Take a fresh look at your lifestyle.

కూల్చివేతలు-రాజకీయాలు

రాత్రికి రాత్రి ప్రజావేదిక కూల్చివేయటంతో ప్రజాధనం 9 కోట్లు కృష్ణమ్మ పాలు అయినట్లే. గతంలో హైదరాబాద్‌ ‌లోనూ కేసీఆర్‌ ‌ప్రభుత్వం అక్రమ కట్టడాల పై ఉక్కు పాదం అంటూ హడావిడి చేసింది. మాదాపూర్‌ ‌లోని అయ్యప్ప సొసైటిలో అక్రమ భవనాల కూల్చి వేత ప్రక్రియ కూడా చేపట్టింది. మీడియాలో నాలుగు రోజుల బ్రేకింగ్‌ ‌న్యూస్‌ ‌హంగామా తర్వాత ఆ అక్రమాలు, చెప్పిన కట్టడాలు ఎటు వెళ్లాయో ఎవరికి తెలియదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసే నిర్మాణాలను కూల్చివేయగలిగితే ఒక కొత్త రాజకీయ విధానానికి జగన్‌ ‌బీజం వేసినట్లే అవుతుంది.

నైరుతి రుతుపవనాలు కాస్త ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. తొలకరి జల్లులు పడగానే విత్తు విచ్చుకుంటుంది. కొద్ది రోజుల పాటు వర్షాలు అలానే కురిస్తే చిగురుటాకులు వచ్చి మొక్కై ఎదుగుతుంది. వర్షాకాలం ప్రవేశించిన సమయంలోనే తెలుగు రాష్ట్రాల్లో భవనాల కూల్చివేతల విత్తు పడింది. అయితే ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో జరుగుతున్న భవనాల కూల్చివేతల వెనుక నేపథ్యం, భవిష్యత్‌ ‌లక్ష్యాల మధ్య స్పష్టమైన తేడా ఉందన్నది తెలిసిన విషయమే. ఈ రాజకీయం ఏ మానై ఎదుగుతుందో ఇప్పుడే అంచనా వేయలేం కాని ప్రస్తుతానికి అయితే రాజకీయ వర్గాల చర్చకు మసాలా దట్టించిన ముడి సరుకయ్యింది.

నేల మట్టం అయిన ప్రజా వేదిక…

ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్‌ ‌జగన్మోహన రెడ్డి వేస్తున్నప్రతి అడుగు అంతకు ముందు విధానాలను, సంప్రదాయ ధోరణులకు కాస్త భిన్నంగానే ఉన్నాయి. మంచి పరిపాలన అందిస్తానన్న మాటను నిలబెట్టుకునే విధంగానే ప్రతి చర్యా ఉండేటట్లు చూసుకుంటున్నారు ఏపీ సీఎమ్‌. ‌సొంత బలంతో సంబంధం లేకుండా ప్రత్యర్ధిని రాజకీయంగా దెబ్బతీయటమే లక్ష్యంగా ఇతర పార్టీల నేతలకు కండువా కప్పే అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకం అన్న జగన్‌ అదే విషయాన్ని అసెంబ్లీ వేదికగానే స్పష్టం చేయటం ఆహ్వానించదగ్గ పరిణామం. రాజకీయ పునరేకీకరణ అని గులాబీ నేతలు ముద్దుగా పేరు పెట్టినా…చట్టంలోని సెక్షన్‌ ‌ను కమలనాథులు సాకుగా చూపినా…జరుగుతున్నది మాత్రం కప్ప దాట్లే. ఇవి రాజకీయపరమైన ఎత్తుగడలు. ఇక పరిపాలనా వ్యవహారాల్లోకి వస్తే…నిన్నటి వరకు సీఎమ్‌ ‌హోదాలో చంద్రబాబు అధికారిక సమావేశాలకు నిలయమైన ప్రజా వేదిక కూల్చివేత తాజా సంచలనం. ఉండవల్లిలో కృష్ణానది కరకట్ట పై నిబంధనలకు విరుద్ధంగా పలు భవనాల నిర్మాణం జరిగింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన సమావేశాలకు అనుకూలంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉండవల్లి లోని తన నివాసం పక్కనే దాదాపు 8 కోట్ల 90 లక్షలు ఖర్చుపెట్టి ప్రజా వేదికని నిర్మించారు. అప్పట్లో ఓ మంత్రి నోటిమాటతో అంచనాను దాదాపు రెట్టింపు చేశారని తాజాగా అధికారులు ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తోంది. మరోవైపు ప్రజా వేదికను ప్రజల కోసం కాకుండా పూర్తిగా టీడీపీ పార్టీ వ్యవహారాల కోసం వాడుకోవటమూ తెలిసింది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత చంద్రబాబు ప్రతిపక్ష నేత హోదాలో ఈ ప్రజా వేదికకు తనకు కేటాయించాల్సిందిగా కోరుతూ కొత్త ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే ప్రజావేదిక నిర్మాణం నుంచి నిర్వహణ వరకూ లెక్కలేనన్ని ఉల్లంఘనలు, అవకతవకలు చోటుచేసుకున్నాయి. పర్యావరణ పరిరక్షణ చట్టం, నీటిపారుదలశాఖ నిబంధనలు, లోకాయుక్త ఆదేశాలకు భిన్నంగా సీఆర్‌డీఏ అధికారుల పై అప్పట్లో నాయకులు ఒత్తిడి చేసి నిర్మించారు. ఎటువంటి ప్లాన్‌ ‌లేకుండా సీఆర్‌డీఏ స్వయంగా ప్రజావేదికను కట్టింది. కరకట్ట మీద సుమారు 22 పెద్ద పెద్ద నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ అక్రమ కట్టడాలే, అందులోనూ పెద్ద తలకాయలే ఉన్నాయి. వాటన్నింటి పై కూడా జగన్‌ ‌ప్రభుత్వం ఇదే విధమైన వైఖరితో ముందుకు వెళుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. ప్రజావేదిక ప్రభుత్వ భవనం కాబట్టి న్యాయపరమైన చిక్కులు ఉండకపోయిన ప్రైవేటు వ్యక్తులకు వచ్చే సరికి న్యాయస్థానాల జోక్యానికి ఆస్కారం ఉంటుంది. రాత్రికి రాత్రి ప్రజావేదిక కూల్చివేయటంతో ప్రజాధనం 9 కోట్లు కృష్ణమ్మ పాలు అయినట్లే. గతంలో హైదరాబాద్‌ ‌లోనూ కేసీఆర్‌ ‌ప్రభుత్వం అక్రమ కట్టడాల పై ఉక్కు పాదం అంటూ హడావిడి చేసింది. మాదాపూర్‌ ‌లోని అయ్యప్ప సొసైటిలో అక్రమ భవనాల కూల్చి వేత ప్రక్రియ కూడా చేపట్టింది. మీడియాలో నాలుగు రోజుల బ్రేకింగ్‌ ‌న్యూస్‌ ‌హంగామా తర్వాత ఆ అక్రమాలు, చెప్పిన కట్టడాలు ఎటు వెళ్లాయో ఎవరికి తెలియదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కాకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా చేసే నిర్మాణాలను కూల్చివేయగలిగితే ఒక కొత్త రాజకీయ విధానానికి జగన్‌ ‌బీజం వేసినట్లే అవుతుంది.

తెలంగాణాలో-కూల్చివేతలు

తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాల కూల్చివేత వ్యవహారం రాజకీయంగా గత కొన్నేళ్ళ నుంచి చర్చనీయాంశంగా ఉంది. ఎర్రగడ్డలో సచివాలయం నిర్మించాలని గతంలో కేసీఆర్‌ ‌నిర్ణయించినప్పుడే 2016లో కాంగ్రెస్‌ ‌నేత జీవన్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేవలం వాస్తు కోసం సచివాలయం కూల్చివేయడం సమంజసం కాదని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. తాజాగా మరోసారి ఈ వైఖరి పై తెలంగాణా సీఎమ్‌ ‌కేసీఆర్‌ ‌ముందుకే వెళ్లనున్న నేపథ్యంలో మరోసారి కాంగ్రెస్‌ ‌నేతలు కోర్టును ఆశ్రయించారు. కేవలం సచివాలయ భవనాలనే కాకుండా కొత్త శాసనసభ భవంతి కోసం ఎర్రమంజిల్‌ ‌లో ఉన్న ఓ పురావస్తు భవనాన్ని కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అడ్డుకోవాలంటూ కొంతమంది విద్యార్థులు కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తెలంగాణాలో భవనాల కూల్చివేతల లక్ష్యం వేరే అయినా…కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటం మాత్రం సమర్థనీయం కాదు. ఓ వైపు హైదరాబాద్‌ ‌లో వృధాగా ఉన్న ఏపీకి చెందిన భవనాలను ఆ రాష్ట్రం తెలంగాణాకు బదలాయించింది. అంటే తెలంగాణా దగ్గర అవసరానికి సరిపడా లేదా మించి భవనాలున్నాయి. ఇవి శిథిలావస్థకు చేరి ఉపయోగించలేని స్థితిలో ఏమీ లేవు.

ఉన్నపళంగా వాటన్నింటిని భూ స్థాపితం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి హంగూ ఆర్భాటాలతో కొత్త భవనాల నిర్మాణానికి పూనుకోవాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉందన్న విషయాన్ని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పార్లమెంట్‌ సాక్షిగా స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటితో పోల్చితే తెలంగాణ ప్రభుత్వ అప్పులు భారీగా పెరిగాయని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి అప్పులు 159 శాతం పెరిగాయని రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎం‌పీ ఎంఏ ఖాన్‌ అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర బడ్జెట్‌ ‌ప్రకారం 2014 జూన్‌ 2 ‌నాటికి- అంటే రాష్ట్రం ఏర్పడేనాటికి- రాష్ట్రంపై రూ. 69,517 కోట్ల అప్పులు ఉండగా 2019 మార్చి చివరినాటికి రూ. 1,80,239 కోట్లకు చేరాయన్నది ఆర్ధిక మంత్రి సమాధాన సారాంశం. రాష్ట్ర ఆర్ధిక స్థితి ఇలా ఉన్నప్పుడు ఉన్న వనరులను అభిలషణీయంగా, ఎక్కువ మంది ప్రజలకు లబ్ది చేకూరే విధంగా వెచ్చించటం హర్షించదగ్గ విషయం అవుతుంది. వృధా ఖర్చులు ఆర్ధిక పరిస్థితిని మరింత దిగజారుస్తాయి తప్ప ప్రయోజనం ఉండదు. అయితే అసెంబ్లీ నూతన భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాన్ని కేసీఆర్‌ ‌చేపడుతున్నారు.

మేలిమి విత్తులు వేస్తే మొలకెత్తే మొక్క నాణ్యమైందే అవుతుంది. ఫలం నలుగురికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ విధానాలు, పాలకుల వైఖరి దీనికి మినహాయింపు కాదు.

Leave a Reply

error: Content is protected !!