Take a fresh look at your lifestyle.

కోర్టు చెప్పినంక సూత లెక్క లేకుంట బాయె!

ఇది మునుపయినట్టు కార్మికులకు సర్కారుకు మద్దెన జీతాలు బత్తాల లొల్లికాదు. ‘‘ఆర్టీసీ ఆస్తులకు ఎసరువెట్టిన పెట్టుబడిదారోళ్ళకు, పాణాలు తెగిచ్చైనా సరే వాటిని కాపాడుకోవాలనుకునే తెలంగాణ సమాజానికి మధ్య రగులుకున్న బడబాగ్గి’’ కాబట్టే యేదో కతలుబడి ఓ కొస్సకు తెచ్చుకునుడు రేవుగాక సర్కార్‌ ‌సొరికెలల్ల సొచ్చే తిప్పలు పడ్తాందనేది నిప్పాసొంటి నిజం.ఈ నిజాన్ని అబద్ధమని చెప్పనన్న చెప్పాలె! లేకుంటె నిజాన్ని నిజమని ఒప్పుకోనన్న ఒప్పుకోవాలె! నిజం, అబద్ధం రొండు ఎదురుంగనే నిల్సోని సంగతేందని నిలేయబట్టి నెలరోజులయినా జవాబియ్యని సర్కార్‌ ‌రోజుకో నిండు పాణాన్ని బలి తీసుకోబట్టె!

నిజం గల్మ దాటక మునుపే అవదం ఐదూర్లు చెక్కర్లు కొట్టత్తదంటరు..అప్పుడప్పుడు లచ్చల మంది చెప్పే నిజం సూత ఒక బక్క పీనుగాసొంటోడు జెప్పే అబద్ధం ముందు బోర్ల బొక్కల వడ్తది.ఏది నిజం? ఏది అబద్ధం? ‘‘నిజం నిల్కడ మీద తేల్తది’’, ‘‘నిజం నిప్పాసొంటిది’’ అనే గీ ముచ్చట్లు మస్తుగిన్నం. నిజాన్ని నిజమని జెప్పుడు యింతాంత తిప్పలుగాదు, గవాయి సాచ్చాలెన్నున్నా నిజం నిజంగాకుంట మంట్లెగల్వచ్చుసూత. ఎన్కట ‘‘భూమి సాపలెక్క లేదుల్లా! పోరగాండ్లాడుకునే చెండోలిగె వుంటదని’’ చెప్పిన పెద్దమనిషేమయిండు. మంత్రాలకు చింతకాయలు రాలయన్న నిజం తెల్షిసూత సాముల కాళ్ళేల్లు మొక్కుకుంట యజ్ఞాలు జేషేటోళ్ళుంటరు. నిజం బొంద మీద అబద్ధం మొల్కలు పెరిగి పూలు పూత్తాంటె ఎవలం యేంజేషేదేమున్నది! నికాల్సైన నిజమోటి నాలుగొద్దులైనంక అబద్ధమైతదా! అబద్ధం గిట్ల మేకపేసుకుంటె నిజమైతదా!
మునుపు జరిగిన ఆర్టీసీ సమ్మెలల్ల చర్చల నవ్వులు పూషి కొస్సెల్లేది. ఇప్పుడచ్చిన సమ్మె టెంటుకింద దినానికో సావుడప్పు యెందుకినిపియ్య బట్టెనో! యేమో! వీళ్ళ సమ్మె యెందుకిట్ల వారాలు దాటబట్టెనో సర్కారు కెరుకయినంక సూత ముచ్చట ఒడిపిత్తలేరాయె! అందుకే ఆర్టీసోళ్ళ సమ్మెకు సబ్బండవర్ణాలచ్చి జై గొట్టినయి. సకలజనుల దీక్షకు సైరనూదినయి. ఇది మునుపయినట్టు కార్మికులకు సర్కారుకు మద్దెన జీతాలు బత్తాల లొల్లికాదు. ‘‘ఆర్టీసీ ఆస్తులకు ఎసరువెట్టిన పెట్టుబడిదారోళ్ళకు, పాణాలు తెగిచ్చైనా సరే వాటిని కాపాడుకోవాలనుకునే తెలంగాణ సమాజానికి మధ్య రగులుకున్న బడబాగ్గి’’ కాబట్టే యేదో కతలుబడి ఓ కొస్సకు తెచ్చుకునుడు రేవుగాక సర్కార్‌ ‌సొరికెలల్ల సొచ్చే తిప్పలు పడ్తాందనేది నిప్పాసొంటి నిజం.ఈ నిజాన్ని అబద్ధమని చెప్పనన్న చెప్పాలె! లేకుంటె నిజాన్ని నిజమని ఒప్పుకోనన్న ఒప్పుకోవాలె! నిజం, అబద్ధం రొండు ఎదురుంగనే నిల్సోని సంగతేందని నిలేయబట్టి నెలరోజులయినా జవాబియ్యని సర్కార్‌ ‌రోజుకో నిండు పాణాన్ని బలి తీసుకోబట్టె! ఇది ‘అచ్చరాలై’ పాణం పోసుకోని అసలు సిసలు నిజముల్లా!

