Take a fresh look at your lifestyle.

గులాబీ గూటికి..కాషాయ కోటకు మధ్య దూరం..?

నరసింహన్‌ ‌శైలి వేరు, తమిళి సై తీరు వేరు. నరసింహన్‌ది బ్యూరోక్రాట్‌ ‌నేపథ్యం కాగా, తమిళి సైది పూర్తిగా రాజకీయ నేపథ్యం. అటు గులాబీ గూటికి-కాషాయ కోటకు మధ్య దూరం పెరిగినట్లు స్పష్టం అవుతూనే ఉంది. వీరిద్దరి మధ్య సమీకరణాలు ఇలా ఉంటే బీజేపీ నాయకురాలి నుంచి గవర్నర్‌గా వచ్చిన తమిళి సై నివేదికలు ప్రభుత్వ తీరును తప్పుపట్టేలా ఉంటాయన్నది సహజ అంచనానే
ఓ వైపు ఉధృతం అవుతున్న ఆర్టీసీ సమ్మె, ఇతర సంఘాలు, విపక్షాల నుంచి పెరుగు తున్న మద్దతు, ప్రభుత్వ తీరుపై హైకోర్టు అసం తృప్తి… వీటితో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలోనే రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై ఢిల్లీకి ప్రయాణం కట్టారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ఆమె ప్రధాని నరేంద్ర మోడి, హోమ్‌ ‌శాఖా మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. షా-మోడీ జోడికి ఆమె కేసీఆర్‌ ‌ప్రభుత్వంపై ఏం నివేదించారు అన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. అసలు తమిళి సై నియామకం జరిగిన క్షణం నుంచే అనేక అనుమానాలు రేగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని నిలువరించటానికి, తెలంగాణాలో పాగా వేసే భవిష్యత్‌ ‌లక్ష్యం దిశగానే తమిళనాడు బీజేపీలో దూకుడుగా వ్యవహరించే తమిళి సైను రాజ్‌భవన్‌కు తీసుకువచ్చారన్నది కాదనటానికి అవకాశం లేని ఓ వాదన. ఆమె రాష్ట్రంలో అడుగు పెట్టినప్పప్పటి నుంచి ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తూనే ఉండి ఉంటారు కేసీఆర్‌ ‌కూడా. దాదాపు పదేళ్ళ సుదీర్ఘ కాలం పాటు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన నర్సింహన్‌తో కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉండేది. ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించినంత వరకు ఇద్దరూ సమన్వయంతో వ్యవహరించారు. అవసరమైనప్పుడల్లా ప్రభుత్వ పనితీరుకు నరసింహన్‌ ‌కితాబులిచ్చేవారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రికార్డు కాలంలో సమర్థవంతంగా పూర్తి చేస్తున్నారనే విషయాన్ని చెప్పటానికి కేసీఆర్‌ను ఆయన ఏకంగా కాళేశ్వర రావుగా అభివర్ణించి విపక్షాల విమర్శలు ఎదుర్కొన్నా …ఆయన పెద్దగా ఖాతరు చేయలేదు. వారిద్దరి మధ్య స్నేహం పొరపొచ్చాలు లేకుండా సాగిపోయింది. దీనితో కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర గురించి ఎటువంటి నివేదికలు ఇచ్చి ఉంటారు అన్న అనుమానం, ప్రశ్న పెద్దగా వచ్చేది కాదు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.నరసింహన్‌ ‌శైలి వేరు, తమిళి సై తీరు వేరు. నరసింహన్‌ది బ్యూరోక్రాట్‌ ‌నేపథ్యం కాగా, తమిళి సైది పూర్తిగా రాజకీయ నేపథ్యం. అటు గులాబీ గూటికి-కాషాయ కోటకు మధ్య దూరం పెరిగినట్లు స్పష్టం అవుతూనే ఉంది. వీరిద్దరి మధ్య సమీకరణాలు ఇలా ఉంటే బీజేపీ నాయకురాలి నుంచి గవర్నర్‌గా వచ్చిన తమిళి సై నివేదికలు ప్రభుత్వ తీరును తప్పుపట్టేలా ఉంటాయన్నది సహజ అంచనానే.
ప్రధాని మోడీతో గవర్నర్‌ ‌తమిళి సై సుమారు 40 నిమిషాల పాటు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ ‌చేపట్టిన పలు అంశాలు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్‌ ‌వినియోగాన్ని పూర్తిగా నిషేధించటం, యోగా అమలు చేయటం, ఐదు రోజుల పాటు బతుకమ్మ సంబరాలను రాజ్‌భవన్‌ ‌నిర్వహించటం…ఇటువంటి విషయాలు ప్రెస్‌నోట్‌ ‌రూపంలో విడుదల అవుతాయి. అయితే అసలు నివేదిక మాత్రం ఆర్టీసీ సమ్మె పైనే అన్నది మీడియాకు లీక్‌ అయిన సమాచారం. 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల పరిష్కా రానికి సమ్మె చేస్తున్నా సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోలేదని తన నివేదికలో పేర్కొన్నారట. పైగా సమ్మెలో పాల్గొన్నందుకు ఏకంగా 48 వేల మంది కార్మికులను డిస్మిస్‌ ‌చేయటంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారిందని, ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని, అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్ల వల్ల జరిగిన ప్రమాదాలు గురించి ఆమె మోడీ-షా జోడికి దృష్టికి తీసుకువెళ్లారు. బీజేపీతో సహా విపక్షాలు, పలు సంఘాలు తనను కలిసి ఆర్టీసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు ఆమె