్లు చెప్పాడు. కిరాయదారులు ఎప్పుడూ కిరాయదారు లేనన్నాడు. ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్‌ ఇటీవల అన్నమాటలనే ఆయన మరోసారి తనమాటగా ఉచ్ఛరించాడు. అయితే రాజేందర్‌ అప్పటికే మంత్రి పదవిలో ఉన్నాడు గనుక, తనకున్న మంత్రి పదవి అడుక్కుంటే వచ్చింది కాదు.. ప్రజల మద్యలోఉండి చేసిన పోరాటాల గుర్తింపుగా వచ్చిందని చెబితే, నాయిని నర్సింహరెడ్డి మాత్రం తనను కెసిఆరే మంత్రి పదవికి దూరం చేశాడంటూ సంచలన ప్రకటన చేశాడు. ఉద్యమారంభం నుండి రాష్ట్ర సాధనవరకు అధినేత వెన్నంటి ఉన్న తాను ఎన్నికల్లో నిలబడి గెలువగల సత్తాఉన్నా, తనకు ఎంఎల్‌సి పదవిని కట్టబెట్టి మంత్రి పదవిస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్‌ ఆ ‌మాటను నిలబెట్టు కోలేదన్నది ఆయన ఆరోపణ. తన వారసుడిగా తన అల్లుడిని కూడా ఎంఎల్‌సిగా చేస్తానన్న హామీని కూడా కెసిఆర్‌ ‌నిలుపుకోలేదన్న విషయాన్ని ఆయన మీడియా ముందు బాహాటంగానే చెప్పడాన్ని చూస్తుంటే ఈ నాయకుల్లో సహనం నశించినట్లు స్పష్టమవుతున్నది. నాయిని కన్నా ముందే ఈటల మాటలకు మానకొండూరు ఎంఎల్‌ఏ ‌రసమయి బాలకిషన్‌ ‌వత్తాసు పలికిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ ‌పేరు ఎలా శాశ్వతమో, రాష్ట్ర మొదటి డిప్యూటీ స్పీకర్‌గా తాటికొండ రాజయ్యపేరు కూడా అంతే శాశ్వతంగా నిలుస్తుంది. అయితే ఆయన పదవి ఆనాడు మూన్నాళ్ళ ముచ్చటైంది. అంతపెద్ద పదవి నుండి తొలగించినప్పుడు కూడా గళమెత్తని రాజయ్య కూడా తాజా మంత్రివర్గ విస్తరణ తర్వాత తన నిరసనను వినిపించడం చూస్తుంటే టిఆర్‌ఎస్‌లో అసంతృప్తి జ్వాలలు అంటుకుని రగలడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. అయితే నిరసన వ్యక్తం చేస్తున్న వారంతా ఎక్కడా ఓవర్‌గా మాట్లాడ కుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. నాయిని నర్సింహారెడ్డి మీడియా ముందు చెప్పిందంతా గతంలో ఎన్నికల సమయంలో ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటల్లో భాగమే. అలాగే రాజయ్య అన్నదాంట్లో కూడా వాస్తవం లేకపోలేదు. పద్దెనిమిది మంది మంత్రుల్లో తమ సామాజిక వర్గానికి ఒక్కటంటే ఒక్క మంత్రి పదవిని ఇవ్వకపోవడం పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. గతంలో ఏదో పొరపాటు జరిగిందని ఉపముఖ్యమంత్రి పదవినుంచి తొలగించబడినా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నుండి గెలిచిన రాజయ్యకు మరో అవకాశం లభిస్తుందని, తెలంగాణలో దాదాపు 12 శాతం జనాభా ఉన్న మాదిగలకు తప్పకుండా ప్రాధాన్యత ఉంటుందని ఆయనతోపాటు, ఆయన సన్నిహితులు ఇంత కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇదే దారిలో మరో ఇద్దరు శాసనసభ్యులు నియోజకవర్గ ప్రజలకు, అధికార పార్టీకి అందుబాటులో లేకుండా పోయి తమ అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. మల్కాజిగిరి ఎంఎల్‌ఏ ‌మైసంపల్లి హనుమంతరావు క్యాబినెట్‌ ‌విస్తరణ రోజే కనిపించక పోవడం, బడ్జెట్‌ ‌సమావేశాలకు హాజరు కాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇతర పార్టీల్లో ఉన్నవారిని టిఆర్‌ఎస్‌ ఆకర్షిస్తుంటే, ఆయన టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నాడన్న వార్తలొస్తున్నాయి. ఇక అలక బూనిన మరో శాసనసభ్యుడు ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ ‌జీవన్‌రెడ్డి కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఏదైనా పదవిస్తే సరే లేకపోతే విదేశాలకు వెళ్తాననడంలోనే ఆయన నిస్ప•హలో ఉన్నాడన్నది అర్థమవుతోంది. మాజీ మంత్రి జోగురామన్న కూడా మంత్రి పదవి దక్కక పోవడంతో దాదాపు ఇరవైనాలుగు గంటలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. తన ఆరోగ్యరీత్యా ఏకాంతంగా విశ్రాంతి తీసుకున్నట్లు ఆజ్ఞాతం వీడిన అనంతరం ఆయన చెబుతున్నా అలకపాన్పు ఎక్కినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాగా, రాజేందర్‌, ‌రాజయ్య లాంటివారు తమ స్వరాన్ని మార్చడం వెనుక అధికారపార్టీ వొత్తిడి లేకపోలేదన్నది కొసమెరుపు.