పటాన్ చెరు, జూలై 29 (ప్రజాతంత్ర విలేఖరి): కాలం చెల్లిన కనీస వేతనాల జీవోలను సవరించి వెంటనే కనీస వేతనం రూ. 21వేలు గా నిర్ణయించి గెజిట్ చేయాలని సిఐటియూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం రూ.21 వేలుగా నిర్ణయించి గెజిట్ చెయ్యాలని సిఐటియూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పటాన్చెరు పారిశ్రామిక వాడలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న చుక్కా రాములు మాట్లాడుతూ..కాలం చెల్లిన కనీస వేతనాల జీవో లను మార్చకుండా ప్రభుత్వాలు యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాల అసమర్థతతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, తద్వారా కుటుంబాలను పోషించుకోలేని దుస్థితిలో కార్మికులు అష్ట కష్టాలు పడుతున్నారని వాపోయారు. పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గకుండా తక్షణమే కనీస వేతనం రూ. 21వేలుగా నిర్ణయించి గెజిట్ విడుదల చెయ్యాలని తెలిపారు.
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను దుర్మార్గమైన 4లేబర్ కోడ్స్‌గా మార్చివేశారని, వీటిని తక్షణమే ఉప సంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా ఉపాధ్యక్షుడు పి.పాండురంగా రెడ్డి, నాయకులు ఎం.సత్తిబాబు, ఎన్. శ్రీనివాస రావు, బి.ప్రదీప్‌కుమార్, బి.వి.ఆర్.కె.రాజు, హెచ్.వెంకట్రావు, కార్మికులు పాల్గొన్నారు.