వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గోదావరి జలాలను … పూర్తిగా వినియోగిస్తాం

April 4, 2019

పొంగులేటి, తుమ్మల సేవలు వినియోగించుకుంటా
ఖమ్మం సభలో సిఎం కెసిఆర్‌ ఉద్ఘాటన

మానుకోట బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌…
సీతారామ ప్రాజెక్టుతో రెండు పంటలకు నీరు అందుతుందని సీఎం కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఇక్కడ ఉన్న గోదావరి జలాలను ఉపయోగించుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఖమ్మంలో జరిగిన టీఆర్‌ఎస్‌ ‌బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ‌మాట్లాడుతూ బయ్యారం ఉక్కు పరిశ్రమను కచ్చితంగా సాధించుకుంటామన్నారు. లేని పక్షంలో సింగరేణికి అప్పగించి ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని అన్నారు. దేశ భవిష్యత్‌ను నిర్ణయించడంలో లోక్‌సభ ఎన్నికలు కీలకమైనవన్నారు. 66 ఏళ్లు పాలించిన పార్టీలే పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. జాతిని చైతన్యవంతం చేయడంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషించాలి. 1947 నుంచి కాంగ్రెస్‌ ‌నేతలు గరీబీ హఠావో గురించి మాట్లాడుతున్నారు. నెహ్రూ కాలం నుంచి పేదరికాన్ని పారదోలుతామని చెబుతున్నారు. తరాలు మారినా కాంగ్రెస్‌ ‌నేతల గరీబీ హఠావో నినాదం కొనసాగుతోంది. కాంగ్రెస్‌, ‌బీజేపీలు క్రియారహిత పాలన చేశాయి. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ ‌నేతలు కీలక పదవులు పొందుతారు. టీఆర్‌ఎస్‌ ‌నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులు వస్తాయన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇస్తాం. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా కష్టాలు తీరతాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి ప్రభుత్వం వస్తేనే దేశం బాగుపడుతుంది. సొంత ఇంటిస్థలం ఉన్న వారికి రెండు పడకగదుల ఇంటి కోసం నిధులు ఇస్తాం. ఎన్నికల తర్వాత నర్సరీ రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తాం. సుబాబుల్‌ ‌రైతుల సమస్యలను కూడా పరిష్కరిస్తామని సీఎం హా ఇచ్చారు. ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఉచితమైన గౌరవం ఉంటుందని అన్నారు. అలాగే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర రావును కూడా గుర్తుంచుకుంటామని అన్నారు. వీరిద్దరు తన హృదయంలో ఉన్నారని, వారికి అన్యాయం జరగదన్నారు. ఇక్కడ నామా నాగేశ్వర రావు గతంలో తెలంగాణ ఉద్యమంలో తనతో కలసి నడిచారని అన్నారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎవరూ అడగకుండానే ప్రజల అవసరాలు గుర్తించి పథకాలు అమలు చేస్తున్నామని తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. భూసమస్యలు లేకుండా ఉండేందుకు త్వరలో రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు చేస్తామన్నారు. రెవెన్యూ శాఖ పేరుతో సహా చట్టాన్ని మారుస్తామని చెప్పారు. ఏప్రిల్‌ ‌తర్వాత ఇంటింటికీ నల్లా ద్వారా నీరందిస్తామని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు కొనసాగిస్తా మన్నారు. పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే పంటకాలనీలుగా విభజించాల్సిన అవసరం ఉందన్నారు. భూమి, వాతావరణం బట్టి ఏయే పంటలు వేయాలో అధికారులు చెబుతారని.. దాన్ని రైతులు అనుసరించాలని సూచించారు. ఆరునూరైనా దేశానికి తెలంగాణ రాష్ట్రమే ఆదర్శం కావాలని చెప్పారు. తెలంగాణలో 16 సీట్లు తెరాసకే రావాలని.. కేంద్రంలో రాష్ట్రాల మాటలు చెల్లుబాటయ్యే ప్రభుత్వం ఉండాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు. దేశాన్ని 66 ఏళ్ల పాటు కాంగ్రెస్‌, ‌భాజపాలే పరిపాలించాయని.. వారి పాలనలో జరిగింది మాత్రం శూన్యమన్నారు. ఇందిరాగాంధీ నుంచి రాహుల్‌ ‌గాంధీ వరకు గరీబీహఠావో అని నినాదాలు ఇస్తున్నారని.. ఎన్నేళ్లు ఇంకా గరీబులు ఉండాలని ప్రశ్నించారు. ప్రధాని మోదీకి అవకాశమున్నా ఆయన కూడా చేయలేదన్నారు. ఈ వేదికపై నామా నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.