Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్‌ ‌పార్టీ సంక్షోభం..?

కామరాజ్‌ ‌పథకం గట్టెక్కించేనా..

ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ ‌డెస్క్

కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్‌ ఎం‌పీ హెచ్‌ ‌వసంతకుమార్‌ ‘‘‌కామారాజ్‌ ‌వాంగా’’ (కామరాజ్‌ ‌జిందాబాద్‌) అని లోక్‌ ‌సభలో సభ్యునిగా ప్రమాణం చేసిన తర్వాత నినదించారు. ఆయన ఎందుకలా అన్నారో ఎవరికీ అర్థం కాలేదు. 56 ఏళ్ళ క్రితం కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రక్షాళన కోసం ఆనాటి ఎఐసిసి అధ్యక్షుడు కె కామరాజ్‌ ‌నాడార్‌ ‌మూకుమ్మడిగా రాజీనామా కోసం ఒక పథకాన్ని ప్రకటించారు. పార్టీలో కొరకరాని కొయ్యలుగా ఉన్న వారిని తప్పించేందుకు అదో పథకంగా అప్పట్లో భావించారు. మళ్ళీ అలాంటి పథకం అమలు జరగాలని కోరుకుంటున్న వారు ఉన్నారు.

1963నాటికి కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. తొలి ప్రధానమంత్రి పండిట్‌ ‌జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ వయసు పైబడటం వల్ల చురుకుగా వ్యవహరించలేకపోతున్నారు. అంతేకాక, అంతకుముందు సంవత్సరం చైనా యుద్ధంలో ఓటమి పాలు కావడం వల్ల ఆయన మానసికంగా కుంగిపోయారు. పార్టీ ప్రతిష్ఠ క్రమంగా దిగజారుతోంది. మూడు ముఖ్యమైన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది.. ఆచార్య జెబి కృపలానీ, రామమనోహర్‌ ‌లోహియా, మీనూ మసానీల చేతుల్లో కాంగ్రెస్‌ అభ్యర్ధులు ఓడిపోయారు.

అప్పట్లో కామరాజ్‌ ‌తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడు దక్షిణాదిలో కాంగ్రెస్‌ ‌కు కంచుకోటలా ఉండేది. బలమైన ప్రాంతీయ నాయకుల్లో కామరాజ్‌ ఒకరు. అప్పట్లో ఆయనకు పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేసేందుకు ఒక ఆలోచన వచ్చింది. 1963 అక్టోబర్‌ 2‌వ తేదీన గాంధీ జయంతి రోజున కామరాజ్‌ ‌తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దేశంలో కాంగ్రెస్‌ ‌ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరినీ తన మాదిరిగానే రాజీనామా చేయమని ఆయన పిలుపు ఇచ్చారు. కామరాజ్‌ ‌పథకానికి ప్రధాని నెహ్రూ కూడా ఆకర్షితులయ్యారు. తాను కూడా రాజీనామా చేస్తానని అన్నారు. అయితే, నెహ్రూని రాజీనామా చేయొద్దని కామరాజ్‌ ‌కోరారు.

లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, జగ్జీవన్‌ ‌రామ్‌, ‌మొరార్జీ దేశాయ్‌, ‌సహా ఆరుగురు కేంద్ర మంత్రులు, బిజూ పట్నాయక్‌, ఎస్‌ ‌కె పాటిల్‌, ‌కామరాజ్‌ ‌సహా ఆరుగురు ముఖ్యమంత్రులు రాజీనామా చేశారు. అయితే, కామరాజ్‌ ‌పథకం కాంగ్రెస్‌ ‌ని పునరుజ్జీవింపజేసిందా అనేది ఈనాటికీ చర్చనీయాంశమే. కామరాజ్‌ ‌ప్రోద్బలంపై నెహ్రూ లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రిని మళ్ళీ కేబినెట్‌ ‌లో చేర్చుకున్నారు. పోర్టు పోలియో లేని మంత్రిగా నియమించారు. ఆ తర్వాత నెహ్రూకి ఆయన వారసుడయ్యారు. అలా చేయకుండా ఉంటే పరిస్థితి మరో విధ•ంగా ఉండేదని పశ్చిమ బెంగాల్‌ ‌మాజీ గవర్నర్‌ ‌గోపాలకృష్ణ గాంధీ తన వ్యాసంలో రాశారు.

అర్థ శతాబ్దం తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ ‌గాంధీ రాజీనామా చేసిన తర్వాత 200 మంది పైగా కాంగ్రెస్‌ ‌నాయకులు తమ పదవులకు రాజీనామా చేశారు. రాహుల్‌ ‌ని పదవిలో కొనసాగమని ఒత్తిడి చేసేందుకు వారు కూడా రాజీనామా చేశారు. కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయాన్ని రాహుల్‌ ‌తో సమావేశంలో వారు స్పష్టం చేశారట. దీంతో కాంగ్రెస్‌ ‌లో మరోసారి కామరాజ్‌ ‌పథకం అమలు జరుగనుందా అన్న చర్చ ప్రారంబమైంది.

అది కాంగ్రెస్‌ ‌పునరుజ్జీవనానికి దోహదం చేస్తుందా?
కామరాజ్‌ ‌పథకం చాలా ఆసక్తికరమైన వ్యవస్థాపరమైన ప్రయోగం. అది ఇప్పటికీ అనుసరణీయంగా కనిపిస్తోంది. 1963 నాటి కన్నా కాంగ్రెస్‌ ‌పరిస్థితి ఇప్పుడు దయనీయంగా ఉంది. అప్పట్లో కాంగ్రెస్‌ ‌కేంద్రంలోనూ, పలు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉంది. అప్పట్లో పార్టీనీ, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయగల స్థితిలో ఉంది. లోక్‌ ‌సభలో కాంగ్రెస్‌ ‌బలం ప్రస్తుతం 52 మాత్రమే. నాలుగు రాష్ట్రాల్లో, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనే అధికారంలో ఉంది. ఇప్పుడు ఆ పథకం అమలు జేస్తే వ్యవస్థాపరంగా అస్థిరత్వం ఏర్పడుతుంది. మంచి కన్నా కీడు ఎక్కువ జరుగుతుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్‌ అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇలాంటి ప్రయోగాన్ని పార్టీ చేసే పరిస్థితిలో లేదు.

అనేక పదవుల్లో ఇతర సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్‌ ‌కు నిజంగా ప్రత్యామ్నాయాలు లేవు. ఉదాహరణకు మద్య ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమలనాథ్‌ ‌కు జూనియర్‌ ‌గా జ్యోతిరాదిత్య సిందియా లేదా అరుణ్‌ ‌యాదవ్‌ ఉన్నారు. వీరు పోటీ పడితే ప్రభుత్వం అస్థిరంలో పడుతుంది. మధ్యప్రదేశ్‌ ‌లో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని కమలనాథ్‌ ‌బొటాబొటీ మెజారిటీతో లాక్కుని వస్తున్నారు. ఈ పథకంలో రాహుల్‌ ‌గాంధీని చేరుస్తారా లేదా అనేది ప్రశ్న. కామరాజ్‌ ‌పథకంలో భాగంగా 1963లో ఆనాటి ప్రధాని నెహ్రూ కూడా రాజీనామా చేస్తానంటే కామరాజ్‌ ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు నిరాకరిస్తున్నారు. మరొ నాయకునికి ఆయన అవకాశం కల్పిస్తారా..? రాహుల్‌ ‌రాజీనామా ఉప సంహరణ కోసం ఒత్తిడి తెచ్చేందుకు రాజీనామా చేసిన పార్టీ నాయకులు కడదాకా నిలుస్తారా..? కొత్త నాయకునితో కలిసి పని చేయడానికి అంగీకరిస్తారా వేచి చూడాల్సిందే.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!