- భారీగా తరలివస్తున్న భక్తులు
- శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చిన నరసింహ స్వామి
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25 : యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిసి వొస్తున్నారు. రోజుకో అవతారంలో నారసింహుడిని చూసి తరించిపోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామిశ్రీకృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ఆలయ తిరుమాఢవీధుల్లో ఊరేగించారు. అనంతరం వేంచేపు మండపంపై ఆస్థానం చేసి వేదమంత్రాలు పఠించారు. సాయంత్రం పొన్న వాహన సేవ నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం జగన్మోహుడి అలంకారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఇక రాత్రికి అశ్వవాహనంపై ఎదుర్కోలు, 28న తిరుల్యాణ మహోత్సవం, మార్చి 1న దివ్య విమాన రథోత్సవం, శ్రీమహావిష్ణువు అవతారంలో గరుడవాహన సేవ, రాత్రికి ప్రధానాలయం తిరువీధుల్లో రథోత్సవం, 2న ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రికి శ్రీపుష్పయాగం, దీపోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల చివరి రోజు 3న ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రికి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్త మవుతాయి.