చిలుక బాలవర్థి చేతులుంటె మాంత్రగాని మంత్రాలెట్ల పారుతయి? వేల కోట్ల ఆస్తులాగమైతానయన్న అసలు నిజం తెలంగాణ సమాజం చెవులబడ్డంక, తీరొక్క మంత్రాలేయి పారక సర్కార్‌ ‌సావో బతుకో రేవుకచ్చింది. ఇజ్జత్‌ ‌కేడిషెటోడు లోపట అడ్డెడు భయవున్నా సూత పైకి మాత్రం డాం! డూం! అంటడు. నిజాన్ని జూషి అబద్ధం భయపడ్తది. ఆర్టీసీ సంఘాల లీడర్లు అన్ని అబద్ధాలు జెప్పవట్టిండ్లని కార్మికులల్ల ఒక్కలన్న అనుకుంటాండ్లా! మూడుపండుగల సంది ఉపాసమున్న గని జీతాలెవలన్న కావాలంటాండ్లా! ఇరవై ఆరు డిమాండ్లని సమ్మెకు దిగినోళ్ళు ‘‘ఒక్క విలీనం’’ డిమాండ్‌ ఒప్పుకుంటె మిగిలినయి సూసుకుంటమాయెననే అంటాండ్లు గదా! మొన్నోపాలి దరకాస్తు జేసుకోని సప్పుడేక నౌకర్ల చేరమంటె ఒక్కలంటె ఒక్కలన్న జేరిండ్లా! ఏ యాడాదికాయాడాది లెక్కలు జూత్తె నాలుగు వేలపైషిలుకు కోట్లల్ల ఆర్టీసీకి బాకీ పైసలు ఎగ్గొట్టిండ్లని సర్కార్‌ ‌లెక్కలల్లనే కానత్తాంటె సర్కార్‌ ‌మైకులల్లిడిషే లొట్టపీసు ముచ్చట్లన్ని పచ్చిఅబద్ధాలని జనం నవ్వుకుంటలేరా! తెలంగాణ ఉద్యమంల కాలడ్డం పెట్టినోళ్ళు గులాల్‌ ‌సల్లంగనె ఎమ్మెల్లేలో, మంత్రులో అయితరు కావచ్చు గని పుట్టెడు అబద్ధాలను సర్కార్‌ ‌మైక్‌ల జెప్పంగనె నిజాలైపోతయా! ఎర్రెల్లి ఫాంఅవుజు ఒక దిక్కునుంటె, ఎజెండాలిడిషి జెండాలన్ని ఇంకో దిక్కున నిలుసుండె! సర్కార్‌కు ఎనుకపొంటున్న నిల్వునామాల సాములకు నైవేద్దెం పెట్టేందుకు వేల మంది కడుపు కొట్టి బతుకులెండబెట్టుడు నిజం కాదంటరా!

పదేండ్లు కొట్లాడినోళ్ళే పలానా జెండాకు అసలైన ఓనర్లని అనుకోంగ లేంది, యేండ్ల సంది టికెట్‌ ‌కొని ఆర్టీసీని బతికించుకునే ప్రయాణీకులే ఆర్టీసీకీ అసలైన ఓనర్లంటె తప్పెట్లయితది? గీ ముచ్చట నిజం కాబట్టే సమ్మె ఒక్క మాటకు కట్టుబడున్నది. కోట్లాది మంది నమ్మిక తోని నడిపిచ్చుకునే ఆర్టీసీ మీద పెత్తనం మీదేసుకోని అందినకాడికి ఆస్తుల ఒల్సుకుంటనంటె జనం మర్లబడకుంటుంటరా! అయినోళ్ళందరికి అడ్డగోలు లెక్కన వుప్పు పుట్నాల తీరిగ ఆస్తుల్ని పంచినప్పుడు యాదికి రాలేగని బాకీ వున్న పైసల లెక్కడుగుడుతోనె విభజన లెక్కలు ముందటేసుడేందని జనమడుగరా? గీ అబద్దమే జర్రంత సేపు నిజమనుకుందాం! విభజన లెక్కలు తేలనప్పుడు అమ్దానీ రాకాపోకలన్ని గట్లనే వున్నంక అక్కడ ‘‘సై’’ అయినయన్ని ఇక్కడ ‘‘నై’’ ఎట్లయితయి?అక్కడ అడగకముందే అయ్యేటియి, మనకాడ అడగబట్టినా కాకపోవుడేందనేది, యెందుకనేది తేలాలె కదా!
అనుభవం లేనోళ్ళకు బస్సులప్పజెప్తె, రోడ్ల మీద తోలుడు రాక వాటిని మనుషుల మీదికి తోలి జనం పాణాలు తీయబట్టె! వేలల్ల ప్రయివేట్‌ ‌బస్సులు తెచ్చి ఇంకెంతమంది పాణాలు తీత్తరో!. సేవారంగమని మరిషి లాభం గువ్వలకచ్చిందని, సర్కారే యాపారం లెక్కలేత్తాంటె రేపచ్చే ప్రయివేట్‌ ‌యవ్వారం ఇంకెంత పెద్ద యాపారం జేత్తరో అని జనం గుబులు పడవట్టిండ్లు. అందుకే ఆర్టీసీని సర్కార్‌ల విలీనం జెయ్యాలనే డిమాండ్‌ ‌బలంగ మారి, సర్కార్‌ను సవాల్‌ ‌జేత్తాంది.

