వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఔనూ! వాళ్లిద్దరు కలిసింరు!!

September 19, 2019

అసెంబ్లీ లాబీలో హరీష్‌ను కలిసిన జగ్గారెడ్డి
కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌లో హాట్‌ ‌హాట్‌
‌హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
వాళ్లిద్దరూ నిన్నటి వరకు ఉప్పు, నిప్పు. సవాళ్లు, ప్రతి సవాళ్లు. రాజకీయంగా బద్ధ విరోధులు, శత్రువులు. ఒకరికొకరు ఎదురుపడితే కూడా కనీసం పలకరించుకునే వారు కూడా కాదు. రాజకీయంగా ఒకరినొకరు ఎప్పుడు సమాధి చేసుకుందామనుకునేంతగా వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు. అంతేకాదు, వాళ్లిద్దరూ ఒకప్పుడు ఒకే పార్టీలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. కానీ, ఇద్దరూ కొంత కాలానికే బద్ద శత్రువులుగా మారారు. కానీ, వారిద్దరు ఇప్పుడు కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి వాళ్లిద్దర్ని ఒకటిగా చేసిందో….రాజకీయ అవసరాలు కలిసి మాట్లాడుకునేలా చేశాయో తెలియదు కానీ, మొత్తానికి వాళ్లిద్దరు కలుసుకున్నారు. మాట్లాడుకున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకరయితే…మరొకరు కాంగ్రెస్‌ ‌పార్టీ ఫైర్‌‌బ్రాండ్‌, ‌సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి. తెలంగాణ రాజకీయాలలోనే గురువారం అసెంబ్లీ లాబీలో ఆసక్తకర పరిణామంగా చోటు చేసుకున్న ఈ కలయిక రాజకీయవర్గాలలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్లితే…2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ తరపున సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జగ్గారెడ్డి…రెండేళ్లలోపే అభివృద్ధి పేరుతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌.‌రాజశేఖర్‌రెడ్డికి ఆకర్షితులై కాంగ్రెస్‌ ‌పార్టీకి చేరువయ్యారు. దీంతో, జగ్గారెడ్డి-హరీష్‌రావు మధ్యన చెప్పలేనంతగా ఆగాధం ఏర్పడింది. ఒకరంటే ఒకరు ఒంటికాలు మీద లేచి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకునేవారు. నీ అంతు చూస్తానంటే, నీ అంతుచూస్తామనుకునే వారు. టైం దొరికినప్పుడల్లా హరీష్‌రావును జగ్గారెడ్డి టార్గెట్‌ ‌చేసేవారు. హరీష్‌ ‌కూడా జగ్గారెడ్డిని తెలంగాణ ద్రోహిగా అభివర్ణించేవారు. అయితే, హరీష్‌రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి…గురువారం అసెంబ్లీ లాబీలో హరీష్‌ను కలవడం అటు కాంగ్రెస్‌ను, ఇటు టిఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. సంగారెడ్డి అభివృద్ధి పేరుతో హరీష్‌రావును కలిసినట్లు…ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, వీళ్లద్దరి మధ్య సుమారుగా 14ఏండ్లుగా మాటలు లేవు. ఎదురుపడితే కూడా మాట్లాడుకోలేని నేతలిద్దరూ ఇప్పుడు కలుసుకోవడమే కాకుండా, మాట్లాడుకోవడం వెనక మతలబు ఏమిటిదన్న దాని గురించి అందరూ ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఇదే హాట్‌ ‌టాపిక్‌. ‌దాదాపు 14 ఏళ్ల తర్వాత తొలిసారి హరీష్‌రావుతో మాట్లాడారు జగ్గారెడ్డి. దాదాపు అరగంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. ఆయన విజ్ఞప్తిపై మంత్రి హరీష్‌ ‌రావు సానుకూలంగా స్పందించినట్లు జగ్గారెడ్డి చెబుతున్నారు. అయితే, వీరి కలయిక కాంగ్రెస్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ఆసక్తిగా మారింది. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశారా? లేదంటే తెర వెనక ఇంకేమైనా జరుగుతోందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే, కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగ్గారెడ్డి సైతం టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ, జగ్గారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరకుండా హరీష్‌ ‌రావే అడ్డుకున్నారని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు హరీష్‌ ‌రావుపై వీలు చిక్కినప్పుడల్లా జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. బ్లాక్‌ ‌మెయిల్‌ ‌రాజకీయాలకు పాల్పడుతున్నారని చాలా సందర్భాల్లో మండిపడ్డారు. హరీష్‌ ‌రావుకు చుక్కలు చూపిస్తానంటూ నిప్పులు చెరిగారు. హరీష్‌ ‌రావును బద్ధశత్రువుగా భావించే జగ్గారెడ్డి.. ఇప్పుడు ఆయన్ను కలవడం ఇటు కాంగ్రెస్‌, అటు టీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని నెలల కిందటనే, జగ్గారెడ్డి తాను గాంధీభవన్‌(‌కాంగ్రెస్‌)‌లో ఉంటానో…తెలంగాణ భవన్‌(‌టిఆర్‌ఎస్‌)‌లో ఉంటానో తనకే తెలియదనీ…రైతులు పండించే ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పిస్తే, సంగారెడ్డికి మెడికల్‌ ‌కళాశాల ఇస్తే సంగారెడ్డిలో కేసీఆర్‌ను భారీ సన్మానం చేయడంతో పాటు గుడి కూడా కట్టిస్తాననీ చెప్పిన విషయం విధితమే. తాజాగా…అసెంబ్లీలో సంగారెడ్డి అభివృద్ధికి కృషి చేస్తే సిఎం కేసీఆర్‌ను ఘనంగా సన్మానిస్తాననీ, మహబూబ్‌సాగర్‌ ‌చెరువు విషయం మంత్రి హరీష్‌రావుకు తెలుసుననీ జగ్గారెడ్డి మాట్లాడితే…అన్నింటికీ సహకరిస్తాననీ సిఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే అదే అసెంబ్లీ లాబీలో మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలుసుకోవడం, మాట్లాడుకోవడం సంగారెడ్డి అభివృద్ధికి సహకరిస్తానంటూ హరీష్‌రావు సానుకూలంగా స్పందించడం చకచక జరిగిపోయాయి. మొత్తానికి హరీష్‌, ‌జగ్గారెడ్డి కలయిక రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుందనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, సుదీర్ఘ విరామం తర్వాత హరీష్‌రావును జగ్గారెడ్డి కలవడం…దాదాపుగా అరగంటకు పైగా మాట్లాడుకోవడంతో జగ్గారెడ్డి కాంగ్రెస్‌ ‌వీడటం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. హరీష్‌, •గ్గారెడ్డి మాట్లాడుకోవడంతో రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనీ ఈ ఉదంతం మరోసారి రుజువు చేసిందనీ ఈ ఇద్దరి కలయిక గురించి అంతటా మాట్లాడుకుంటున్నారు. హరీష్‌, ‌జగ్గారెడ్డి మాట్లాడుకోవడంతో మాత్రం ఇక సంగారెడ్డి అభివృద్ధికి మంచి రోజులు వచ్చాయనీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగ్గారెడ్డి కూడా అభివృద్ధిని కోరుకుంటున్న విషయం విధితమే.