Take a fresh look at your lifestyle.

చిప్కో ఉద్యమనేత సుందర్‌లాల్‌ ‌బహుగుణ కన్నుమూత

  • కొరోనా బారిన పడి వృద్ధ్యాప్యంలో మృతి
  • ప్రధాని మోడీ,సిఎం కెసిఆర్  తదితర ప్రముఖలు సంతాపం

ప్రఖ్యాత పర్యావరణ వేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్‌ ‌బహుగుణ కన్నుమూశారు. కోవిడ్‌19 ‌వ్యాధితో ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన వయసు 94 ఏళ్లు. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన కోవిడ్‌ ‌చికిత్స పొందారు. మధ్యాహ్నం 12.05 నిమిషాలకు బహుగుణ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ‌డైరక్టర్‌ ‌రవికాంత్‌ ‌తెలిపారు. కొరోనా పాజిటివ్‌ ‌తేలడంతో.. మే 8వ తేదీన ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించింది. ఆక్సిజన్‌ ‌లెవల్‌ ‌చాలా వరకు పడిపోయింది. ఇన్నాళ్లూ ఐసీయూలో ఆయన సీపీఏపీ థెరపీలో ఉన్నారు.

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ ‌ప్రాంతంలో ఉన్న మరోడా ఆయన స్వగ్రామం. 1974లో ఆయన చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. చాలా శాంతియుతంగా ఆయన ఆ ఉద్యమాన్ని సాగించారు. ఉత్తరాఖండ్‌లో నిర్మించిన తెహ్రీ డ్యామ్‌కు వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేశారు. పర్యావరణవేత్త సుందర్‌లాల్‌ ‌బహుగుణ మృతిపట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేసే మన జీవిన విధానానికి బహుగుణ తార్కాణమని మోదీ అన్నారు. సుందర్‌లాల్‌ ‌మృతి దేశానికి భారీ నష్టమని, తీరని లోటు అని అన్నారు. ఆయన మృదుస్వభావాన్ని ఎన్నటికీ మరవలేమన్నారు. బహుగుణ కుటుంబసభ్యులకు, ఆయన్ను ఇష్టపడేవారికి ప్రధాని మోదీ సానుభూతి వ్యక్తం చేశారు.ఐదు దశాబ్దాలుగా పర్యావరణ సమస్యలపై, చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ, అంతరించిపోతున్న వృక్ష, జంతు, పక్షిజాతుల రక్షణ కోసం జీవితాంతం కృషి చేస్తూ, తన జీవితాంతం పరితపించిన బహుగుణ మరణం ప్రకృతి, జీవావరణ, పర్యావరణ రంగానికి తీరని లోటని సుందర్‌ ‌లాల్‌ ‌బహుగుణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.

చంద్రశేఖర్‌ ‌రావు సంతాపం వ్యక్తం చేశారు.. బహుగుణ కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ ‌రెడ్డి సంతాపం తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అడవుల విధ్వంసానికి వ్యతిరేకంగా చిప్కో ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. పర్యావరణ పరిరక్షణకు సుందర్‌ ‌లాల్‌ ‌బహుగుణ చేసిన కృషిని ప్రజలు ఎప్పటికి మరిచిపోరని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply