వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

టిఆర్ఎస్ తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాక‌ ద‌ర్ప‌ల్లి రోడ్ షోలో ఎంపి క‌విత‌

March 31, 2019

టిఆర్ఎస్ తెలంగాణ ఆత్మ‌గౌర‌వ ప‌తాక అన్నారు నిజామాబాద్ ఎంపి క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివారం నిజామాబాద్ రూర‌ల్ నియోజ‌క వ‌ర్గంలోని ద‌ర్ప‌ల్లి మండ‌ల కేంద్రంలో జ‌రిగిన రోడ్ షోలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భఃగా మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ‌లు, బోనాల‌తో ఎంపి క‌విత‌కు ఆహ్వానం ప‌లికారు. మంగ‌ళ‌హార‌తులు ప‌ట్టారు. బొట్టుపెట్టి ఆత్మీయ‌త‌ను ప్ర‌ద‌ర్శించారు. లంబాడా మ‌హిళ‌లు త‌మ సంప్ర‌దాయ వ‌స్ర్తాల‌ను అంద‌జేశారు. లంబాడాల వ‌స్త్రాలంక‌ర‌ణ‌లో ఎంపి క‌విత‌ను చూసి మురిసిపోయారు.
అనంత‌రం ఎంపి క‌విత మాట్లాడుతూ తెలంగాణ ఏర్ప‌డ‌క ముందు ఆంద్ర‌తో క‌లిసి ఉన్నాం..అడుగ‌డుగునా అవ‌మానాల‌ను భ‌రించాం, అభివృద్ధిలో వెన‌క‌బాటు జ‌రిగింద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆత్మ‌గౌర‌వం ముఖ్యం..అందుకే తెలంగాణ‌ను సాధించుకున్నాం..అని అన్నారు ఎంపి క‌విత‌.

తెలంగాణ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ టిఆర్ ఎస్‌తోనే సాధ్య‌మ‌న్నారు. కేంద్రం నుండి మ‌న‌కు రావాల్సిన నిధులు తెచ్చుకోవ‌డానికి ఒక్క టిఆర్ ఎస్ ఎంపిలు మాత్రమే కొట్లాడ‌తార‌ని, ఈ విష‌యం గ‌త ఐదేళ్లుగా టిఆర్ఎస్ ఎంపిలు పార్ల‌మెంటులో చేసిన ఆందోళ‌న‌లే నిద‌ర్శ‌నం అన్నారు. హైకోర్టు విభ‌జ‌న‌, ఎయిమ్స్‌ను టిఆర్ఎస్ ఆందోళ‌న‌, వ‌త్తిడి ఫ‌లితంగానే కేంద్రం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఇచ్చింద‌ని క‌విత తెలిపారు.

గులాబి పార్టీవైపు దేశ‌మంతా చూస్తున్న‌ద‌ని, తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలే దీనికి కార‌ణం అన్నారు. తెలంగాణ మాదిరిగా దేశ‌మంతా ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. అందుకే సిఎం కేసిఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేశార‌ని క‌విత వివ‌రించారు. 16 మంది టిఆర్ఎస్‌, ఎంపిల‌తో పాటు ఎంఐఎం అభ్య‌ర్థి అస‌దుద్దీన్ ఒవైసీని కూడా గెలిపించుకోవాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరారు.

దేశం అంతా తెలంగాణ వైపు చూస్తోందని, ఎంపిల‌మంతా గులాబి కండువా తో డిల్లీకి పోవాలి..టిఆర్ఎస్ ఎంపిలు మీ గొంతుక‌గా ప‌నిచేస్తార‌ని తెలిపారు. ఎంపిలంటే…మ‌న స‌మ‌స్య‌లు గురించి పార్ల‌మెంటులో మాట్లాడాలి…కేంద్రం నుంచి నిధులు తేవాలి..బీడికార్మికులు, సింగ‌రేణి, ప‌సుపు బోర్డు..నా శ‌క్తి మేర ప‌నిచేశాన‌ని చెప్పారు. ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఎంపిలు ఊరూరు తిరిగి మీ స‌మ‌స్య‌ల‌ను సిఎంకు చెప్పాలి…ఆ ప‌ని కూడా నేను చేశాన‌ని క‌విత తెలిపారు.

65 ఏళ్ల‌కు పించ‌న్ ఇస్తున్న‌రు…తినే తిండికి శాత‌న‌వుత లేద‌ని నాకు చెప్తే సిఎం కు నేను చెప్పినా…57 ఏండ్లున్న వారికి ఫింఛ‌న్లు ఇస్తామ‌ని సిఎం నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలిపారు. పిఎఫ్ కార్డులున్న వారు న‌న్ను క‌ల‌సి 2014 క‌టాఫ్ పెట్టారు..పిఎఫ్ కార్డులు ఉన్నాయి కాబ‌ట్టి పెన్ష‌న్ ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. ఆ విష‌యాన్ని సిఎంకు తెలియ‌జేస్తే ఫిఎఫ్ కార్డులున్న‌వారంద‌రికీ ఫించ‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.
తండాల‌ను గ్రామ పంచాయ‌తీలు చేస్తామ‌ని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది..కాని చేయ‌లేదు. కాని టిఆర్ ఎస్ వ‌చ్చాక ద‌ర్ప‌ల్లి మండలంలో 8 తండాల‌ను గ్రామ పంచాయ‌తీలు చేసుకున్నామ‌ని తెలిపారు. మ‌న తండాలో మ‌న రాజ్యం అన్న నినాదంతో లంబాడీల‌కు అధికారం అప్పగించామ‌ని క‌విత చెప్పారు.

రామ‌డుగు ప్రాజెక్టు 365 రోజులు నీళ్ల‌తో నిండి ఉండాల‌ని నేనూ బాజిరెడ్డి ఆలోచ‌న చేశాం. .. ప్యాకేజి 21 ద్వారా కాళేశ్వ‌రం నీటిని త‌ర‌లించాల‌నుకున్నాం…అయితే భూములు ఎక్కువ‌గా పోతుండ‌టంతో ఈ విష‌యం సిఎంకు చెప్తే…ఆయ‌న కాలువ‌ల‌కు బ‌దులు పైప్ లైన్ ద్వారా నీటిని త‌ర‌లించాల‌ని అధికారుల‌కు ఆదేశించారు.అంటే స‌మ‌స్య ఉందంటే స‌త్వ‌ర‌మే సిఎం ప‌రిష్కారం చూపుతూ నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలిపారు.

ద‌మ్మ‌న్న‌పేట‌, అన్‌సాన్‌ప‌ల్లి, గౌరారంల‌లో స‌బ్ స్టేష‌న్లు కొత్త‌గా ఏర్పాటు చేసుకున్నాం. దీంతో 24 గంట‌ల క‌రెంటు వ‌స్తోంద‌ని తెలిపారు.జాగాలున్న వారికి ఇల్లు క‌ట్టుకునే పేద‌ల‌కు రూ. 5 ల‌క్ష‌లు ఇస్తామ‌ని, జాగాలు లేని వారికి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తం..వ‌చ్చే ఐదేళ్ల‌లో ఇండ్లు లేని పేద‌లు ఉంకూడ‌ద‌ని అనుకుంటున్నామ‌ని చెప్పారు.

భూములున్న వాళ్ల‌కు ప్ర‌భుత్వం నుంచి ఎంతో కొంత సాయం అందుతున్న‌ది. కుల వృత్తుల‌కు సాయం చేస్తున్నాం…యాద‌వుల‌కు జీవాలు, గంగ‌పుత్రుల‌కు చేప పిల్ల‌లు ఇస్తున్నామ‌ని తెలిపారు. ఏ ఆధారం లేని వాళ్ల‌కు బ్యాంకుల‌తో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం స‌బ్సిడీ ఇస్తామ‌ని చెప్పామ‌ని వివ‌రించారు. ఎస్సీ,ఎస్టీ, బిసిల పిల్ల‌లు వ్యాపారం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోరారు.

డ్వాక్రా గ్రూపుల మ‌హిళ‌లు లోన్లు ఎత్తుకుని, తిరిగి చెల్లిస్తున్నారు. దీన్ని గ‌మ‌నించిన సిఎం కేసిఆర్ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను డ్వాక్రా సంఘాల‌తో కొనిపించడం ద్వారా వారికి అద‌న‌పు ఆదాయం స‌మ‌కూరుతుంద‌ని క‌విత చెప్పారు. వ్య‌వ‌సాయం అనుసంధానం చేయ‌డం వ‌ల్ల మీకు అదాయం ల‌భిస్తుంద‌ని చెప్పారు.

రోడ్ షోలో నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌, ఎమ్మెల్సీ వి.జి గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ అరికెల న‌ర్సారెడ్డి, గ‌డ్డం ఆనంద్ రెడ్డి, జ‌డ్పి వైస్ ఛైర్ ప‌ర్స‌న్ సుమ‌నారెడ్డి, ఈగ గంగారెడ్డి,బాజిరెడ్డి జగన్, స్థానిక నాయ‌కులు పాల్గొన్నారు.