వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

చారిత్రక ఎన్నికకు ‘సహకారం’ కావాలి – కలెక్టర్

April 7, 2019

నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరగబోయే చారిత్రక ఎన్నికను విజయవంతంగా పూర్తి చేయడానికి తమ వంతు సహకారమందించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ ఎం ఆర్ ఎం రావు కోరారు.ఆదివారం స్థానిక జిల్లా సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సహకార సంఘాల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఈనెల 11న జరిగే ఎన్నికలకు దేశంలోనే మొదటిసారిగా 12 బ్యాలెట్ యూనిట్లను ఉపయోగిస్తున్నామన్నారు. వీటి ఉపయోగం పై మీ పరిధిలోని సిబ్బందికి సహకార సంఘాల సభ్యులకు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కార్యదర్శులను కోరారు. ఒకవైపు విధులలో భాగంగా మరోవైపు వ్యక్తిగతంగా మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఓటింగ్ పై అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఎంతగా ప్రజల్లోకి వెళ్లగలిగితే అంత బాగా విజయవంతం అవుతుందని ఈ క్రతువులో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు. 12 యూనిట్లు ఉన్నంత మాత్రాన ఓటింగులో ఎటువంటి తేడా ఉండదని కేవలం దానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికి యంత్రాంగానికి సమయం పట్టిందని, ముఖ్యంగా బెంగళూరు నుంచి ఈవీఎంలు తీసుకురావడం , వాటిని సాంకేతికంగా పరిశీలించడానికి ఈసీఐఎల్, బి ఇ ఎల్ నుండి సుమారు 600 మంది ఇంజనీర్లను రప్పించడం, పెద్ద పెద్ద హాళ్ల లో రాత్రింబవళ్లు ఈవీఎంలను పరిశీలించడం, పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించడం, ఇతర కార్యక్రమాలకు కొంత సమయం పట్టిందన్నారు. అయినను నిర్ణీత సమయానికి వాటి పరిశీలన పూర్తి చేశామన్నారు. ఎమ్ 3 ఈవీఎంల ద్వారా దేశంలోనే మొదటిసారిగా నిజామాబాద్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నామని వీటి వినియోగంపై ప్రజల్లోకి పెద్ద ఎత్తున అవగాహన కల్పించడం ప్రధానమన్నారు. ఇప్పటికే ఫ్లెక్సీ ల ద్వారా ముఖ్య కూడళ్లలో వీటిని ప్రదర్శిస్తున్నామని, మరింత అవగాహనకు గ్రామాల్లో టాం టాం ద్వారా,, ఆటోల ద్వారా, పోస్టర్ల ద్వారా , కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు.. నమూనా బ్యాలెట్తో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అవగాహన సందర్భంగా ఓ టు ఎలా వేయాలో మాత్రమే చెప్పాలని ఎవరికి వేయాలో చెప్పడం చట్ట విరుద్ధమని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్లను , కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మరియు ఎం సి సి నోడల్ అధికారి సింహాచలం తదితరులు పాల్గొన్నారు.