Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడిలో ఉమ్మడి కార్యాచరణ

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
ప్రజాప్రతినిధులు కూడా తోడ్పాటు అందించాలి
మంత్రి హరీష్‌ ‌రావు సూచన

కొరోనా కట్టడిలో ఆరోగ్యశాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు ప్రజా ప్రతినిధులు, క్రింది స్థాయి అధికారులందరూ కలిసి కుటుంబసభ్యులుగా భాగస్వాములై ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరమున్నదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్‌ అన్నారు. జిల్లాలో కొరోనా కట్టడి, బ్లాక్‌ ‌ఫంగస్‌, ‌లాక్‌ ‌డౌన్‌ అమలుపై సోమవారం జిల్లా కలెక్టర్‌ ‌యస్‌.‌హరీష్‌, అదనపు కలెక్టర్‌ ‌జి.రమేష్‌, ‌వైద్యాధికారులతో పాటు జిల్లా పరిషత్‌ ‌చైర్‌పర్సన్‌, ‌పార్లమెంట్‌ ‌సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, మున్సిపల్‌ ‌చైర్మన్లు, సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ ‌కమిషనర్లతో టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ.. కొరోనా వచ్చిన వారికి వ్యాధి నయం చేయడంతో పాటు, కొరోనా రాకుండా ప్రాథమిక దశలోనే వైద్యం అందించవలసి ఉన్నదని, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టడంతో పాటు ఆ కుటుంబం, ఆ ఊరు బాగుంటుందని అన్నారు. ఐసీఎంఆర్‌ ‌మార్గదర్శకాల ప్రకారం దగ్గు, జలుబు, ఒళ్ళు నొప్పులు, వాంతులు, గొంతునొప్పి, తలనొప్పి వంటి కొరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షల కోసం వేచి చూడకుండా మందుల కిట్టు తీసుకొని వైద్యులు చెప్పిన ప్రకారం వాడితే తగ్గిపోతుందని చెప్పారు. నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇతరులకు సోకే ప్రమాదముందని, అలాగే వ్యాధి తీవ్రత పెరిగి ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్‌ ‌సోకి చనిపోయే ప్రమాదముందని అన్నారు. మొదటి విడత ఇంటింటి సర్వేలో కొరోనా లక్షణాలున్నవారిని గుర్తించి ఇసోలేషన్‌లో ఉంచి, ఇచ్చిన మందులు జాగ్రత్తగా వాడుతున్నరా లేదా చూశామన్నారు.
అలాగే ఇప్పుడు రెండవ దశలో గ్రామస్థాయిలో నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో ఆశా వర్కర్లు, పంచాయతి కార్యదర్శితో పాటు ఉప సర్పంచు, సర్పంచు, వార్డు సభ్యులు తదితర ప్రజా ప్రతినిధులు చాలా సీరియస్‌ ‌గా పాల్గొని కొరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఐసోలేషన్‌ ‌చేయాలని ఆదేశించారు. ఒక గదే ఉన్నవారికి ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటి హాల్స్, ‌రైతు వేదికలను ఉపయోగించాలని సూచించారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్య బృందాన్ని పంపుతామన్నారు. ముఖ్యంగా రోడ్లపై సంచరించే బిక్షగాళ్లు, హమాలీల వంటి వారికి కూడా కొరోనా పరీక్షలు నిర్వహించి మందులు అందజే యాలని అన్నారు. కొరోనా వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలను దగ్గరుండి మానవతా దృక్పథంతో సజావుగా నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మున్సిపల్‌ ‌కమిషనర్లను, సర్పంచులను ఆదేశించారు. అవసరమైతే గ్రామపంచాయతి నిధులు వాడుకొనుటకు అనుమతిస్తామన్నారు. అదేవిధంగా లాక్‌ ‌డౌన్‌ అమలును కఠినంగా, పకడ్బందీగా అమలు చేయుటకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపు సమయంలో ఇంటి నుండి ఒక్కరు వచ్చి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేయాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు బయటకు రావద్దని, అత్యవస రమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ ‌వ్యాధి తగ్గిన తరువాత కొంతమందికి బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌సమస్య వస్తున్నదని, అలాంటి షుగర్‌ ‌టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అలాగే కంటిలో నలత ఉన్నా, పంటి నొప్పి ఉన్నా ప్రాథమిక దశలోనే పరీక్షించుకుంటే బ్లాక్‌ ‌ఫంగస్‌ను నివారించవచ్చని అన్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌కు మందుల కొరత ఉందని, అయినా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాదని, ఆయుష్‌ ‌మందులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌రోగులకు కింగ్‌ ‌కోటి ఆసుపత్రి , గాంధీ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఈ టెలి కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌హేమలత శేఖర్‌ ‌గౌడ్‌, ‌దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్‌ ‌రావు, ఆందోల్‌ ‌శాసనసభ్యులు క్రాంతి కిరణ్‌, ‌పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply