Take a fresh look at your lifestyle.

గంగిరెడ్డికి నివాళి అర్పించిన సిఎం జగన్ అం‌త్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

పులివెందుల,అక్టోబర్‌ 3 : ‌డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ ‌ద్వారా పులివెందులకు చేరుకున్నారు. మధ్యాహ్నం  గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి  పార్థివ దేహానికి డిప్యూటీ సీఎం అంజాద్‌ ‌బాషా, మంత్రులు ఆదిమూలం సురేష్‌, ‌పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, శ్రీకాంత్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, గౌతమ్‌రెడ్డి నివాళర్పించారు. ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు.

గంగిరెడ్డి సీఎం వైఎస్‌ ‌జగన్‌ ‌సతీమణి వైఎస్‌ ‌భారతి తండ్రి. ఆయన పులివెందులలో ప్రముఖ వైద్యులు. ఈయనకు పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు ఉంది. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్‌ ‌వరకూ ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల గవర్నర్‌ ‌బిశ్వభూషణ్‌ ‌సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రఖ్యాత శిశు వైద్యునిగానే కాక, ప్రజా వైద్యునిగా ప్రసిద్ది చెందారని ప్రస్తుతించారు. గంగి రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటు న్నానన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌కు, ఆయన భార్య వైఎస్‌ ‌భారతి, కుటుంబ సభ్యులకు గవర్నర్‌ ‌సంతాపం తెలిపారు. ప్రజాసేవకు డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డి ఒక చిరునామా అని.. ఆయన మరణం బాధాకరమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పేదలకు విశేషంగా వైద్యసేవలు అందించారని, ఎన్నో కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారన్నారు. పులివెందుల ప్రాంతం అభివృద్ధిలో ఈసీ గంగిరెడ్డికి సుస్థిర స్థానం ఉందని ట్వీట్‌ ‌చేశారు. డాక్టర్‌ ఈసీ గంగిరెడ్డికి ఆయన ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply