వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఒత్తిడిని జయించండిలా….

August 5, 2019

నిన్న గతం… నేడు వాస్తవం… రేపు నమ్మకం… అదే జీవితం, ఆనందమయ జీవితానికి నాందిఇటీవల జరిగిన కేఫ్‌ ‌కాఫీ డే యజమాని, కర్ణాటక మాజీ సీఎం ఎస్‌ఎం ‌కృష్ణ అల్లుడు వీజీ సిదార్థ నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 12 వేల ఎకరాల కాఫీ తోటలు, 3 వేల ఎకరాల్లో అరటి తోటలు, రెండు వేల కాఫీ డే షాపులు.. ఇలా బోలెడన్నీ ఆస్తులున్న ఆయన రూ.6500 కోట్ల అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనం..
కాలవేగాన్ని వెనక్కి నెట్టాలన్న కోరిక..
అన్నింటిలో ముందుండి ఆకాశానికి నిచ్చెన వేయాలనే ఆశ..
వీటన్నింటి నడుమ జీవితం విసిరే చిన్న చిన్న సవాళ్ళను కూడా ఎదుర్కోలేని మానసిక స్థితి….
కసితో ఎదిగారు: కాఫీ తోటల యజమాని కొడుకు నుంచి అతిపెద్ద కాఫీ చెయిన్‌ అధిపతి దాకా వి.జి. సిద్దార్థ ఎదిగారు. కాఫీ తోటల యజమాని కొడుకైన వీజీ సిద్ధార్థ.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలో అతిపెద్ద గొలుసు కట్టు కాఫీ షాపుల నిర్వహణ సంస్థకు అధిపతిగా ఎదిగారు.
ఒత్తిడిని జయించే మార్గం చెప్పాడు.. అదే ఒత్తిడికి బలయ్యాడు: కాఫీ విత్‌ ‌డిస్కషన్‌.. ‌కాఫీ విత్‌ ‌చిట్‌ ‌చాట్‌ ‌గా ప్రపంచానికి కేఫ్‌ ‌కాఫీ డేను పరిచయం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కాఫీ డేకు ఓ బ్రాండ్‌ ‌క్రియేట్‌ ‌చేశాడు. రోజూ లక్షల మంది తమ మీటింగ్‌ ‌స్పాట్‌ ‌లకు కాఫీ డేను సెలక్ట్ ‌చేసుకునే వారు. టెన్షన్‌ ‌రిలాక్స్ ‌కోసం కాఫీ డేకి వెళ్లి రిలాక్స్ అయ్యేవారు.. అలాంటి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉన్న కాఫీ డే.. యజమానే ఇప్పుడు అదే ఒత్తిడికి బలయ్యాడు.
స్పష్టమైన మార్పు: ఆత్మహత్యకు పాల్పడాలని భావించే వారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. బలవన్మరణానికి పాల్పడాలని భావించే వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎక్కువ సేపు నిద్రపోతుంటారు. చిన్న చిన్న కారణాలకే చిరాకు పడుతుంటారు. మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా ఆగిపోతుంటారు. వస్త్రధారణ మీద సరిగా శ్రద్ధపెట్టరు, ముభావంగా ఉంటారు.
మానసిక ఒత్తిడి పెను సమస్య: కాలంతో పరుగులు పెట్టలేక ఓడిపోయిన ప్రతి ఒక్కరూ చనిపోవాలా? అని అంటే.. అక్కరలేదు. కానీ మానసిక ఒత్తిడితో ఇబ్బందిపడే చాలామంది మాత్రం చనిపోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో మానసిక ఒత్తిడి అనేది పెనుసమస్య. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు తొంభై రెండు శాతం మంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. అందులో డెబ్భై ఒక్క శాతం మంది ఒత్తిడికి మందులు కూడా వాడుతున్నారు. అంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలుస్తుంది. జీవితంలోని సంఘటనలను అర్థం చేసుకోకపోవడం వల్ల, తమపై తాము ఒత్తిడి పెంచుకోవడం వల్ల సాధారణంగా మనిషి ఒత్తిడికి లోనవుతాడు. స్వీయ అవగాహనాలోపం వల్ల విపత్కర పరిస్థితులు మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి.

