Take a fresh look at your lifestyle.

ఏపీలో పోలింగ్‌ ‌ముగిసినా తొలగని ఉద్రిక్తత

ఇవాళ రేపు పార్టీ అధినేతలు, సీనియర్‌ ‌నాయకులు కూడా స్థాయి దాటి విమర్శలకు దిగటం ఎక్కువ అవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్ళటానికి వెనుకాడటం లేదు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటానికి సైతం సిగ్గుపడటం లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ ‌కోడెల శివప్రసాద్‌ అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. కోడెలతో సహా 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినా…రాజకీయ వేడి మాత్రం ఇంకా రాజుకుంటూనే ఉంది. ప్రధాన ప్రత్యర్థులు టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు గుప్పించుకోవటమే కాదు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ సెగ తగ్గకుండా చూస్తున్నారు. పోలింగ్‌ ‌ప్రక్రియ ముగిసిన మూడు రోజుల తర్వాత కూడా కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఏకంగా 52 చోట్ల పోలీస్‌ ‌పికెటింగ్‌ ‌పెట్టాల్సి వచ్చింది.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదే పంథాలో పోటీ పడుతున్నారు. ఒక వర్గంలో గెలుపు ధీమా, మరో పక్షంలో ఓటమి భయమే దీనికి కారణం కావచ్చు.
సాధారణంగా ఎన్నికల ప్రచార సమయంలో, పోలింగ్‌ ‌రోజు ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణలు, అల్లర్లు చోటు చేసుకుంటాయి. ఒకరిని ఒకరు రెచ్చగొట్టడం, ఆధిపత్య ధోరణి, అక్కసు, స్థానిక అంశాలు ఈ ఘర్షణల వెనుక కారణంగా ఉంటుంది. ఒక్కో సారి ప్రత్యర్థి వేగాన్ని అడ్డుకోవటంలో భాగంగా కూడా గొడవలకు దిగుతుంటారు. ఇవాళ రేపు పార్టీ అధినేతలు, సీనియర్‌ ‌నాయకులు కూడా స్థాయి దాటి విమర్శలకు దిగటం ఎక్కువ అవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎంత వరకైనా వెళ్ళటానికి వెనుకాడటం లేదు. ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవటానికి సైతం సిగ్గుపడటం లేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, ఇనిమెట్ల గ్రామంలో స్పీకర్‌ ‌కోడెల శివప్రసాద్‌ అరాచకాలపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. కోడెలతో సహా 22 మందిపై రాజుపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. అటు కోడెల వర్గం ఇప్పటికే వైసీపీ నాయకులపై కేసు దాఖలు చేశారు. తనపై దాడి చేశారని ఆరోపించారాయన. ఈ క్రమంలో వేసుకున్న చొక్కా కూడా చిరిగి పోయిందని ఆయన వర్గం ఆరోపణ. ఈ మేరకు వారు సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబుతో పాటు మరో ఇద్దరిపై కేసులు పెట్టారు. నెల్లూరు జిల్లా రూరల్‌ ‌నియోజకవర్గంలో టీడీపీ నాయకుడిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో పోలింగ్‌ను అడ్డుకోవటానికి వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయనగరం జిల్లా కురుపాం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్త మృత్యువాత పడ్డాడు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం, గుంటూరు జిల్లా తెనాలి, చిత్తూరు జిల్లా చంద్రగిరి…ఇలా అనేక చోట్ల ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటం, ఆపై కేసులు పెట్టుకోవటం జరిగింది. ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలు.
గ్రామ, మండల స్థాయిలో పరిస్థితి ఇలా ఉంటే…పార్టీ అధినేతల ఫిర్యాదుల పర్వం మరో రకంగా ఉంది. ఏకంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పైనే అనుమానాలు రేకెత్తించేలా వ్యవహరించటం విశేషం. అసలు ఎన్నికలే అక్రమంగా జరిగాయని, ఈవీఎమ్‌లను ట్యాంపరింగ్‌ ‌చేశారని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబే ఆరోపిస్తున్నారు. ఇదేదో స్టేట్‌మెంట్‌ ‌వరకు పరిమితం కాలేదు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని పోలింగ్‌ ‌రోజే కలిసిన బాబు …ఒక ఫిర్యాదుదారుగా కాకుండా…అధికార దర్పంతో వ్యవహరించిన తీరు ఆశ్చర్యపరిచింది. ఎన్నికల సంఘాన్ని అంత తేలిగ్గా వదిలేది లేదని బెదిరింపుగా మాట్లాడటం చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సీఎస్‌ ‌పట్ల కూడా ఇదే తీరు ప్రదర్శించారు రాజకీయాల్లో తల పండిన చంద్రబాబు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిష్టాత్మక ఐఏఎస్‌ ‌వ్యవస్థను అవమానించటాన్ని ఖండించిన రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారుల సంఘం గవర్నర్‌ను కలిసి బాబుపై ఫిర్యాదు చేసింది. అటు బాబు అండ్‌ ‌టీమ్‌ ‌ఢిల్లీకి ప్రయాణం కట్టారు. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఏపీ ఎన్నికల్లో 30 శాతం ఈవీఎమ్‌లు సరిగా పని చేయలేదని, 150 పోలింగ్‌ ‌కేంద్రాల్లో రీ పోలింగ్‌ ‌నిర్వహించాలని డిమాండ్‌ ‌చేశారు. అంతే కాదు ఎన్నికల సంఘం ప్రధాని మోడీ ఆదేశాల మేరకు పని చేస్తోందని ఆరోపించారు. గత కొంత కాలం నుంచి ఈవీఎమ్‌ ‌రాజకీయాలకు కేంద్ర బిందువులవుతున్నాయి. గెలిచినప్పుడు నోరు విప్పని నేతలు, ఓడినప్పుడు మాత్రం తప్పంతా ఈవీఎమ్‌ ‌వ్యవస్థపై నెడుతుండటం విడ్డూరంగా అనిపిస్తుంది. లాజిక్‌ ‌లేకుండా నాయకులు ఇంత అడ్డగోలుగా ఎందుకు మాట్లాడతారు అనే నిస్పృహ ప్రజల్లో కలుగుతుంది. ఓడిపోయిన ప్రతి రాజకీయ పార్టీ రేపుతున్న ఈ అనుమానాలు నివృత్తి చేసి ప్రజల్లో ఎన్నికల వ్యవస్థ పట్ల నమ్మకం సడలకుండా మరింత సాంకేతికతను ఈవీఎమ్‌లకు జోడించింది ఈసీ. ఈవీఎమ్‌ ‌మెషీన్‌తో అనుసంధానం అయి ఉండే వీవీప్యాట్‌ ‌ద్వారా వోటరు తాను వేసిన వోటు ఎవరికి పడిందో నిర్ధారించుకునే అవకాశం ఏర్పడింది. గత ఎన్నికల్లో ఈవీఎమ్‌ల ద్వారానే ఎన్నికలు జరిగి బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఈవీఎమ్‌లను మేనేజ్‌ ‌చేసి టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు భావించాలా అనే ప్రశ్నకు ఆ పార్టీ నేతలకు ఇబ్బందికరంగానే ఉండవచ్చు. అంత వరకు ఎందుకు ఐదారు నెలల కిందట ఛత్తీస్‌ఘడ్‌, ‌రాజస్థాన్‌, ‌తెలంగాణా, మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతుగా ఆ రాష్ట్రాల్లో ప్రచారం చేయటమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌తన వల్లే గెలిచిందని కూడా ఘనంగా చెప్పుకున్నారు. అప్పుడు ఈవీఎమ్‌లు, వాటిలో లోపాలు, ట్యాంపరింగ్‌, ఈసీ పని తీరు వంటి విషయాలపై టీడీపీ నేతలకు ఫిర్యాదులు లేవు.
తాజా ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్‌ ‌గాలి వీస్తోందన్న ప్రచారానికి చంద్రబాబు చర్యలు ఊతమిచ్చేటట్లు ఉన్నాయి కాని వాస్తవాన్ని ప్రతిబింబించేటట్లు లేవు.
ఈ ఫిర్యాదు పరిణామాలపై వైసీపీ కూడా కాలు దువ్వుతోంది. తమ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులకు పాల్పడితే చర్యలు ఉండటం లేదని ఆరోపిస్తోంది. కొంత మంది అధికారులు, పోలీసులు టీడీపీకి వత్తాసు పలుకుతూ వైసీపీ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారన్నది జగన్‌ ‌వర్గం వాదన. ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ ‌గురించి బాబు మాట్లాడుతుంటే… ఈవీఎమ్‌లను భద్రపరిచే స్ట్రాంగ్‌ ‌రూమ్‌ల భద్రతపై జగన్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌ ‌రూములను ఉంచాలని, ఈసీ నిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఈ అంశాలతో జగన్‌ ‌బృందం అటు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఇటు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్నికకు, పోలింగ్‌కు మధ్య సుమారు నెలన్నర సమయం ఉండటంతో ఈ రచ్చ ఇంకా ఎంత వరకు వెళుతుందో?

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy