వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కేసీఆర్‌ ‌చక్రం తిప్పితే జగన్‌ ఏం ‌చేయాలి?

April 3, 2019

రాములమ్మ సూటి ప్రశ్నగులాబీ దళపతి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రాపై కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ ‌విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ సోషల్‌ ‌మీడియా వేదికగా తన మాటల తూటాల్ని పేలుస్తూనే ఉన్నారు. కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలను సంధిస్తూనే ఉన్నారు. తాజాగా…మరోసారి కేసీఆర్‌పై రాములమ్మ తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో 16 సీట్లలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీని గెలిపిస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని కేసీఆర్‌ ‌ప్రతీ ప్రచార సభలో చెబుతున్నారు. అసలు ఏ ధీమాతో కేసీఆర్‌ ‌జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని ఆరాట పడుతున్నారని విశ్లేషిస్తే…ఏపీలో వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ 20 నుంచి 22 సీట్లు గెలుస్తుందనే ధీమాతో తెలంగాణ సీఎం ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని తెలిసిందన్నారు. కేసీఆర్‌ ‌చెప్పే మాటల్లో లాజిక్‌ ‌లేనట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, 16 సీట్లు గెలిచే టిఆర్‌ఎస్‌… 20 ‌నుంచి 22 ఎంపీ సీట్లు సాధించిన వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీని ఎలా శాసించగలుగుతుందన్నారు. నిజంగా వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి టిఆర్‌ఎస్‌ ‌కంటే ఎక్కువ సీట్లు వస్తే కేసీఆర్‌ ‌చక్రం తిప్పే వరకు జగన్‌ ‌చూస్తుంటారా? కేసీఆర్‌ ‌చక్రం తిప్పితే మరి జగన్‌ ఏం ‌తిప్పాలి? పోనీ కేసీఆర్‌, ‌జగన్‌లు ఓ అవగాహనకు వచ్చేశారనుకున్నా, టిఆర్‌ఎస్‌ ‌కంటే ఎక్కువ సీట్లు సాధించే పక్షంలో మమత బెనర్జీ, మాయవతి వంటి సీనియర్‌ ‌నేతలు టిఆర్‌ఎస్‌ ‌చెప్పు చేతల్లో పని చేస్తారా? కేసీఆర్‌ ఎన్నికల ప్రచారాన్ని చూసిన తర్వాత ఇలాంటి భేతాళ ప్రశ్నలకు జవాబు దొరకడం లేదన్నారు. ఈ మతలబు తెలియడం వల్లే టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌సారు, కారు సర్కారు అని పదేపదే చెబుతున్నట్లున్నారు. సారు, కారు అని పదేపదే కేటీఆర్‌ ఎం‌దుకు కామెంట్‌ ‌చేస్తున్నారని ఆలోచిస్తే…కేసీఆర్‌ ‌సారు..ప్రధాని కారు అనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారని అర్ధం అయిందంటూ విజయశాంతి తన అధికారిక ఫేస్‌బుక్‌లో సెటైర్‌ ‌విసిరారు.