వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జనం సోయి..

September 21, 2019

కుక్కపిల్ల సావుకు కారకులైనోళ్ళ మీద ఏమేం సెక్షన్ల మీద కేసులు పెట్టాలె? నేనెప్పుడు పశ్నలడిగినా అసలు జవాబులు తెల్సుగని చెప్తలేవు. ఏందీ సంగతి? అని చిన్న దొర తీరిగ బెదిరించబట్టిన బేతాళ్‌ను జూషి’’ జరమచ్చిన కుక్క పాణం కాపాడలేక పోయిన డాక్టర్‌ ‌మీద పోలీస్‌ ‌కేసు పెట్టిండ్లు కదా! మరి ఊర్లల్ల జరంతోని సచ్చిపోతున్న జనం సావులకు బాధ్యులు రాజ్జాన్ని పాలించెటోళ్ళు కాదా! మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలె! ఎన్ని యావజ్జీవాల శిక్షలేయాల్నో!’’‘‘దావఖాన్లు మస్తు పంజేత్తానయి. కావల్షినన్ని మందులున్నయి. మస్తుమంది డాక్టర్లున్నరు. అసలు డెంగి జరాలే లేవు. వానాకాలం ఉత్తుత్తగచ్చే వైరల్‌ ‌తుస్సు జరాలే గవి. సర్కార్‌ ‌దావఖాన్ల మీద జనాలకు నమ్మకం పెరిగింది. మంచానికిద్దరు, మంచం కింద ఇద్దరు, కిటికి రెక్కకు గ్లుకోజ్లు కట్టి, బండల మీదా, కింద పండేశినా సూత జనం సర్కార్‌ ‌దావఖానకే నమ్ముకోని వత్తాండ్లు’’ అని మంత్రి మాగనే ముచ్చట జెప్పబట్టిండు.
‘‘అయ్యా! మంత్రి సారూ! మీకు ఇగురం తెల్వందా! డెంగి జరాల లెక్కలు మీ అధికారులే ఇవరంగ ఇప్పి జప్పబట్టె, జర అర్సుకోండి. డెంగి కేసులు రాష్ట్రంల రొండు వేలు దాంక దాటిందనీ, ఒక్క రాజధాని నగరంల్నే ఎనిమిది వందల కేసుల లెక్క తేలిందని చెప్తనే వుండె! మీరు సూత దొర తీరిగ ‘‘పోశెట్టి చింతమడక కతలు’’ చెప్పబడితిరెట్ల? ఇయ్యాల్రేపు గరీబోల్లు ప్రయివేట్‌ ‌దావఖాన్ల గల్మ తొక్కెటట్టున్నదా! సర్కార్‌ ‌దావఖానలు తప్ప వేరే దిక్కు లేక, సావయినా బతుకైనా రాబడ్తిమి. పేదోల్ల కోసం కాకుంటె సర్కార్‌ ‌వైద్యం ఎవరి కోసమున్నట్టు? కాలంగాక తిండికే తిప్పలైతాంటె మేము పయివేట్‌ ‌వైద్దెం కోసం పోయెటట్టున్నమా! సారూ! గాంధీ,నిమ్స్,.ఉస్మానియా, దావఖాన్ల ఓ.పి. మొగాన ఓ మీరోపాలి జూడాలె’’ అని జనం వాళ్ళ గోస జెప్పుకోబట్టె.
డెంగి, వైరల్‌ ‌జరాలచ్చి ఊర్లల్ల జనం ఇంటి కొకరు దావఖాన్ల పడబట్టె. వాడకో పీనుగ లేవబట్టె. ఊర్లన్ని మంచం బట్టినయి. ఏ వూర్లె జూషిన గల్మగల్మకు డెంగి జరాల తోని ముక్కుడు మూలుగులే ఇనిపియ్యబట్టె. ఇసోంటి జరాలురోగాల తిప్పలు తప్పేయవ్వారం గిట్ల ఏదన్నుంటె జర జప్పున జేయుండ్రి. డెంగి, వైరల్‌ ‌జరాలచ్చినోల్లకు పెయ్యంత వడిబెట్టినట్టయి పేట్లేట్లు తగ్గి, పిడాత పోవుడేనట! పొద్దున జరంతోని దవఖాన దిక్కు పోయినోడు పొద్దుగుంకెటాల్లకు పీనుగైతాండె. ఊర్లల్ల సర్కార్‌ ‌వైద్యం కరువాయె! సాలినంత మంది డాక్టర్లూ లేరాయె! నర్సులూ డాక్టర్లుంటె మాత్రం సూది మందులు, గోలీలు గిట్లుంటానయా! అపదకు అంబులెన్సులు సూత కరువాయె! దొరికిన కిరాయి బండేదో జూసుకోని పట్నం దావఖాన్లకు ఏసుక పొవుడే! గీ లోపల గుడ్లు తేలేషి గిట్ల జీవిడిషినా, ఏడ్షి నెత్తీనోరు కొట్టుకున్డు తప్ప చేసేదేమున్నది? దేముడా! ఏందిది? అనుకుంట కర్మకేడిత్తె మాత్రం ఏమత్తది?బంగారు తెలంగాణ రాజ్జెంల ఏ పట్నం దావఖాన్ల జూషినా పొట్టుపొట్టు జనం. మబ్బుల లేషి పొద్దటి బస్సెక్కచ్చి దావఖాన్ల లైన్లుంటే అంబటాలకు సూత చీటిముక్క రాషి నెంబర్‌ ఇచ్చెటోల్లె లేకపాయె. ముసలోళ్ళు లైన్లనే కూలబడి ఆగమైతాండె. చిన్న పోరల్లు ఏడ్షేడ్షి గుడ్లు తేలేషేకాడికచ్చె. దిక్కుమెల్ల జరాలు పాడుగాను, వానాకాలం వత్తాందంటెనే గుబులు గాబట్టె! డెంగి జరాలచ్చి సంటి పోరగాండ్లు పువ్వుల్లెక్కరాలిపోబట్టె. ఊర్లల్ల ఎల్త్ ‌సెంటర్ల బాగోగులు ఎవరు జూడాలె? మాందులుమాకులు, సూదిగోలీలు, రక్తపరీక్షలు చేషేటోళ్ళకు నౌకర్లియ్యాలె కదా! ఊర్లె వాడవాడన పరిశుబ్రం సంగతి జూడాలె గద! ఏఎన్నెంల, మెడికలాపీసర్ల పోస్టులు నింపాలనే సోయిలేకనే పాయె! ఓట్లేషిన జనముల్లా! మనం! బరాబర్‌ అడుగాలె! ‘‘మీరు గెలిషేందుకు మా ఓట్లు కావాలె! జరాల్రోగాలచ్చి మేమేమొ మా సావు జూడాలె ! ఇదేందుల్లా! ‘‘జరంతనన్న జనం గోస గురించి సోయి లేకుంటెట్ల?’’
మొన్ననే అనుకుంటివి..ఎవరి లెక్కలు వాళ్ళకున్నట్టే ఎవరి బాధలు వాళ్ళకుంటయి. దొర బాధ దొరకున్నది.దొర సూత మనాసొంటి మనిషేనాయె! దొరింట్ల మనుషుల్లేరా! వాళ్ళయి పాణాలు కావా! వాళ్ళింట్లెవరికి జరాలు, రోగాలు రావా! సంగతేందంటే..దొర గఢీల ముద్దు ముద్దుగ తీరుగాడే కుక్కపిల్లోటుంటది. అయితె ఇప్పుడది లేదు. దాన్ని సూత జరం ఇడిషిపెట్టలే. దొరింట్ల అందరికి మనాది పట్టింది. దోస్త్ ‌లేకపోయెసరికి బతుకమ్మ ముద్ద ముడుతలేదట. గా రంది తోని బతుకమ్మకు సూత జరం గోలిగె వున్నదంట. కుక్కపిల్లను సూషిన డాక్టర్‌ ‌కచ్చింది తిప్పలు. అసలే దొరోళ్ళ కుక్కపిల్లాయె
ఎంత జేషిన జరం తగ్గకపాయె! రాత్రయ్యేటాలకు అనుకున్న దంత అయింది. కుక్కపిల్ల గుడ్లు తేలేషింది.,పెయి సల్లబడ్డది. అమాంతం జీవిడిషింది. డాక్టర్‌ ‌గుండె ఆగినంతపనయింది. ఏమున్నది కావల్షిందంత ఆయె! కుక్కను సంపిండని పోలీస్‌ ‌కేసు పెట్టిండ్లు. దొరోళ్ళ కుక్కను వైద్ధెం పేరిట సంపినందుకు పోలీసోళ్ళు తీరొక్క కేసులు బెట్టి ఇచారణ షురూ జేషిండ్లు.
రాత్రి పదిగొట్టంగ యశోదమ్మ దావఖాన్ల పోన్‌ ‌మోగింది. మాట్లాడిన డాక్టర్‌ ‌పోన్‌ ‌పెట్టుడుతోనె ఏమయిందో యేమో సొమ్మ రోగమచ్చినట్టు కిందబడి గిలగిల కొట్టుకో బట్టిండు. భయంతో కూడిన షిత్రమైన జెరమేదో వచ్చిందని నర్సులు ఆ డాక్టర్‌ను ఐసియులకు గుంజుక పోయిండ్లు. అప్పటికే దావఖాన్ల డ్యూటీల వున్న డాక్టర్లందరికి నూటొక్క డిగ్రీల జరమచ్చి ఐసియు మంచాలల్ల నిలువుకిద్దరున్నరు. గ్లుకోజు లెక్కబట్టె. సలిజరమచ్చిందేమో! గజగజ వణుకబట్టిండ్లు. ఇంతకు ఆ పోన్‌ ఎవరు చేషిండ్లో కాల్‌ ‌లిస్ట్ ‌జూస్తె సి.ఎం కె.సి.ఆర్‌. అని ట్రూ కాలర్‌ ‌జూపెట్టె. బయట ఏదో మంత్రుల కాన్వాయో సొంటిది ఆగినట్టున్నది. పోలీసుల కార్ల హల్‌ ‌చల్‌ ‌బాగానే ఇనపడ్తాంది.
‘‘సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్ !’’
‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! రాజ్జెంల ఓట్లేషిన జనం ఇంటికొకరు డెంగి జరంతోని సావుకు దగ్గరైతె అందుకు బాధ్యులెవరు? కుక్కపిల్ల సావుకు కారకులైనోళ్ళ మీద ఏమేం సెక్షన్ల మీద కేసులు పెట్టాలె? నేనెప్పుడు పశ్నలడిగినా అసలు జవాబులు తెల్సుగని చెప్తలేవు. ఏందీ సంగతి? అని చిన్న దొర తీరిగ బెదిరించబట్టిన బేతాళ్‌ను జూషి’’ జరమచ్చిన కుక్క పాణం కాపాడలేక పోయిన డాక్టర్‌ ‌మీద పోలీస్‌ ‌కేసు పెట్టిండ్లు కదా! మరి ఊర్లల్ల జరంతోని సచ్చిపోతున్న జనం సావులకు బాధ్యులు రాజ్జాన్ని పాలించెటోళ్ళు కాదా! మరి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలె! ఎన్ని యావజ్జీవాల శిక్షలేయాల్నో!’’అని మనుసులనే అనుకొని నవ్వుకుంట ఇక్రమార్కుడు నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు.

– ఎలమంద, తెలంగాణ