వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

చంద్రబాబు స్వయం కృతం.. అందుకే బీసీలు దూరం…

August 10, 2019

శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్ళ పాటు దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించని విధంగా దేశ విదేశాల్లోనే కాకుండా, రాష్ట్రం నలుమూలల ప్రాంతాల్లో సైతం పర్యటించి ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి,వాటి అమలును నిరంతరం పర్యవేక్షించిన తనకు ఇంతటి ఘోర పరాజయం సంభవించడం ఏమిటని ఆయన తీవ్రంగా మదన పడుతున్నారు. పార్టీ పోలిట్‌ ‌బ్యూరో సమావేశాల్లో బహిరంగంగానే తన ఆవేదనను ఆయన ఇటీవల వ్యక్తం చేశారు. 23 స్థానాలకే మన పార్టీని ప్రజలు పరిమితం చేసేంతగా తప్పులేమి చేశామో ఎన్నిసార్లు ఆలోచించినా తనకు బోధపడటం లేదని ఆయన ఇటీవల పోలిట్‌ ‌బ్యూరో సమావేశంలో అన్నారు. బీసీలను విస్మరించడం వల్లనే పార్టీ ఘోర పరాజయం పాలైందని పోలిట్‌ ‌బ్యూరో లో ఉన్న పలువురు బీసీ నాయకులు చంద్రబాబు ఎదుటే నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. గతంలో ఆయన ఎదుట పల్లెత్తు మాట అనడానికి సాహసించని వారు సైతం ఇప్పుడు ధైర్యంగా తమ మనసులోని మాటను బయట పెడుతున్నారు. మాజీ మంత్రి , బీసీ నాయకుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇటీవల పోలిట్‌ ‌బ్యూరో సమావేశంలో తాను చెప్పదల్చుకున్నవన్నీ చెప్పి కంట తడి పెట్టారు. పేదల కడుపు నింపేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్న క్యాంటిన్‌ ‌లను కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎత్తేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇది చంద్రబాబు స్వయంకృతమని పలువురు తెలుగుదేశం నాయకులు ఆయనవెనుక వ్యాఖ్యానిస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం అధికారులను తప్ప కార్యకర్తలనూ , నాయకులనూ ఆయన పట్టించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థిత ఏర్పడిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబునాయుడు కుమారుడు,మాజీ మంత్రి నారా లోకేష్‌ అతి జోక్యం వల్ల కూడా నష్టపోయామని వారంటున్నారు. నారా లోకేష్‌ ‌కారణంగానే పార్టీ ఓటమి పాలైందని తెలుగు దేశం ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ‌ప్రభాకర్‌ ‌బహిరంగంగానే విమర్శించారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్‌ ‌నాయకులు పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎన్నికల ముందు చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్ళినప్పటికీ ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. పోలవరం, రాజధాని నిర్మాణం మొదలైన కార్యక్రమాలన్నీ అస్మదీ యులకే అప్పగించి, పార్టీలో సీనియర్లనూ, అనుభవజ్ఞులను చంద్రబాబు పక్కన పెట్టడం వల్లనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందనీ, చంద్రబాబును సంప్రదించేందుకు తమకు అవకాశం దొరికేది కాదని పలువురు వాపోయారు. ముఖ్యంగా, గతంలో చక్రం తిప్పిన బీసీ నాయకులు కూడా తమకు ప్రాధాన్యం లభించకపోవడం వల్ల పార్టీకి చేటు జరుగుతున్నా కిమ్మన్నాస్తిగా కూర్చున్నారు. ఇంతవ్యతిరేకత ఉందని ఊహించలేక పోయానంటూ చంద్రబాబు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అస్మదీయులను పక్కన పెట్టి పార్టీని చాలా కాలంగా నమ్ముకున్న బీసీ నాయకులను చేరదీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బీసీ నాయకులు నిర్మొహమాటంగానే మాట్లడుతున్నారు. ఎన్టీరామారావు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారనీ,ఇప్పుడున్నది ఆయన స్థాపించిన తెలుగుదేశం కాదని కూడా వారు బహిరంగంగానే అంటున్నారు. మరోవంక ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ ‌జగన్‌ ‌బీసీలకు మంత్రివర్గంలో అగ్ర ప్రాధాన్యం ఇచ్చారు.ఎన్నికలలో ఓడి పోయిన ఇద్దరు సీనియర్‌ ‌బీసీ నాయకులకు మంత్రి పదవులు ఇచ్చారు. వీరిలో పిల్లి సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌కి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. మోపిదేవి వెంకటరమణరావు వంటి సీనియర్‌ ‌బీసీ నాయకులకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇచ్చారు. జగన్‌ ‌కేబినెట్‌ ‌లో బీసీలకు న్యాయం జరిగిందని బీసీల సంఘం అధ్యక్షుడు ఆర్‌ ‌కృష్ణయ్య జగన్‌ ‌కి కృతజ్ఞత చెప్పారు. చంద్రబాబు బీసీలను వోటు బ్యాంకుగానే వాడుకున్నారనీ, జగన్‌ ‌బీసీలకు ప్రభుత్వంలో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని బీసీ నాయకులే అంటున్నారు. అదే సందర్భంలో కాపు నాయకులు ఏమాత్రం అసంతృప్తిని వ్యక్తం చేయడం లేదు. ఆ సామాజిక వర్గానికి కూడా జగన్‌ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఇటీవల కాపుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నించినప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఘాటైన సమాధానమిచ్చి ఆవలి వారిని మారు మాట్లాడకుండా చేశారు. సామాజిక వర్గాల సమతుల్యతను పాటించినందుకు జగన్‌ ‌ని ఇప్పటికే అనేక మంది అభినందించారు. చంద్రబాబు బీసీలను పొగడటమే తప్ప చేసిందేమీ లేదని ఆ సామాజిక వర్గాల వారే విమర్శిస్తున్నారు.