చెప్పే ఉంటారు. ఆర్టీసీ సమ్మెతో పాటు మరికొన్ని ఆసక్తికర విషయాలను ఆమె ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్లు కొన్ని పత్రికలు రిపోర్ట్ ‌చేశాయి. వాటిలో కీలకమైంది మైనింగ్‌ ‌మాఫియా వ్యవహారం. ఈ విషయాలను ముందుగా రాష్ట్ర బీజేపీ నేతలు గవర్నర్‌ ‌దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఆరోపణలు అధికార టీఆర్‌ఎస్‌కు సంబంధించినవి కావటమే అసలు విషయం. కరీంనగర్‌ ‌స్మార్ట్ ‌సిటీ టెండర్లలో అక్రమాల ఆరోపణలు, అధికార పార్టీకి చెందిన కొంత మంది నేతలు కరీనంగర్‌లో భారీగా గ్రానైట్‌ అ‌క్రమ వ్యాపారం చేస్తూ పన్నుల ఎగవేతకు పాల్పడ్డారని, ప్రభుత్వ ఆదాయానికి మైనింగ్‌ ‌మాఫియా గండికొట్టకుండా చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు తనకు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ఆమె వివరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎమ్‌ ‌కేసీఆర్‌కు, గవర్నర్‌ ‌తమిళి సైకు మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్న చర్చకు, ఊహాగానాలకు అవకాశం ఏర్పడటం సహజమే. ఇప్పటి వరకు వీరి మధ్య సంబంధాలు ప్రత్యేకించి అనుకూలంగా కాని, లేక చెప్పుకోదగ్గ ప్రతికూలత గాని ఉన్నట్లు కనిపించలేదు.
మన పొరుగున ఉండే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్ఛేరిలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వానికి, కేంద్ర ప్రతినిధి లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ ‌కిరణ్‌ ‌బేడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే వాతావరణమే ఉంటుంది. దేశంలో మొదటి ఐపీఎస్‌ అధికారిణి అయిన కిరణ్‌బేడి ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఉద్దేశించి నల్లకాకిగా ట్విట్టర్‌లో వ్యాఖ్యానించటం పెను దుమారం రేపింది. నారాయణ స్వామి ఏకంగా రాజ్‌భవన్‌ ‌ముందే నిరసనకు దిగారు. ప్రభుత్వ వ్యవహారాల్లో నిత్యం జోక్యం చేసుకుంటారన్నది ఆమెపై ఉన్న విమర్శ. వీరిద్దరి మధ్య రాజకీయ యుద్ధం కోర్టు గుమ్మం కూడా ఎక్కింది. ఒక కేసు విచారణ సందర్భంలో మద్రాస్‌ ‌హైకోర్టు కూడా ప్రభుత్వ రోజు వారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకునే హక్కు లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌కు లేదని తేల్చి చెప్పటంతో కిరణ్‌ ‌వర్గం కాస్త వెనక్కు తగ్గింది. ఢిల్లీలోని ఆప్‌ ‌ప్రభుత్వం కూడా ఇటువంటి సంఘర్షణే ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి అరవింద్‌ ‌కేజ్రీవాల్‌కు, లెఫ్ట్‌నెంట్‌ ‌గవర్నర్‌ అనిల్‌ ‌బైజాల్‌ ‌మధ్య కూడా పలు సందర్భాల్లో వివాదాలు నెలకొన్నాయి. ఓసారి గవర్నర్‌ ‌నివేదికను బహిరంగ వేదిక మీదే చించివేసి కేజ్రీ తన అసంతృప్తిని, నిరసనను బాహాటంగా వ్యక్తం చేశారు. బైజల్‌ ‌కార్యాలయంలోనే సీఎమ్‌ ‌హోదాలో కేజ్రీ కొద్ది రోజుల పాటు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా సుప్రీమ్‌ ‌కోర్టు ఆప్‌ ‌ప్రభుత్వానికే మద్దతు ఇచ్చింది. ప్రభుత్వ సలహా మేరకే లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌పని చేయాలని సుప్రీమ్‌ ‌విస్తృత ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతకు ముందు ఉన్న ఎల్జీ నజీబ్‌ ‌జంగ్‌కు, అరవింద్‌ ‌కేజ్రీలకు మధ్య కూడా సంఘర్షణ వాతావరణమే ఉండేది. అంతెం దుకు నరేంద్రమోడి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు, అప్పటి ఆ రాష్ట్ర గవర్నర్‌ ‌కమలా బేణివాల్‌కు మధ్య కూడా సఖ్యత వాతావరణం ఉండేది కాదు. మోడి ప్రభుత్వం ప్రతిపాదించిన లోకాయుక్త కమిషన్‌ ‌బిల్లును గవర్నర్‌ ‌వెనక్కి పంపటంతో వివాదం రోడ్డున పడింది. గవర్నర్‌, ‌హైకోర్టు సీజే పాత్రను కుదించి ముఖ్యమంత్రికే అన్ని అధికారాలు కట్టబెట్టడటమే దీనికి కారణం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత అనేక రాష్ట్రాల్లో బీజేపీ నియమించిన గవర్నర్లు కీలక సమయాల్లో పార్టీకి అనుకూల వైఖరి తీసుకున్న సందర్భాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి తెలంగాణా పరిస్థితులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తాయా? గవర్నర్‌ ‌తమిళి సైతో కేసీఆర్‌ ‌ప్రభుత్వ సంబంధాలు ఏ రకంగా ఉండనున్నాయన్నది స్పష్టంగా తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.
రెహాన,
సీనియర్‌ ‌జర్నలిస్టు
9492527352

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!