Take a fresh look at your lifestyle.

కెసిఆర్‌ ‌గడీల పాలనకు చరమగీతం

2023లో రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ
డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ప్రజలను మోసం
రైతుబంధు ఇచ్చి సబ్సిడీలన్నీ బంద్‌
అధికార పార్టీపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌‌ఫైర్‌

 

రాష్ట్ర ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను, దళిత గిరిజనులను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఎన్నికల సమయంలో లేనిపోని హామీలతో అయోమయానికి గురి చేసి వోట్లు దండుకుని అరాచక పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పేర్కొన్నారు. శనివారం వికారాబాద్‌ ‌పట్టణంలో సాయి డెంటల్‌ ‌కళాశాల నుంచి వికారాబాద్‌ ‌మీదుగా మమ్దన్పల్లి వరకు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శివారెడ్డి పేట వద్ద రైతు రచ్చబండ నిర్వహించి రైతులతో ముచ్చటించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ సీఎం పడ్నవీస్‌ ‌పాల్గొని మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తెలంగాణ ప్రజానీకం పన్నుల రూపంలో చెల్లిస్తున్న ధనాన్ని  దోచుకుంటున్నారని పేర్కొన్నారు.  కేవలం ఎన్నికల్లో లబ్ది పొందేందుకు ప్రజాధనాన్ని వాడుకుంటూ రాష్ట్ర ఖజానాను లూటీ చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం వికారాబాద్‌ ‌బీజర్‌ ‌చౌరస్తాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ..రాష్ట్రంలో కొట్లాడుతూ నయా నిజాం పాలనను, నియంత, అవినీతి పాలనను తరిమికొట్టి బీజేపీకి అధికారం కట్టబెట్మని చెప్పిండ్రని, అదే తన పని అని తెలిపారు. ఎక్కడ జైశ్రీరాం అనాలో, ఎక్కడ కాషాయ జెండా పెట్టాలో అక్కడ ఆ పని చేసి చూపామని తెలిపారు. పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్‌ ‌సహా ఎవరిని ఎక్కడ పెట్టాలో తమ నాయకుడు అక్కడ పెట్టిండని పేర్కొన్నారు. పాతబస్తీకి రావాలని ఒవైసీ మోదీని సవాల్‌ ‌చేస్తే ఊకుంటమా పోయి జెండా ఎగరేయలేదా అన్నారు. మరి కేసీఆర్‌ ఎం‌దుకు పోలేదని బండి సంజయ్‌ ‌ప్రశించారు. ఆయనలో హిందూ రక్తం ప్రవహించడం లేదా అని..బీజేపీలో ప్యూర్‌ ‌హిందూ రక్తం ప్రవహిస్తుందని తెలిపారు. వికారాబాద్‌ను అనంతగిరి జిల్లాగా పేరు మార్చుతామని, బీజేపీ ప్రభుత్వం రాగానే అనంతగిరి జిల్లాగా ప్రకటిస్తామని తెలిపారు.
వికారాబాద్‌కు అనంత పద్మనాభస్వామి దివ్య ఆశీస్సులున్నాయని, ఈ భూమి మార్కండేయ మహర్షి వెయ్యేళ్లు తపస్పు చేసిన తపోభూమని, ముచ్కుంద నది పుట్టిన పవిత్ర భూమి, రాకంచర్ల వెంకటదాసు కీర్తనలతో ప్రతిధ్వనించిన భూమి తాండూరు భావిగి భద్రేశ్వర స్వామి వెలసిన పుణ్యభూమి, కొడంగల్‌ ‌వెంకటేశ్వరస్వామి నిత్య పూజలతో స్వామివారి ఆశీస్సులు పొందుతున్న భూమి అని, ఇంతటి పవిత్ర శక్తివంతమైన వికారాబాద్‌ ‌గడ్డమీద మాట్లాడే అవకాశమొచ్చినందుకు అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తెలంగాణ కోసం కొట్లాడడానికి మాజీమంత్రి చంద్రశేఖర్‌ ‌తనకు అండగా ఉన్నడని, అమరవీరుల త్యాగాలు కళ్లారా చూసినా వారి ఆశయాలు బీజేపీతోనే సాధ్యమైతదని కొట్లాడమని చెప్పిండని అన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఒకటైతే జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఎందుకు బీజేపీ గెలుస్తదని, దుబ్బాకలో ఎట్ల గెలిచినమని, బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా టీఆర్‌ఎస్‌ ‌లోకి పోయిండ్రా అని ప్రశించారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌గడీలను బద్దలు కొట్టి తరిమితరిమి కొట్టే పార్టీ బీజేపీ కాదా అని, మరి టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ ఒక్కటి ఎట్లయితదని, గతంలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌, ఎంఐఎం, ‌టీడీపీ, కమ్యూనిస్టులు కూడా కలిసి పోటీ చేసినయని అన్నారు. కేసీఆర్‌ ఎం‌గిలి మెతుకులు తినే నాయకులు కొందరు ఇక్కడున్నరని పేర్కొన్నారు. బీజేపీ దమ్మున్న పార్టీ అని, దేశం, రాష్ట్రం కోసం, అనంతగిరి జిల్లా కోసం కష్టపడి పనిచేసే పార్టీ అని, అందరి కోసం కష్టపడి యుద్ధం చేస్తుంటే లాఠీలతో కొడుతున్నరని అన్నారు. అరెస్టులు చేస్తున్నరని, జైళ్లకు పంపుతున్నరని, అయినా భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ఓ తాత వొచ్చి వికారాబాద్‌కు ఉప ఎన్నిక వొస్తదా అని అడుగుతుండని, ఎందుకంటే ఉప ఎన్నిక వొస్తే దళిత బంధు వొస్తదని అనుకుంటున్నరని, ఉప ఎన్నిక వొస్తేనే కేసీఆర్‌ ‌బయటకు వొస్తడని పేర్కొన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అని, అలాగే పోయే సీఎంకు పథకాలు ఎక్కవ అని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.
ప్రధాని వద్దకు వంగి వంగి దండాలు పెట్టిన కేసీఆర్‌ ఈసారి కోతలు కోస్తే విడిచి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మోదీని 50 నిమిషాలు కలిసిండని చెబుతుండు కానీ అంత సమయం ఇస్తడా అని, సరే కలిసినవ్‌ ‌రాష్ట్రంలో నువ్వెందుకు లీడర్లను కలవవు అని ప్రశ్నించారు. ప్రధానిని కలిసి చాలా అడిగినవ్‌ ‌కదా మరి కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు, టాయిలెట్లు సహా అన్ని పథకాలకు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పినవా అని ప్రశిస్తూ..ఇఛ్చిన నిధులను దారిమళ్లించి దోచుకున్న నీచుడు కేసీఆర్‌ అని మండిపడ్డారు. రోడ్లు, మొక్కలు, రైతు వేదికలు, ఉచిత బియ్యం, ఉచిత టీకా సహా చివరకు స్మశానవాటికలకూ డబ్బులు కేంద్రం ఇఛ్చినవే అని తెలిపారు. ప్రతి పైసా కేంద్రమిస్తే…..టీఆర్‌ఎస్‌ ‌పథకాలుగా చిత్రీకరిస్తున్నరని సంజయ్‌ ‌తెలిపారు. ప్రజల సమస్యలు తెలుసుకుని, అన్ని విషయాలు ప్రజలతో పంచుకోవడానికే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తునామని తెలిపారు. మహారాష్ట్ర సీఎంగా ఒకేసారి పని చేసిన ఫడ్నవీస్‌ ఏడాదిలోపు 70 వేల ఇండ్లను నిర్మించి ఒకేసారి గృహ ప్రవేశం చేయింరని, కానీ సీఎం కేసీఆర్‌ ‌కేంద్రం నుండి ప్రధాని ఆవాస్‌ ‌యోజన కింద రూ.1500 కోట్లు తెచ్చుకుని ఒక్క ఇల్లు కూడా నిర్మించకుండా నిదులు దారి మళ్లించిండని తెలిపారు. ఢిల్లీకి పోయి కత్తి తిప్పుతానని చెప్పి ఫాంహౌజ్‌ ‌లోకి పోయి పడుకున్నడని అన్నారు. వరంగల్‌ ‌జైలును తరలించి ఖైదీలను నానా ఇబ్బంది పెడుతున్నడని, ఉద్యోగాల్లేక యువత ఇబ్బంది పడుతున్నరని, స్కూళ్లు లేవు కాలేజీల్లేవు కానీ గల్లీకొక బార్‌ ‌మాత్రం పెట్టి దోచుకుంటున్నడని తెలిపారు. ఏ పార్టీ అధికారంలోకి వొస్తే ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగే ఓవైసీ పాతబస్తీకి మెట్రో రైలు ఎందుకు రావడం లేదు..యువకులకు పాస్‌ ‌పోర్టులు ఎందుకు రావడం లేదు..కొత్త సంస్థలు ఎందుకు రావడం లేదో ఆలోచించాలని అన్నారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఖచ్చితంగా అడ్డుకుని తీరుతామని అన్నారు. హిందూ ధర్మం కోసం పనిచేయడానికి, పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాకా ఇంటికి రామని తమ ఇంటివాళ్లని ఒప్పించినమని, ఆ మాట కాంగ్రెస్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌పార్టీలను చెప్పమనండని అన్నారు. 1400 మంది అమరుల త్యాగాలపై, రక్తపు మడుగులపై ఓ కుటుంబం రాజ్యమేలుతోందని, తెలంగాణ తల్లి ఫాంహౌజ్‌లో బందీ అయ్యి తల్లడిల్లుతుందని, తనను బంధ విముక్తిరాలిని చేయండని అంటున్నదని అన్నారు.
ప్రజా స్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం రండి బీజేపీ కార్యకర్తల్లారా జై తెలంగాణ, జై శ్రీరాం, భారత్‌ ‌మాతాకీ జై అంటూ కదలండి. నన్ను విముక్తి చేయండని కోరుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అరాచక పాలన అంతమొందించాలని, అందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రశేఖర్‌ ‌పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌మాయమాటలతో పబ్బం గడుపుతూ పరిపాలన చేస్తున్నారని, అతని దుర్మార్గమైన పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వొచ్చినా నిరుద్యోగుల ఆశలు సఫలం కాలేదని, రైతాంగాన్ని, లేనిపోని పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి పార్లమెంట్‌ ఇన్చార్జి జనార్దన్‌ ‌రెడ్డి, శంకర్‌ ‌రెడ్డి గూడూరు సుదర్శన్‌ ‌రెడ్డి ఇ సంతోష్‌ ‌రెడ్డి కోటి గారి శివరాజ్‌ ‌పాండు గౌడ్‌ ‌మాధవ రెడ్డి  రాజేందర్రెడ్డి ఎల్లారెడ్డి  బిజెపి సీనియర్‌ ‌నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply