వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కాంగ్రెస్‌ అస్తిత్వ పోరాటం..

August 28, 2019

140  ‌యేళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. రాజకీయ అస్తిత్వం కోసం పోరాడాల్సిన స్థితికి ఆ పార్టీ చేరుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ పుట్టేడు కష్టాలతో కమిలిపోతోంది. ఒక వైపు టీఆర్‌ఎస్‌, ‌మరో వైపు బీజేపీ వెంటాడుతుండటంతో కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో కొట్టుమిట్టాడుతోంది

140  యేళ్ల చరిత్ర కల్గిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణలో పెను సవాళ్లు ఎదుర్కొంటోంది. రాజకీయ అస్తిత్వం కోసం పోరాడాల్సిన స్థితికి ఆ పార్టీ చేరుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ పుట్టేడు కష్టాలతో కమిలిపోతోంది. ఒక వైపు టీఆర్‌ఎస్‌, ‌మరో వైపు బీజేపీ వెంటాడుతుండటంతో కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో కొట్టుమిట్టాడుతోంది. నాయకుల కప్పదాట్లతో కంగారులో ఉన్న కాంగ్రెస్‌ను ఖతం చేయడానికి రెండు పార్టీలు కాచుకోని కూర్చుకున్నాయి. నాయకత్వ లేమీతో అల్లాడుతున్న ఆ పార్టీని తలా కొంచెం పంచుకోవడానికి కేసీఆర్‌తో పాటు కాషాయ నాథులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 12 మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని సిఎల్పీని విలీనం చేసుకోవడం ద్వారా చంద్రశేఖర్‌ ‌రావు కాంగ్రెస్‌ను చావు దెబ్బతీశారు. ఎక్కడిక్కడ నాయకులను కలుపుకొని పార్టీని అయోమయంలోకి నెట్టారు. ఇదే సమయంలో బీజేపీ రంగ ప్రవేశం చేయడంతో కాంగ్రెస్‌ ‌పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్లైంది. కేంద్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన ఉత్సాహంలో ఉన్న కాషాయ పార్టీ తెలంగాణ మీద కన్నేసింది. క్షేత్రస్థాయి నుంచి పార్టీని అభివృద్ధి చేయడం ఇప్పట్లో అయ్యే పని కాదని తేలిపోవడంతో ఫిరాయింపు రాజకీయాలకు కమలనాథులు పదును పెట్టారు. కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నాయకులతో సంప్రదింపులు ప్రారంభించి కొంత వరకు విజయం సాధించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఉన్న కొంత మంది నాయకులను చేర్చుకోవడం ద్వారా హడావుడి మొదలు పెట్టిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్‌ను ఖతం చేస్తామని చెపుతోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గాన్ని కాంగ్రెస్‌ ‌నుంచి దూరం చేయడం ద్వారా ఆ పార్టీని గట్టిగా దెబ్బతీయవచ్చునని భావిస్తున్న బీజేపీ నేతలు అందుకు తగ్గట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. డీకె అరుణ, జితేందర్‌ ‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌ ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌ ‌రెడ్డి ..ఇలా ఆ వర్గానికి చెందిన నేతలకు కాషాయ కండువాలను కప్పేస్తు కాంగ్రెస్‌ను కమ్మేస్తున్నారు. త్వరలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డిని కూడా చేర్చుకోవడం ద్వారా బలమైన సంకేతాలను పంపించాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్‌ ‌రెడ్డితో పాటు మరికొందరు రెడ్డి నాయకులతో కాషాయ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరో రెండు మూడేళ్లలో కాంగ్రెస్‌ ‌ను తెలంగాణ మ్యాప్‌ ‌నుంచి మాయం చేయాలన్న పట్టుదలతో బీజేపీ నాయకత్వం పనిచేస్తోంది. ఇందు కోసం టీఆర్‌ఎస్‌ ‌పైన పోరాటాన్ని పెంచడంతో పాటు కాంగ్రెస్‌ను దెబ్బతీసే పనిలో ఉంది. అసలైన ప్రతిపక్ష పాత్ర తమదేనని జనం గుర్తించేలా చేయడం ద్వారా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టాలన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారంటు బీజేపీ నేతలు ప్రెస్‌ ‌మీట్ల మీద ప్రెస్‌ ‌మీట్లు పెడుతున్నారు. టీఆర్‌ఎస్‌ను కవ్వించడం ద్వారా అసలు ఫైట్‌ ‌తమతోనే అన్న సంకేతాలను జనంలోకి పంపిస్తున్నారు. బీజేపీ వ్యూహాంలో టీఆర్‌ఎస్‌ ‌కూడా చిక్కుకున్నట్లే కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు లక్ష్మణ్‌ ‌మాటలకు కేటీఆర్‌ ‌నుంచి ఎమ్మెల్యేల వరకు స్పందిస్తున్నారు. ఆయన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ‌వర్సెస్‌ ‌బీజేపీ అన్నట్లుగా పరిస్థితులు మారుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్‌ ఆటలో అరటిపండు పాత్రకు పరిమితం అవుతోంది. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో ఇప్పుడిప్పుడే కాంగ్రెస్‌ ‌నేతలు మేల్కొంటున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఉత్తుత్తి ఫైటింగ్‌ ‌చేసుకుంటున్నారని, కేసీఆర్‌, ‌మోదీ రహస్య మిత్రులన్న విమర్శలను బలంగా వినిపించేందుకు ప్రయత్నిస్తోంది. కేసీఆర్‌ అవినీతికి పాల్పడితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని రేవంత్‌ ‌రెడ్డి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాదనను బలంగా వినిపించడం ద్వారా బీజేపీని ఎదగకుండా కాంగ్రెస్‌ ‌చేయవచ్చు. కాని అంత సలువు కాదు. ఎందుకంటే ముందు కాంగ్రెస్‌ ‌తనని తాను రక్షించుకోవాల్సి ఉంది. శత్రువుల రాజకీయ దాడులను కాచుకొని ఎదురుదాడి చేయాలి. అయితే అంత శక్తి యుక్తులు ప్రస్తుత కాంగ్రెస్‌లో కనిపించడం లేదు. సరైన సైన్యాధ్యక్షుడు లేకుండా సైనికులు యుద్దం చేసి గెలవడం అసాధ్యం. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం అవసరం. అందరికి అమోదయోగ్యమైన నాయకత్వం ముందుండి కాంగ్రెస్‌ను నడిపిస్తే ఆ పార్టీ తిరిగి పునర్‌ ‌వైభవం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. విశ్వసనీయత, పోరాటతత్వం కలిగిన నాయకుడు ముందుండి యుద్ధరంగంలోకి దూకితే కేడర్‌ ‌కూడా కత్తిదూయడం ఖాయం.
బావ్వోదేగాలతో కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తుంటాయి. దేశంలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది. జాతీయ వాదం, ప్రాంతీయ వాదం ఇప్పుడు కొన్ని పార్టీలకు ప్రధాన ఆయుధాలుగా మారాయి. ఇవి ప్రమాదకరమైన భావనలు అయినప్పటికి మానవ బలహీనత కారణంగా ఆ పార్టీలు ప్రబల శక్తులుగా ఎదిగిపోయాయి. సెంటిమెంటు బలంగా ఉన్నన్ని రోజులు సిద్ధాంత సహిత రాజకీయ పార్టీలకు పెను సవాలే. విశాల ధృక్పథం కలిగిన పార్టీలకు చావు దెబ్బలే. అందుకే కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టు లాంటి పురాతన పార్టీలు దారుణంగా దెబ్బతింటున్నాయి. సాంప్రదాయ వోటు బ్యాంక్‌ ‌చెల్లాచెదురు కావడంతో  ఈ జాతీయ పార్టీలు చిన్న సైజు ప్రాంతీయ పార్టీల స్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో తిరిగి పుంజుకోవడం కొంత కష్టమే.  పోరాటతత్వం ముందు సెంటిమెంటు ఎక్కువ కాలం నిలవకపోవచ్చు. సిద్దాంతం ముందు వాదానికి మనుగడ ఉండకపొవచ్చు. చైతన్యవంతమైన తెలంగాణ ప్రాంతం ముందు నుంచి కాంగ్రెస్‌  ‌భావజాలాన్ని పుణికిపుచ్చుకుంది. కమ్యూనిస్టు వాసనలు అధికంగా ఉన్న ఇక్కడ బీజేపీ లాంటి పార్టీలు బలంగా ఉనికిని కూడా చాటలేకపోయాయి. కాని మారుతున్న కాలమాన పరిస్థితుల్లో తెలంగాణను కూడా సెంటిమెంట్లు కమ్మేశాయి. ప్రాంతీయ వాదం నుంచి పుట్టిన టీఆర్‌ఎస్‌ ‌పార్టీ రాజకీయంగా తిరుగులేని విజయాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే బీజేపీ తెలంగాణలో మరో సెంటిమెంటును రగిలిస్తోంది. మరి ఈ రెండు వాదాలను ఎదుర్కొని తన రాజకీయ అస్తిత్వాన్ని కాంగ్రెస్‌  ‌కాపాడుకోవాల్సి ఉంది. మరి ఈ పోరాటంలో ఈ సీనియర్‌ ‌పార్టీ విజయం సాధిస్తుందో లేక చరిత్రలో కలిసిపోతుందో చూడాలి.

ఉన్నం శ్రీనివాసరావు, 
సీనియర్‌ ‌జర్నలిస్టు
8309893836