Take a fresh look at your lifestyle.

ఒరిస్సానే నవీన్‌ ‌పట్నాయక్‌ ‌లోకం

నవీన్‌ ‌పట్నాయక్‌ ‌విజయ రహస్యంలో అంతుపట్టని వ్యవహారం ఏమీ లేదు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. వీలైనంత మేరకు అవినీతికి తావివ్వకపోవడం, పేదలకు అనుకూల విధానాలు అనుసరించడం ఆయన మీద జనాదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం. మహిళలకు, వృద్ధులకు, పేదలకు ఆర్థిక సహాయం పెంచడం ఆయన పాలనలో విశిష్టత. ఒరిస్సా పారిశ్రామికాభివృద్ధికి చాలా కృషి చేశారు. పోస్కో, ఆర్సెలార్‌ ‌మిత్తల్‌ ‌వంటి దిగ్గజ సంస్థలను ఒరిస్సాలో ఉక్కు కర్మాగారాలు నిర్మించడానికి ఆహ్వానించారు. అయితే పోస్కో ఆగడాలపై ప్రజా ప్రతిఘటన ప్రస్ఫుటంగానే కనిపించింది. కాలియా, బిజు యువ వాహిని, పీఠా లాంటి పథకాలు ప్రజల మెప్పు పొందాయి.

ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలలో మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని అయిదో సారి ముఖ్యమంత్రిగా బుధవారం (2019 మే 29) ప్రమాణం స్వీకరించనున్న నవీన్‌ ‌పట్నాయక్‌ ‌సరికొత్త రికార్డు సృష్టించారు. 17వ లోకసభకు ఎన్నికలు జరిగిన సమయంలో ప్రధానమంత్రి పదవిపై ఆశలు పెంచుకున్న నాయకులు చాలామందే ఉన్నారు. నవీన్‌ ‌పట్నాయక్‌ ‌మాత్రం ఒరిస్సా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఆయన తండ్రి బిజూ పట్నాయక్‌ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. కానీ నవీన్‌ ‌పట్నాయక్‌ ‌యుక్త వయసులో రాజకీయాల మీద ఆసక్తి కనబరచలేదు. 1997 దాకా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. తండ్రి మరణం తరవాతే రాజకీయాల్లోకి ప్రవేశించి ఇప్పటికీ తన స్థానాన్ని కాపాడుకుంటూనే ఉన్నారు. బిజూ పట్నాయక్‌ ‌మరణించిన తరవాత జనతా దళ్‌ అ‌గ్ర నాయకులు అశోక్‌ ‌దాస్‌, ‌నళినీకాంత మొహంతి, బిజయ్‌ ‌మహాపాత్ర ప్రోద్బలంవల్లే నవీన్‌ ‌పట్నాయక్‌ ‌రాజకీయాల్లోకి వచ్చారు. అధికారంలో, అదీ సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వారి మీద ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్న అభిప్రాయాన్ని నవీన్‌ ‌పట్నాయక్‌ ‌విజయం తోసిపుచ్చింది. ఆయన మేటి ముఖ్యమంత్రి అన్న పేరు సంపాదించుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో రాజకీయంగా ఎన్ని మార్పులు వస్తున్నప్పటికీ నవీన్‌ ‌మాత్రం నిశ్చలంగా, నిటారుగా నిలబడే ఉన్నారు.

నవీన్‌ ‌పట్నాయక్‌ ఒరిస్సాకు చెందిన వారే అయినా ఆయనకు ఒరియా భాష రాదు. ఎక్కువ కాలం ఆయన స్వస్థలంలో ఉండకపోవడమే దీనికి కారణం. నవీన్‌కు హిందీ, ఫ్రెంచ్‌, ‌పంజాబీ, ఇంగ్లీషు భాషలు బాగా వచ్చు. మాతృ భాషలో మాట్లాడలేని ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే. డెహ్రాడూన్‌ ‌లోని వెల్‌ ‌హెల్మ్ ‌బాలుర పాఠశాలలో ఆ తరవాత డూన్‌ ‌స్కూలులో పాఠశాల విద్య సాగింది. ఆ తరవాత దిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మల్‌ ‌కళాశాల నుంచి పట్టభద్రులయ్యారు. ఒరియా రానందున ఆయన ఒరియా భాష రోమన్‌ ‌లిపిలో చదువుకుని ప్రసంగిస్తారు.

ఒరిస్సాలో ఇన్ని సార్లు ముఖ్యమంత్రి అయిన ఏకైక నాయకుడు నవీన్‌. ‌జెబి పట్నాయక్‌ ‌మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా వరసగా కాలేదు. ఇంతవరకు అందరికన్నా ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నవారు పవన్‌ ‌కుమార్‌ ‌చాంలింగ్‌ ‌మాత్రమే. ఆయన సిక్కిం ముఖ్యమంత్రిగా – 24 ఏళ్ల 163 రోజులు ఉన్నారు. ఆ తరవాతి స్థానం పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రిగా 23 ఏళ్ల 137 రోజులు ఉన్న వారు జ్యోతి బసు. గెగాంగ్‌ అపాంగ్‌ 22 ఏళ్ల ఎనిమిది నెలల అయిదు రోజులు అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రిగా ఉన్నారు. మాణిక్‌ ‌సర్కార్‌ ‌నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి 20 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అయిదవ ప్రయత్నంలో విఫలమయ్యారు. ఎక్కువ సార్లు ముఖ్యమంత్రి అయిన వారిలో చూస్తే జ్యోతి బసు ఆరు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. మొదటి సారి 51 రోజులు మాత్రమే ఉన్నారు.

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒరిస్సా శాసనసభకూ ఎన్నికలు జరిగాయి. శాసన సభ ఎన్నికలలో నవీన్‌ ‌పట్నాయక్‌ ‌సారథ్యంలోని బిజూ జనతా దళ్‌ ‌మొత్తం 147 స్థానాల్లో 112 సీట్లు కైవసం చేసుకుని మోదీ గాలికి ఎదురీదింది. 2014 కన్నా ఇప్పుడు అయిదు స్థానాలు తగ్గాయి. అయితే బిజూ జనతా దళ్‌ ‌వోట్ల శాతం స్వల్పంగా అంటే 43.9 శాతం నుంచి 44.7 శాతానికి పెరిగింది. శాసనసభ ఎన్నికలలో బిజూ జనతా దళ్‌కు అఖండ విజయం సాధించిపెట్టిన ఒరిస్సా ప్రజలు లోకసభ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి భిన్నంగా వోటు వేశారు. ఒరిస్సా నుంచి 21 మంది లోకసభ సభ్యులుంటారు. ఇందులో బిజూ జనతా దళ్‌ 12 ‌సీట్లు గెలుచుకున్నా బీజేపీకి 8 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్‌ ఒక్క స్థానంతో సంతృప్తి పడింది. 2014లో బీజేపీకి ఒరిస్సా నుంచి ఒక్క లోకసభ స్థానమే ఉండేది. ఈ సారి కాంగ్రెస్‌ ‌వోట్లు అంటే నవీన్‌ ‌పట్నాయక్‌ ‌నాయకత్వంపై అసంతృప్తి ఉన్న వారు బీజేపీని సమర్థించారు. అందుకే 2014లో లోక సభ ఎన్నికలలో 44.8 శాతం వోట్లు వస్తే ఈ సారి 42.76 శాతం వోట్లే వచ్చాయి.

2014లో బిజూ జనతా దళ్‌, ‌బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ సారి ఎన్నికలకు దాదాపు ఏడాది ముందు నుంచే ఈ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు బాహాటంగానే వ్యక్తం అయినాయి. ఎన్నికలకు ముందే మోదీ సాధించింది ఏమీ లేదు కనక ఆయనకు రెండవ సారి ప్రధాని అయ్యే అవకాశం ఇవ్వక్కర్లేదు అని నవీన్‌ ‌పట్నాయక్‌ ‌నిర్మొహమాటంగానే చెప్పారు. మనసులో మాట చెప్పడమే తప్ప వినే తత్వం లేని మోదీ ఒరిస్సాలో అవినీతి రాజ్యమేలుతోందన్న నిరాధార ఆరోపణలు చేశారు. అయినా శాసనసభ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి బీజేపీని ప్రజలు ఆదరించలేదు. బీజేపీ 23 స్థానాలే సంపాదించగలిగింది. కాంగ్రెస్‌ ‌వోట్లు బీజేపీకి అనుకూలంగా మారినందువల్ల తొమ్మిది సీట్లు దక్కించుకోగలిగింది.

ఎన్‌డిఎతో పొత్తు కలవడం, కుదరనప్పుడు విడిపోవడం నవీన్‌ ‌పట్నాయక్‌ ఓ ‌విధానంగా అనుసరిస్తున్నట్టున్నారు. 2008లో కంధమాల్‌లో క్రైస్తవుల మీద సంఘ్‌ ‌పరివార్‌ ‌దాడుల నేపథ్యంలో నవీన్‌ ‌బీజేపీతో స్నేహం మానుకున్నారు. విశ్వహిందూ పరిషత్తు నాయకుడు లక్ష్మణానంద సరస్వతి హత్య తరవాత సంఘ్‌ ‌పరివార్‌, ‌ముఖ్యంగా బజ్రంగ్‌ ‌దళ్‌ ‌రెచ్చిపోవడం తమ ప్రభుత్వానికి మచ్చ అని నవీన్‌ ‌భావించారు. ఎన్‌డిఎకు దూరమయ్యారు. అప్పుడు మైనారిటీలు నవీన్‌ ‌పంథాను మెచ్చుకున్నారు. అప్పుడు ఆయన శరద్‌ ‌పవార్‌ ‌నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్‌ ‌పార్టీతో, వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడాన్ని సెక్యులర్‌ ‌భావాలు ఉన్నవారు హర్షించారు. ఎన్‌డిఎతో పొత్తు ఉన్నా లేకపోయినా నవీన్‌ ‌పట్నాయక్‌కు జనాదరణ బెసకడం లేదు. అదే ఆయన బలం.

నవీన్‌ ‌పట్నాయక్‌ ‌విజయ రహస్యంలో అంతుపట్టని వ్యవహారం ఏమీ లేదు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారు. వీలైనంత మేరకు అవినీతికి తావివ్వకపోవడం, పేదలకు అనుకూల విధానాలు అనుసరించడం ఆయన మీద జనాదరణ తగ్గకపోవడానికి ప్రధాన కారణం. మహిళలకు, వృద్ధులకు, పేదలకు ఆర్థిక సహాయం పెంచడం ఆయన పాలనలో విశిష్టత. ఒరిస్సా పారిశ్రామికాభివృద్ధికి చాలా కృషి చేశారు. పోస్కో, ఆర్సెలార్‌ ‌మిత్తల్‌ ‌వంటి దిగ్గజ సంస్థలను ఒరిస్సాలో ఉక్కు కర్మాగారాలు నిర్మించడానికి ఆహ్వానించారు. అయితే పోస్కో ఆగడాలపై ప్రజా ప్రతిఘటన ప్రస్ఫుటంగానే కనిపించింది. కాలియా, బిజు యువ వాహిని, పీఠా లాంటి పథకాలు ప్రజల మెప్పు పొందాయి.
నవీన్‌ ‌పట్నాయకు కళలంటే అనురక్తి. ఇండియన్‌ ‌నేషనల్‌ ‌ట్రస్ట్ ‌ఫర్‌ ఆర్ట్ అం‌డ్‌ ‌కల్చురల్‌ ‌హెరిటేజ్‌ (ఇం‌టాక్‌) ‌వ్యవస్థాపకుల్లో నవీన్‌ ‌కూడా ఒకరు. ఆయన ‘‘ఎ సెకెండ్‌ ‌పారడైజ్‌:ఇం‌డియన్‌ ‌కంట్రీ లైఫ్‌’’, ‘‘ఎ ‌డెజర్ట్ ‌కింగ్డం: ది పీపుల్‌ ఆఫ్‌ ‌బికనీర్‌, ‘‘‌గార్డెన్‌ ఆఫ్‌ ‌లైఫ్‌: ఆన్‌ ఇం‌ట్రొడక్షన్‌ ‌టు ది హీలింగ్‌ ‌ప్లాంట్స్ ఆఫ్‌ ఇం‌డియా’’ గ్రంథాలు వెలువరించారు.

ఎన్నికలకు ముందు ఏ జాతీయ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగినంత మెజారిటీ రాదన్నది నవీన్‌ ‌పట్నాయక్‌ అం‌చనా. అదే సమయంలో ఒరిస్సా అభివృద్ధికి చేయూతనిచ్చే ఏ పార్టీనైనా సమర్థిస్తాం అని చెప్పారు. భవిష్యత్తులో ఆయన ఎన్‌డిఎ కూటమికి మద్దతిచ్చినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఆయన లోకమంతా ఒరిస్సాకే పరిమితం.


– ఆర్వీ రామారావ్‌

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy