Take a fresh look at your lifestyle.

గజ్వేల్‌లో ఢీ అంటే ఢీ

  • హరీష్‌ వర్సెస్‌ వంటేరు
  • ఉత్కంఠగా ఎన్నికల ప్రచారం
  • పేలుతోన్న మాటల తూటాలు
  • ప్రతిష్టగా తీసుకున్న హరీష్‌
  • హాట్‌ హాట్‌గా గజ్వేల్‌ రాజకీయాలు

సిద్ధిపేట, నవంబర్‌ 5 (ప్రజాతంత్ర బ్యూరో): ఇప్పుడు అందరి చూపు గజ్వేల్‌ వైపే. అందరూ గజ్వేల్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. గజ్వేల్‌లో ఏం జరుగుతుందనీ. దీనికి కారణం లేకపోలేదు. ఇక్కడి నుంచి డిసెంబర్‌ 7న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల బరిలో టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గులాబీ దళపతి, రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పోటీలో ఉండటమే. టిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేసీఆరే అయినప్పటికీ… కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, టిఆర్‌ఎస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌, రాష్ట్ర ఆపద్దర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు వర్సెస్‌ అన్నట్లుగా రాజకీయాలు మారాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. పోలీసుల స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా గజ్వేల్‌ నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. ఉత్కంఠగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. గజ్వేల్‌లో హరీష్‌ వర్సెస్‌ ప్రతాప్‌రెడ్డి మధ్య రాజకీయాలు నడుస్తున్నాయి. ఢీ అంటే ఢీ అని సవాల్‌ విసురుకుంటున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా రాష్ట్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బరిలో ఉండనుండగా…కాంగ్రెస్‌ పార్టీ తరపున వంటేరు ప్రతాప్‌రెడ్డి ఉండటం దాదాపుగా ఖాయమే. టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్‌ తరపున తన్నీరు హరీష్‌రావు గత కొన్ని రోజులుగా అన్నీ తానై ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హరీషే అభ్యర్థిని అనే విధంగా ప్రచారం నిర్వహిస్తుండటంతో…కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి కాస్త ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తున్నది. దీంతో ప్రతాప్‌రెడ్డి హరీష్‌రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌తో హరీష్‌రావు టచ్‌లో ఉన్నాడనీ, గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించాలనీ తనను కోరాడనీ, అవసరమైతే ఆర్థిక సహాయం కూడా చేస్తానంటూ ఫోన్‌లో కోరినట్లు ప్రకటించి ప్రతాప్‌రెడ్డి మాట్లాడటం ద్వారా రాజకీయాలలో వేడిని పుట్టించారు. కొత్త చర్చకు దారి తీశారు.

హరీష్‌పై ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనమే కాకుండా పెను దుమారాన్ని రేపాయి. ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్వయంగా హరీషే ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతాప్‌రెడ్డికి గజ్వేల్‌లో ఓటమి భయం పట్టుకుని…తనపై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారనీ, నేను ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు చూపాలనీ లేకుంటే ఊచలు లెక్కించేలా చేస్తాననీ హరీష్‌ కాస్త ఘాటుగానే స్పందించారు. హరీష్‌ మాట్లాడినట్లుగానే గజ్వేల్‌ నియోజకవర్గంలోని పలు పోలీస్‌ స్టేషన్లలో ప్రతాప్‌రెడ్డి వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ నాయకులు లిఖితపూర్వంగా ఫిర్యాదులు చేశారు. ప్రతాప్‌రెడ్డి మాటల్ని సీరియస్‌గా తీసుకున్న హరీష్‌రావు…ప్రతాప్‌రెడ్డికి రాబోవు ఎన్నికలలో డిపాజిట్లు కూడా దక్కకుండా చేస్తాననీ, ప్రతాప్‌రెడ్డిని ఓడించే వరకు గజ్వేల్‌లోనే మకాం వేస్తాననీ ప్రకటించారు. హరీష్‌ చెప్పినట్లుగానే గత రెండ్రోజులుగా గజ్వేల్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహిస్తున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి కేసీఆర్‌కు లక్ష వోట్ల మెజారిటీయే లక్ష్యంగా క్యాడర్‌లో జోష్‌ను పెంచే విధంగా గ్రామ గ్రామం తిరుగుతున్నారు. వివిధ కుల సంఘాలు, కార్మిక సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఆశీర్వాద సభలలో పాల్గొంటున్నారు.

గజ్వేల్‌లో హరీష్‌రావు తిరుగుతుండటం వల్ల తన ప్రచారానికి ఇబ్బందిగా మారిందనీ పసిగట్టిన ప్రతాప్‌రెడ్డి గజ్వేల్‌లో హరీష్‌రావును తిరగనివ్వకుండా ఉండటమే కోసమే సంచలన వ్యాఖ్యలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వరుసగా రెండు పర్యాయాలు గజ్వేల్‌ నుంచి టిడిపి తరపున పోటీ చేసి ఓడిన ప్రతాప్‌రెడ్డి ఈ దఫా కాంగ్రెస్‌ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో ప్రతాప్‌రెడ్డి ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. దీనికి తోడుగా టిఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ చేరిక తనకు కలిసి వస్తుందనీ ప్రతాప్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే, ఈ ఎన్నికలలోనూ ప్రతాప్‌రెడ్డికి ఓటమి తప్పదనీ హరీష్‌ చెబుతున్నారు. కనీసం డిపాజిట్‌ కూడా దక్కన్వివననీ ఇప్పటికే ప్రకటించిన హరీష్‌ ఆ దిశగా తన వ్యూహాలకు పదను పెడుతున్నారు. ప్రచారం, చేరికలతో హరీష్‌రావు ప్రతాప్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో గజ్వేల్‌లో రాజకీయం చాలా హీటెక్కింది. అందరూ గజ్వేల్‌ గురించి మాట్లాడుకునేలా…చూసేలా అయింది. నామినేషన్ల పర్వం మొదలు కాకముందే ఇంతగా వేడి పుట్టిస్తున్న గజ్వేల్‌ రాజకీయాలు నామినేషన్ల పర్వం పూర్తయ్యాక మరింతగా హాట్‌ హాట్‌గా సాగే అవకాశం లేకపోలేదనీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పోటీ కేసీఆర్‌-ప్రతాప్‌రెడ్డికి మధ్య అయినప్పటికీ…ప్రచార సరళి, మాటల తూటాలు, సవాళ్లు, ప్రతి సవాళ్ల తీరును చూస్తుంటే మాత్రం పోటీ హరీష్‌రావు-ప్రతాప్‌రెడ్డి మధ్య అనే విధంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy