Take a fresh look at your lifestyle.

గెలుపు కోసం సామాజిక న్యాయాన్ని పక్కకు పెట్టి…

త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎంఎల్‌సి స్థానాలను ఎట్టి పరిస్థితిలోనూ గెలుచుకోవాలన్న లక్ష్యంగానే తమ పార్టీ గెలుపుగుర్రాలను ఎంపిక చేసినట్లు టిఆర్‌ఎస్‌ ‌వర్గాలు చెబుతుంటే, అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయాన్ని పాటించలేదని వివిధ వర్గాలవారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రత్యేకంగా రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న బిసి వర్గాలను పూర్తిగా విస్మరించినట్లు ఈ అభ్యర్థుల ఎంపిక చెబుతున్నదని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో తాజాగా మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఎన్నిక జరుగనుండగా మూడింటికి ముగ్గురు అభ్యర్థులను ఒకే సామాజిక వర్గానికి చెందినవారిని ఎంపిక చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది ఒక విధంగా వెనుకబడిన తరగతులవారిని అణగ దొక్కటమేనన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్‌కోసం అనేకమంది ఆశపడ్డారు. ముఖ్యంగా పద్నాలుగేళ్ళపాటు ఉద్యమాన్నే అంటిపెట్టుకున్న వారు, రాష్ట్రం సిద్ధించి అయిదేళ్ళు గడిచిపోతున్నా ఇంతవరకు ఎలాంటి ఆదరణకు నోచుకోని వారే ఇందులో ఎక్కువ మందిఉన్నారు. పోలీసుల లాఠీదెబ్బలు తిని, జైళ్ళపాలైనవారనేకులు ఇప్పుడు వెనుకవరుసలో పడిపోయారు. ఎప్పటికైనా తమకు గుర్తింపు వస్తుందని ఎదురుచూపులే గాని, వారిని అదృష్టదేవత వరించడంలేదు. తాజాగా స్థానికసంస్థల ఎంఎల్‌సి ఎన్నికల్లోనైనా తమను పార్టీ గుర్తిస్తుందనుకున్నవారికి ఆశ నిరాశే అయింది. మూడు ఎంఎల్‌సి స్థానాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల విషయంలోనైనా సామాజిక న్యాయాన్ని పాటించకపోవడం కూడా వారిలో తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తున్నది. పార్టీ ఎంపిక చేసిన ముగ్గురు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే కావడం వారి ఆవేశానికి కారణమవుతున్నది. వరంగల్‌ ఎంఎల్‌సి స్థానం విషయానికివస్తే ఇక్కడ ప్రధానంగా మూడునాలుగు పేర్లు వినిపించినా, అనేకమంది ఆశావహులున్నారు. వారందరినీ పక్కకు పెట్టి ఉద్యమంలో పెద్దగా భాగస్వామికాని పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని ఎంపిక చేయడం పట్ల పలువురు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి పార్టీ వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌కు అతి సన్నిహితుడు కావడంవల్లే ఆయన్ను ఈ స్థానంనుండి పోటీకి నిలబెట్టినట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నది. తెలంగాణ ఉద్యమం శ్రీకారం చుట్టినప్పటి నుండి ఉద్యమ రథసారథి కెసిఆర్‌ను అంటిపెట్టుకుని, పార్టీ కార్యాలయానికే అంకితమైన మధుసూదనాచారికి మరో అవకాశం ఇవ్వకపోవడమేంటన్నది ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లావాసుల నుండి వస్తున్న ప్రశ్న. ఎంతో కష్టపడి తన నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ, అటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతోపాటు, తనకిచ్చిన స్పీకర్‌ ‌బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తిని కాదనడమేంటంటున్నారు. అలాగే రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్‌రెడ్డికి, నల్లగొండనుంచి తేరా చిన్నపరెడ్డికి తెరాస బి ఫాంలను ఇచ్చింది. అయితే వీరి ముగ్గురిని ఎంపిక చేయడంలో టిఆర్‌ఎస్‌ ‌వ్వూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిని గెలుపు గుర్రాలుగా పార్టీ భావిస్తోంది. తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఘోర పరాజయంపాలైంది. రెండు టిచర్‌ ‌నియోజకవర్గాలు, ఒక గ్రాడ్యుయేట్‌ ‌నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ ‌పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇది ఒక విధంగా పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ప్రతిపక్షాలన్నీ ఈ ఓటమిని ఎన్నికల ప్రచారంలో ఎత్తిచూపాయి కూడా. అయితే తమ అభ్యర్థుల ఓటమిని ముందుగానే ఊహించిన టిఆర్‌ఎస్‌ ‌తమ పార్టీనుంచి అభ్యర్థులెవరినీ నిలబెట్టలేదనేందుకు వారికి పార్టీ ముద్రవేయకుండా తప్పించుకుంది. కాని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రస్తుతం జరుగనున్న ఎంఎల్‌సి ఎన్నికల్లో మాత్రం పార్టీ పరంగా అభ్యర్థులను నిలబెడుతున్నది. ఈ అభ్యర్థుల గెలుపుకోసం ప్రతీ స్థానానికి ప్రత్యేకంగా మంత్రులను కేటాయిస్తోంది కూడా. జాతీయ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్న దశలో రాష్ట్రంలో జరిగే ప్రతీ ఎన్నికను ఆ పార్టీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఈ ఎన్నికల్లో జడ్‌పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వోటర్లుగా ఉంటారు. అయితే విచిత్ర విషయమేమంటే తాజాగా జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు వెల్లడికానున్నాయి. కొద్ది రోజుల్లోనే కొత్త సభ్యులు వస్తుండగా, పాత సభ్యులతోనే ఈ ఎన్నికలు జరుపడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన కాంగ్రెస్‌, ‌త్వరలో న్యాయస్థానం తలుపులు తట్టబోతున్నది. మూడు స్థానాలకు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల పర్వం మే 31 నుండి ప్రారంభమై, జూన్‌ 3‌న వోట్ల లెక్కింపుతో పూర్తికానుంది. అయితే పాతవారి కాలపరిమితి జూలై 5వరకు ఉండటంవల్లే తామీ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ‌చెబుతున్నది. ఇదిలా ఉంటే గత స్థానిక ఎన్నికల్లో వివిధ పార్టీలనుండి గెలిచిన జడ్‌పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లలో చాలామంది ఇప్పుడాపార్టీలో లేరు. అనేకులు అధికారపార్టీలో చేరిపోయారు. ఇది ఒక విధంగా టిఆర్‌ఎస్‌కు కలిసివస్తున్న అవకాశంకాగా, ప్రతిపక్షాలకు ఇబ్బందిపెడుతున్న అంశంకూడా. గతంలో మూడు స్థానాలను కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ఈ ‌మూడు స్థానాల్లో ఏ ఒక్కదాన్ని కూడా జారవిడుచుకోవద్దని వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో భాగమే ఈ అభ్యర్ధుల ఎంపికగా ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!