- ప్రత్యక్షంగా వీక్షించిన సీఎం రేవంత్
- జనాన్ని ఊర్రూతలూగించిన సంగీత కచేరీలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌లో ఆదివారం జరిగిన ఎయిర్ షోను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిలకించారు. ఈ షో కు నగర సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కెప్టెన్ అజయ్ దాశరథి నేతృత్వంలో వైమానిక విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ ఎయిర్‌షో జరిగింది. ఈ ప్రదర్శనను చూడటానికి ట్యాంక్‌బండ్‌కు జనం భారీగా పోటెత్తారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్‌పై అద్భుతంగా వైమానిక విన్యాసాలు అదరగొట్టాయి. ఒకేసారి ఆకాశంలో 9 ఎయిర్ క్రాఫ్టస్ సందడి చేశాయి.
సూర్య కిరణ్ టీమ్ ఆధ్వర్యంలో 9 ఎయిర్ క్రాఫ్టస్ విన్యాసాలు చేశాయి.. ప్రపంచంలో అత్యుత్తమమైన 5 బృందాల్లో సూర్యకిరణ్ టీమ్ ఒకటిగా పేరుపొందింది. ఎయిర్ షోకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు వడ్డే శంకర్ బృందం పాటల ప్రోగ్రాం.. సాయంత్రం 6 నుంచి 6:45 గంటల వరకు నీలా అండ్ టీం బోనాలు కోలాటం ప్రదర్శన.. 6:45 గంటల నుంచి 8 గంటల వరకు మోహిని అట్టం, భరతనాట్యం, థియేటర్ స్కిట్ ప్రదర్శించారు. రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు రాహుల్ సిప్లిగంజ్ అండ్ టీం మ్యూజికల్ నైట్ జరిగింది.