ఒత్తిడిని జయించండిలా…..: రోజువారీ భావోద్వేగాలను ఒక పుస్తకంలో రాసుకోవడం వల్ల ఆత్మపరిశీలనకు, విశ్లేషణకు చక్కగా ఉపయోగపడుతుంది. మంచి పుస్తకాలు చదవడం,సంగీతం వినడం వల్ల మానసిక స్థితి మెరుగవుతుంది. అప్పుడప్పుడూ చిన్న చిన్న విహార యాత్రలకు ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ప్రతికూల ఆలోచనల నుంచి దూరంగా ఉండచ్చు. మానసిక వ్యాకులత కలిగినప్పుడు ప్రపంచం నుండి దూరంగా ఉండకుండా నలుగురితో మెలగాలి. స్నేహితులని కలవాలి. ప్రతి పరిస్థితిని ఎక్కువగా ఊహించుకోవద్దు. పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటంలో తప్పు లేదు కానీ ముందుగానే ఆ పరిస్థితులను ఊహించుకుని దిగాలుపడటం తప్పు. ఒత్తిడిలోంచి బయటకు రావడానికి అన్నిటికన్నా తేలికైన, ప్రభావవంతమైన మార్గం సైకాలజిస్ట్ ‌ద్వారా కౌన్సెల్లింగ్‌ ‌తీసుకోవడం. దీనివల్ల మానసిక ఒత్తిడికి కారణమైన సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. గతంలో జరిగిన పొరపాట్ల గురించి, భవిష్యత్తులో రాబోయే సమస్యల గురించి ఆలోచించడం వృథా. అందుకే ఈ రోజు గురించి ఆలోచించండి. ప్రతికూలతలు పోయి అనుకూలమైన ఆలోచనలు రావడానికి సరైన విశ్రాంతి అవసరం. అందుకని ప్రతిరోజూ ఏడు గంటలు నిద్రపోవాలీ. శృంగారం కూడా ఒత్తిడిని దరిచేరనివ్వదు. ఆ సమయంలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల మానసిక ఆందోళనల నుంచి విముక్తి కలుగుతుంది.
ఇవీ పాటించండి:
మిత్రుల ఎంపికలో జాగ్రత్త వహించండి: దురాలోచనలు చేసేవారికి దూరంగా ఉండాలి. ఇతరుల్ని అణిచేయాలని చూసేవారి పక్కన పొరపాటున కూడా చేరకండి. స్పష్టమైన ఆలోచనలు కలిగినవారు ప్రశాంతమైన మనసుని, వివేకాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయడం మంచిది. మంచి స్నేహితులు ఉంటే మానసిక ఒత్తిడి కలగడం తక్కువ. ఎందుకంటే మానసిక బాధలున్నప్పుడు వారు మంచి శ్రోతగా మారి బాధలన్నింటినీ చక్కగా వింటారు. వారు మనపై చూపించే శ్రద్ధ, సమస్యలకు పరిష్కారం లభించడమే కాకుండా మనపై మనకు వ్యక్తిగత అవగాహనను పెంచుకోవడానికి సహాయపడుతుంది.
సహాయం అడుగండి: అత్యవసర పరిస్థితుల్లో తెలియని వ్యక్తులను కూడా సహాయం అడుగుతాం. అలాంటిది జీవితంలోని కొన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి సహాయం అడగటానికి ఇబ్బందేముంది? ఎవరూ జీవితంలో అన్ని బాధ్యతలనూ ఒంటరిగా తలకెత్తుకోలేరు. అందుకని భాగస్వామినుంచో, స్నేహితుడి నుంచో, కుటుంబ సుభ్యుల నుంచో, సహోద్యోగుల నుంచి సహాయం తీసుకోవడం తప్పుకాదు.
వ్యాయామం: వ్యాయామం ద్వారా బరువు తగ్గడమే కాకుండా శరీరంలో అనుకూలతలు కూడా ఏర్పడతాయి. వ్యాయామంతో శరీరంలో సెరోటోనిన్‌, ‌టెస్టోస్టిరాన్‌లు విడుదల అవ్వడం వల్ల మనసు నిలకడగా ఉండి నిరుత్సాహపరిచే ఆలోచనలను దూరం చేస్తుంది.
ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి: పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మాంసం, చిక్కుళ్ళు, కార్బోహైడ్రేట్లు వంటివి తీసుకోవడం వల్ల మనసు నిర్మలంగా ఉంటుంది. సమతుల ఆహారం శారీరక శ్రేయస్సును పెంపొందిస్తుంది.
డా।। అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి,
ప్రముఖ కౌన్సెలింగ్‌
‌సైకాలజిస్ట్, ‌ఫ్యామిలీ కౌన్సెలర్‌, ‌కరీంనగర్‌.