వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాశ్మీర్‌ ‌సమస్య పరిష్కారమయ్యేనా..?

August 6, 2019

ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు…. రెండు పతాకాలు… ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని వింత పద్దతి మన దేశంలో ఆరున్నర దశాబ్దాలు పైగా అమలులో ఉంది. జమ్ము,కాశ్మీర్‌ ‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం దేశంలో ఎన్నో సమస్యలను తెచ్చి పెట్టింది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అటానమీ కోసం అక్కడి ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు సాగుతున్నాయ. దేశ విభజన సమయంలో కాశ్మీర్‌ ‌లో కొంత భాగాన్ని పాకిస్తాన్‌ ఆ‌క్రమించుకుంది. అందుకే ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ మన పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌ ( ‌పిఒకే) అని పిలుస్తున్నాం. రెండు కాశ్మీర్‌ ‌లు వేరైనా కాశ్మీరీల మధ్య సంబంధ బాంధ్యవ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీరి మధ్య రాకపోకలు ఏర్పడేట్టు చేయడానికి మన్మోహన్‌ ‌సింగ్‌ , ‌వాజ్‌ ‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో బస్సు యాత్రలు , సంఝౌతా ఎక్స్ ‌ప్రెస్‌ ‌రైలు సర్వీసు వంటివి ప్రవేశపెట్టడం జరిగింది. వీటిని ప్రశాంతంగా సాగనివ్వకుండా పాక్‌ ‌కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులు దాడులు జరిపారు.ఇప్పటికీ జరుపుతున్నారు. కాశ్మీర్‌ ‌సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒప్పందాలు ఉన్నప్పటికీ, దీనిపై మధ్యవర్తి పరిష్కారం కోసం పదే పదే కేకలు పెడుతోంది.ఆఖరికి అగ్రరాజ్యం అధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను మధ్యవర్తిత్వం వహించమని కోరారంటూ రెండు సార్లు బుకాయించారు. కాశ్మీర్‌ ‌సమస్యపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రపంచం యావత్తూ భారత్‌ ‌వైపు వేలెత్తి చూపే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాశ్మీర్‌ ‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే 370వ అధికరణాన్ని రద్దు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని పార్లమెంటు ఉభయ సభల చేత ఆమోదింపజేశారు.
కాశ్మీర్‌ అం‌శంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాల్లో కొన్ని మద్దతు ఇవ్వడం వల్ల రాజ్యసభలో ఈ తీర్మానానికి అనుకూలంగా జరిగిన ఓటింగ్‌ ‌లో 126 ఓట్లు రావడం ఈ అధికరణం రద్దుకు కాంగ్రెస్‌, ‌డిఎంకె తదితర పార్టీలు తప్ప మిగిలిన పార్టీలు మద్దతు ఇచ్చాయి. పార్టీల పరంగా లేదా, మత పరంగా చూడకుండా వాస్తవ దృష్టితో పరిశీలిస్తే 370వ అధికరణం ప్రజాస్వామ్యానికే మచ్చ వంటిది. కాశ్మీరీలు కూడా భారతీయులే. వారికి ప్రత్యేక రాజ్యాంగం, పతాకం ఉండటాన్ని దేశంలో ప్రజాస్వామ్య వాదులు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా లౌకిక వాద పార్టీలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. 370వ అధికరణం మాదిరిగానే 35-ఏ అధికరణం రద్దు అవుతుంది. జమ్ము,కాశ్మీర్‌ ‌కి రాష్ట్ర హోదా ఇక ఉండదు. ఆ రెండూ, లడఖ్‌ ‌ప్రాంతం కేంద్ర పాలిత ప్రాంతాలవుతాయి. వీటికి చెరో లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌ని కేంద్రం నియమించి పాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఇక పైనా జమ్ము,కాశ్మీర్‌, ‌లడఖ్‌ ‌లలో పార్లమెంటు ఆమోదించిన చట్టాలు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే అమలులో ఉంటాయి. కేంద్రం సోమవారం నాడు తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతమైనదే కాకుండా చారిత్రాత్మకమైనదిగా దేశంలో అధిక సంఖ్యాలుకు అభివర్ణిస్తున్నారు. ఎన్‌ ‌డిఏ లోంచి, పూర్వపు ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిన తెలుగుదేశం కూడా 370 అధికరణం రద్దును, కాశ్మీర్‌ ‌ను మూడు ముక్కలుగా చేయడాన్ని సమర్ధించింది. అయితే, ఈ చర్య వల్ల కాశ్మీరీలు మరింత దూరమవతారంటూ కాంగ్రెస్‌ ‌నాయకుడు గులామ్‌ ‌నబీ ఆజాద్‌, ‌పీ చిదంబరం సహా పలువురు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, కాశ్మీర్‌ ‌లో ఉగ్రవాదుల సంచలనాన్నీ, చొరబాట్లను ఈ చర్య నిరోధిస్తుందనడంలో సందేహం లేదు. సర్వసత్తాక ప్రతిపత్తి కలిగిన దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండటం అసహజం, అనౌచిత్యమే కాకుండా ప్రపంచ దేశాల్లో మన దేశం ఇప్పటికే చులకన అయింది. ఎక్కడికి వెళ్ళినా కాశ్మీర్‌ ‌సమస్య గురించి భారత ప్రధానినీ, మంత్రులనూ మీడియా వర్గాలు ప్రశ్నించడం కూడా అవమానకరంగానే ఉంటోంది. ఈ చర్య వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్న మాటవాస్తవమే కానీ ఆక్రమిత కాశ్మీర్‌ ‌కూడా భారత పరిధిలోకి రావడానికి ఇది దోహదం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. అలా జరిగితే కాశ్మీర్‌ ‌సమస్య శాశ్వతంగా పరిష్కారమైనట్టే. ఇంతకీ 370వ అధికరణం రద్దు కోసమే అలనాడు డాక్టర్‌ ‌శ్యాం ప్రసాద్‌ ‌ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ ‌ను స్థాపించారు. నేటి భారతీయ జనతాపార్టీ దాని మాతృకే. శ్యాం ప్రసాద్‌ ‌ముఖర్జీ కాశ్మీర్‌ ‌జైలులో మరణించిన నాటి నుంచి 370 రద్దు అధికరణం భారతీయ జనతాపార్టీకి భావోద్వేగ సంబంధం ఏర్పడింది. అది ఇప్పుడు సాకారం అయింది.
పాలనలో అసాధారణ, అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్న మోడీ ప్రభుత్వం ఆర్టికల్‌ ‌రద్దు నిర్ణయం కూడా పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. సంఖ్యా బలంతో ప్రతిపక్షాలను లెక్కచేయడం లేదు. కనీసం జమ్మూ,కశ్మీర్‌ ‌రాష్ట్ర నాయకులతో నైనా రద్దు ప్రతిపాదనను చర్చించ వలసింది. చర్చించడం పక్కన పెట్టి వారిని నిర్బంధంలో ఉంచిన చర్యలు సమర్ధనీయం కాదు.