వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టిఆర్‌ఎస్‌లో ఏదో జరుగుతున్నది

September 7, 2019

తెలంగాణ రాష్ట్ర అధికారపార్టీ టిఆర్‌ఎస్‌లో ఏం జరుగుతుందన్నదన్నది అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తిగా మారింది. అయితే ఏం జరుగుతున్నదన్నదానికన్నా ఏదో జరుగుతున్నదనడానికి మాత్రం అనేక దృశ్యాంతరాలు కనిపిస్తున్నాయి. పార్టీ ఆవిర్భావంనుండి నిన్నమొన్నటివరకు పార్టీకిగాని, పార్టీ అధినేతనుగాని ధిక్కరిస్తూ ఇంతవరకు ఎవరూ మాట్లాడిందిలేదు. అయితే తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఏర్పడిన టిఆర్‌ఎస్‌పార్టీ ఆవిర్భావకాలంనాటి చాలామంది నాయకులు వివిధ కారణాలతో పార్టీని విడిచిపెట్టి మరోపార్టీలో చేరినవారేగాని, పార్టీలో ఉంటూ నిరసనగళం వినిపించినవారుమాత్రంలేరు. అలాంటిది ఇటీవలకాలంలో ఆ పార్టీలో పదవులను అనుభవిస్తూనే తమ అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు బహిరంగసమావేశాల్లోనే వెల్లడించడాన్ని చూస్తుంటే ముందుగా చెప్పుకున్నట్లు ఏం జరుగుతున్నదన్న దానికన్నా, ఏదో జరుగుతున్నదన్నది వాస్తవమనిపిస్తున్నది. తెరాసపార్టీ అధికాంలోకి రావడానికి కేవలం పార్టీ శ్రేణులే కాకుండా తెలంగాణలోని సబండవర్ణాలకృషి, త్యాగముంది. అందరిదృష్టి ఆనాడు కేవలం రాష్ట్రసాధనమాత్రమే. అయితే రాష్ట్రంఏర్పడినతర్వాత ఉద్యమకారులకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వటంలేదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రత్యేకరాష్ట్రంలో రెండవసారి జరిగిన శాసనసభ ఎన్నికలప్పటినుండి ఈ భావన మరింత విస్తృమైంది. కావాల్సినదానికన్నా ఎక్కువ స్థానాలనే గెలుచుకున్నప్పటికీ ఇతర పార్టీలనుండి గెలిచిన శాసనసభ్యులను ఆహ్వానించి, వారికి పెద్దపీఠవేయడం, మంత్రివర్గంలో వారికే ప్రాధాన్యత నివ్వడంలాంటిచర్యలు వారిని మరింత బాధిస్తున్నాయి. ఎదురు మాట్లాడినవారిని ఎక్కడ శంకరగిరి మాణ్యాలు పట్టిస్తారోనని చాలామందినాయకులు ఇంతకాలంగా నోరుతెరవకుండా ఉన్నారు. కాని, ఇటీవల ఆపార్టీలో ప్రాధాన్యమున్న ఇద్దరు ముఖ్యనాయకులు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పార్టీలో నిజంగానే ఏదో జరుగుతుందనేందుకు అవకాశంగా మారాయి. ఉద్యమకాలంనుండి కెసిఆర్‌కు కుడిభుజంలా వ్యవహరించిన ఈటల రాజేందర్‌ ‌మాటలు రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఇంతకాలం పటిష్టంగా ఉందనుకున్న టిఆర్‌ఎస్‌పార్టీలో చీలికవస్తేతప్ప దాన్ని పడేయలేమని కాచుకుకూర్చున్న ప్రతిపక్షాలు ఈ ఘటనను తమ••నుకూలంగా ఎలామార్చుకోవచ్చన్న ఆలోచనలోపడ్డాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ సారి జరిగిన ఎన్నికల అనంతరం ఏర్పడిన మంత్రివర్గంనుండే ప్రతిపక్షాలకు ఈ ఆలోచన మొదలైంది. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ట్రబుల్‌ ‌షూటర్‌గా, ఎన్నికల నిర్వహణలో అందెవేసిన చెయ్యిగా, పనిరాక్షసుడిగా పేరున్న హరీష్‌రావుకు మంత్రివర్గంలో స్థానంకల్పించనప్పటినుండే పార్టీలో ఏదో జరుగుతున్నదన్న అభిప్రాయానికి తావేర్పడింది. దీనిపై అటు కెటిఆర్‌, ఇటు హరీష్‌రావులు ఎంత సర్థిచెప్పేప్రయత్నంచేసినా దానివెనుక ఏదో ముసలముందన్న భావన ప్రజల్లో విస్తృతమైంది. దానికి తగినట్లుగా పత్రికలు, ఎక్ట్రానిక్‌ ‌మీడియాలు, సోషల్‌ ‌మీడియాల్లో అనేక కథనాలు రావడంతో ప్రజల అనుమానాలకు మరింత బలంచేకూరింది. ఏనాడు కెసిఆర్‌ ‌మాటకు ఎదురుచెప్పని ప్రస్తుత ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మంత్రి పదవి ఇచ్చేవిషయంలో జరిగిన జాప్యం వెనుకకూడా పలు ఊహాగానాలు విస్తృతంగా ప్రచారమైనాయి. అవేవీ బయటికి పొక్కకపోయినా తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఈటల మాట్లాడిన ఈటల్లాంటి మాటల వెనుక నిగూఢార్థందాగిఉన్నా, అవి ఎవరికి తగులాలో వారికి తగిలాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దానిపై ఈటల సవరింపు ప్రకటన చేసినా ఆ మాటలవెను•• ఏదో బాధ, వ్యధ దాగిఉందన్నడానికి అవకాశమేర్పడింది. ఆయన తన ఆవేశపూరిత ప్రసంగంలో మాట్లాడిన మాటల్లో ‘గులాబీ జంఢా ఓనర్లం’ అన్నదానిపైనే విశ్లేషణ జరుగుతున్నది. ఆ ఒక్క మాట ఉద్యమకారులను తట్టిలేపేదిగా ఉందంటున్నారు. నిజంగానే ‘ఏదోలేకపోతే’ అయన మాటలకు పార్టీ వర్గాలు స్పందించేవేకావు. ఒక విధంగా పార్టీ ఉలిక్కిపడినట్లే ఒకరివెనుక ఒకరు స్పందించడంకూడా ఏదో జరుగుతున్నదనే అనుమానానికి తావిస్తోంది. గులాబీ జంఢాకు కెసిఆర్‌ ఒక్కడే బాస్‌ అం‌టూ మంత్రి ఎర్రబెల్లి స్పందించడం వెనుక పార్టీలో అంతర్ఘతంగా ఏదో ఉందన్న భావన కలిగిస్తున్నది. రాజేందర్‌ అం‌శం ఇక సమిసిపోయిందని, ఆయన పదవికి ఇక ధోకాలేదనడంలో, తనకు పదవి గండం ఏర్పడుతుందనే రాజేందర్‌ ఆలా స్పందించాడా అన్న విషయంలో చర్చ జరుగుతోంది. దానికి తగినట్లు ఆ పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌మాట్లాడిన తీరుకూడా పరోక్షంగా రాజేందర్‌ను దృష్టిలో పెట్టుకునేనా అన్న చర్చకూడా జరుగుతున్నది. పదవులు రాగానే కొందరు నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతారని, పార్టీకన్నా ఎవరు గొప్పకాదంటూ చేసిన వ్యాఖ్యలు రాజేందర్‌గురించేనని రాజకీయపరిశీలకులు రూఢీగా చెబుతున్నారు. ఈ అంశం సమసిపోకముందే అదేపార్టీకి చెందిన మానకొండూరు ఎంఎల్‌ఏ ‌రసమయి బాలకిషన్‌ ‌మాట్లాడిన తీరుకూడా తన నిరసనగళాన్ని వినిపించినట్లుగానేఉంది. ఉమ్మడిరాష్ట్రానికి, ప్రత్యేకరాష్ట్రానికి బోర్డుపైన పేరుతప్ప ఏమీ మార్పులేదనడం పార్టీనే విమర్శించినట్లుందన్న చర్చ జరుగుతోంది. ఆయనకూడా తాను ఉద్యమకారుడినన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ, 19ఏళ్ళకింద తాను ఉపాధ్యాయుడిగా పనిచేసిన పాఠశాల నాడు, నేడు ఒకేతీరున ఉందని, ఏమాత్రం మార్పుజరుగలేదంటూ ఆవేదన వ్యక్తంచేస్తూనే, తాము కలలుకన్న తెలంగాణ ఇదికాదన్న విషయాన్ని స్పష్టంచేశాడు. పార్టీ సీనియర్‌లే ఇంత అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న క్రమంలో మరెంతమంది తమ నిరసనను, నిరాసక్తతను ఇంకా అణచిపెట్టుకుని పార్టీలో కొనసాగుతున్నారోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.