వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గురుభ్యోనమః..!

September 5, 2019

  • ఉపాధ్యాయ వృత్తిలో.. గౌరవం, సంతృప్తి మరేవృత్తిలో ఉండదు
  • విద్యావ్యవస్థ బలోపేతానికి చర్యలు
  • తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి
  • ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించిన మంత్రి.

ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత గౌరవం, సంతృప్తి మరే వృత్తిలో ఉండదని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ ‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను రవీంద్రభారతిలో సత్కరించింది. పాఠశాల విద్య నుంచి 43 మంది, జూనియర్‌ ‌కాలేజీల నుంచి 10మంది, ఎయిడెడ్‌ ‌కాలేజీల నుంచి 5 మంది, డిగ్రీ కాలేజీల నుంచి 14 మంది, విశ్వవిద్యాయాల నుంచి 30 మంది ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నారు. వీరిని ప్రభుత్వం తరఫున విద్యాశాఖా మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి శాలువాతో సత్కరించి, 10 వేల నగదు బహుమతి, బంగారు పూత పూసిన వెండి పతకం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురువులను గౌరవించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పు‌డూ ముందుంటాడు. ఆయనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఉపాధ్యాయులను మన దేశంలో చాలా గౌరవిస్తారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నంత గౌరవం, సంతృప్తి మరే వృత్తిలో దొరకదన్నారు. సమాజంలో గొప్ప వాళ్లను తయారు చేసేది ఉపాధ్యాయులు అన్న విషయం మరిచిపోకూడదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై చాలా చర్యలు తీసుకుంటున్నామనీ, గురుకుల విద్యను ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు. విద్యావ్యవస్థపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి గుర్తు చేశారు. అవార్డు గ్రహీతలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ ‌రెడ్డి, పలువురు అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.