సర్కార్‌ ‌జెప్పిన ఒక్క ముచ్చట్ల సూత నిజం లేదని, వాయిదాలల్ల సర్కారిచ్చిన లెక్కలన్నీ తప్పేనని కోర్టు చెప్తనే వుండె! చర్చల తోని ఒడగొట్టాలని, ప్రజల సహనానికి పరీక్ష పెట్టద్దని, ప్రజల ఆగ్రహం మంచిది కాదని కోర్టు చెప్పినంక సూత లెక్క లేకుంట బాయె! ‘‘ఆర్టీసీ ముచ్చటే ఒడిషినంక సంఘాలేడియి!? కార్మికులెవ్వరు? అందరెప్పుడో సెల్ఫ్ ‌డిస్మిస్‌ అయిండ్లని’’ చెప్పే మాటలు చెల్లయని కోర్టు అచ్చింతలేషింది. ఆర్టీసోళ్ళకు బాకీ వున్న మొత్తం పైసలు ఇయ్యాలని చెప్పింది. కోర్ట్ ‌మాటను పక్కకు బెట్టి, ఇయ్యమన్న జీతాలియ్యకపాయె! ఇయ్యకుంటె కోర్ట్ ‌కోడుతదా! అని ఎకసెక్కమాడబట్టిన సర్కార్‌. ఎం‌బడెవలు లేక ఒంటరైంది రొండునెలల జీతాలు రాకున్న సూత జీతాలు అడగకుంట ‘‘విలీనం’’ డిమాండ్‌ ఒక్కటే ముందుకు తేబట్టిండ్లు. గీ ‘‘నీయత్‌’’ ‌తనమే ఆర్టీసోళ్ళ విజయానికి తొవ్వ సూపుతాంది. ఆదివారం మంత్రుల సమావేశంల ఆర్టీసీని ముక్కలు చెక్కలు జేషే కతలు పడ్తడు గావచ్చని సంఘాలు ఆనుమాన పడ్తానయి.

సూడ్రా బయ్‌! ఇ‌క్రమార్క్ ‘‘ఇప్పటిదాంక ఇంటివి కదా! ఆర్టీసోళ్ళ నెల రోజుల సమ్మెల ఇరవై ఒక్క మంది కార్మికుల సావుకు కారణం ఎవలు కావచ్చు? వాళ్ళ నేరానికి శిక్ష యేంది గావచ్చు? సమ్మె టెంటు కింద రోజుకో సావు సప్పుడు ఇనిపిత్తాంటె సూత సమ్మె ఓ కొస్సకు రాకపోవటానికి కారణం ఎవ్వలు ? ఈ సారి గింత గొట్టు ప్రశ్నలు అడిగిన బేతాళుడి తెలివికి మెచ్చుకోని ‘‘పచ్చిఅబద్ధాలను సూత బ్రహ్మాండమైన నిజాలని, చెప్పి కోర్టును సూత వాయిదాల తొవ్వ పట్టియ్య బట్టిన సర్కార్‌ ఈ ‌సావులకు బరాబర్‌ ‌కారణం అని అనుకోవాలె! ‘‘సెల్ఫ్ ‌డిస్మిస్‌’’‌ను రిటర్న్ ‌గిఫ్ట్ ‌గ ఇయ్యక తప్పెటట్టులేదు. రొండోది, ఉన్న కొస్సల్ల ఒక్కటే! ఆర్టీసీని సర్కార్‌ల విలీనం చేయాలనేదే సమ్మెకు ముగింపని జీవిడిషిన కార్మికుల కుటుంబాలు బలంగ డిమాండ్‌ ‌చేయబట్టె! అయినా మొండిపట్టిడు వని సర్కార్‌ ‌పై చర్యలకు ప్రతిపాదించని రాజ్యాంగ వ్యవస్థ కారణం అయివుండచ్చు! అని మనుసులనుకుంట ఆలోచించుకుంట.భేతాళుని శవాన్ని భుజానేసుకోని ఇక్రమార్కుడు ఎప్పటిలాగనే…నడ్వబట్టిండు…నడ్వబట్టిండు.

– ఎలమంద, తెలంగాణ

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!