వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఏం జరుగుతోంది?

August 28, 2019

ఆసియా ఖండంలోనే కాకుండా  ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా మారనుంది అనుకున్న భారతదేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ముంగిట నిలబడి ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని, దేశం ముందు ఆర్థిక సవాళ్ళు ఉన్నాయన్న విషయాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత్‌ ‌దాస్‌ ‌స్వయంగా అంగీకరించారు. తాజా పరిణామాలతో ఆర్థిక వేత్తలు ఆందోళన చెందుతున్నారు.

 

దేశంలో ఆర్థిక మాంద్య ఛాయలు కమ్ముకుంటున్నాయి. దేశ ఆర్థికాభావృద్ధి రేటు నేల చూపులు చూస్తోంది. 6.5 శాతం ఉంటుందని కేంద్రం చెబుతున్నా…మూడీస్‌ 6.2‌కే పరిమితం అవుతుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్‌ ‌రంగం కుదుపులకు లోనవుతోంది. అమ్మకాలు ఆందోళనకరంగా పడిపోయాయి. 2 దశాబ్దాల్లోనే ఎప్పుడూ లేనంత సంక్షోభాన్ని ఈ రంగం ఎదుర్కొంటోంది. వాహన, అనుబంధ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. లక్షలు పోసి వాహనాలు కొనేందుకు ప్రజలు సాహసించటం లేదు. గత ఏడాది 2018 జూలైలో వివిధ రకాల వాహనావు 22లక్షల 45వేలు అమ్ముడుపోగా, ఈ ఏడాది జూలై నెలలో ఈ సంఖ్య 18లక్షల 25వేలకు పడిపోయింది. అంటే నాలుగు లక్షల 20వేల వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి. వాహనాల కొనుగోళ్ళు తగ్గాయంటే మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కొనుగోలు శక్తి తగ్గటానికి సూచిక. దీని ప్రభావం ఆ రంగంలోని ఉద్యోగాలపై పడింది. గత మూడు నెలల్లో 15వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సొసైటీ ఫర్‌ ఇం‌డియన్‌ ఆటోమొబైల్‌ ‌మాన్యుఫాక్చరర్స్ ‌ప్రకటించింది. సమీప భవిష్యత్తులో రెండు లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోనున్నాయని ఈ సంస్థ వెల్లడించింది.  వాహనాల అమ్మకాలు తగ్గటంతో చాలా కంపెనీలు తమ షోరూమ్‌లను మూసివేశాయి. పారిశ్రామిక ఉత్పత్తి ద్వారా వస్తున్న జీడీపీలో ఆటోమొబైల్‌ ‌రంగం వాటా దాదాపు సగం ఉంది. అంటే ఈ రంగం సంక్షోభం ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడే అవకాశాలున్నాయన్నది స్పష్టం.

ఇతర రంగాల పైనే కాదు ఆ రంగంలోని ఉద్యోగాలపై పడుతుంది. రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం కూడా నష్టాలను చవి చూస్తోంది. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఫ్లాట్లు అమ్ముడు పోకుండా మిగిలిపోయాయని రియల్‌ ఎస్టేట్‌ ‌రంగం సంస్థలు చేసిన అధ్యయనంలో తేలింది. ఆయా రంగాల నుంచి ఉద్దీపనల కోసం కేంద్రానికి విజ్ఞప్తులు పెరుగుతున్నాయి. అంతెందుకు ఐదు రూపాయలు పెట్టి బిస్కెట్‌ ‌ప్యాకెట్‌ ‌కొనటానికి కూడా ప్రజలు వెనుకడుగు వేస్తున్నారని ప్రసిద్ధి బిస్కెట్‌ ‌కంపెనీ పార్లే జీ చెబుతోంది. ఆర్థిక భారం నుంచి బయటపడటానికి ఆ సంస్థ తమ పదివేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. నిరుద్యోగిత పెరిగే కొద్ది వ్యక్తుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. కనీసం అవసరాలపై చేసే వ్యయం కూడా తగ్గుతుంది. దీనితో మార్కెట్‌లో ద్రవ్య ప్రవాహం తగ్గుతుంది. ఇదంతా ఒక విష వలయంలా పరిణమించే ప్రమాదం ఉంటుంది.

ఆర్థిక వృద్ధి లెక్కల్లో మతలబు ఉందా?

ఈ మధ్య కాలంలో మన దేశ ఆర్థిక వృద్ధి గణాంకాల్లో తేడాలున్నాయని, ఎక్కువ చేసి చూపుతున్నారని పలువురు ఆర్థిక వేత్తలు వేలెత్తి చూపుతున్నారు. వీరిలో దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ ‌సుబ్రమణియన్‌ ‌చేసిన వ్యాఖ్యలు ప్రముఖమైనవి. 2011-12 నుంచి 2016-17 ఆర్థిక సంవత్సరాల మధ్య ఆర్థికాభివృద్ధిని వాస్తవం కన్నా ఎక్కువ చేసి చూపించారన్నది ఈయన చేసిన పరిశోధన సారాంశం. శాతాల్లో చెప్పాలంటే ఈ కాలంలో 7 శాతంగా ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లెక్కల్లో చూపారని…వాస్తవంగా జరిగిన అభివృద్ధి 4.5 శాతమే. ఈ పరిశోధన, వాటిలో బయటపడిన వాస్తవాలను హార్వర్డ్ ‌యూనివర్శిటీకి చెందిన సెంటర్‌ ‌ఫర్‌ ఇం‌టర్నేషనల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌ప్రచురించింది. దీన్ని బట్టి సుబ్రమణియన్‌ ఎత్తిచూపిన వాస్తవాలపై విశ్వనీయత ఉంటుంది. జీడీపీని లెక్కించే పద్ధతిని మన దేశం 2015లో మార్చింది. గతంలో జీడీపీని కనీస ధరలను బట్టి లెక్కించే వారు. ఇప్పుడు దాన్ని మార్కెట్‌ ‌ధరలకు అనుగుణంగా మార్చారు. మరో రకంగా చెప్పాలంటే అంతకు ముందు ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులు పొందటానికి అయ్యే టోకు ధరలను బట్టి జీడీపీని లెక్కించే వారు. ఇప్పుడు దీన్ని వినియోగదారులు చెల్లించే మార్కెట్‌ ‌ధరల ఆధారంగా గణించే విధంగా మార్చారు. కొత్త గణాంక విధానం అమల్లోకి వచ్చిన 2015 నుంచి ఆర్థిక వృద్ధి రేటు అంచనాలపై ఈ రంగ నిపుణులు నిశిత విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు కేంద్రం ఆమోదించిన విధానాలు, పద్ధతుల్లోనే జీడీపీని అంచనాలు రూపొందించినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. ఇక్కడే గమనించాల్సిన రెండు కీలక అంశాలున్నాయి. మూడేళ్ళ క్రితం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీని లెక్కించటానికి ఉపయోగించిన కంపెనీల్లో 36 శాతం సంస్థల ఆచూకి దొరక్కపోవటమో, వాటిని పొరపాటుగా వర్గీకరించటమో జరిగిందని కేంద్ర అర్థగణాంక మంత్రిత్వశాఖ చేపట్టిన అధ్యయనంలో తేలిన వాస్తవం. అంటే సమాచార సేకరణలోనే లోపాలున్నాయన్నమాట. నిరుద్యోగితకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కకుండా కేంద్రం తొక్కిపెట్టిందన్న విమర్శలు కొద్ది నెలల క్రితం వెల్లువెత్తాయి. 2017-18 మధ్య మన దేశంలో నిరుద్యోగిత 45 ఏళ్ళ గరిష్ట స్థాయికి చేరిందన్నది అధికారిక సమాచారమే.

ఏం చేయాలి?
పరిష్కారానికి కొత్త సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఉంది. విద్యుత్‌, ‌బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న ఆర్థిక వృద్ధికి కనీసం మరో 2,3 శాతం పెరిగే విధంగా చేయాలంటే పాలకులకు ఆర్థిక వ్యవస్థపై పట్టు, అవగాహన అవసరం. ప్రైవేటు రంగం నుంచి మరిన్ని పెట్టుబడులు వచ్చే  విధంగా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలి. ఇప్పుడు కేంద్రం చెబుతున్న ఉద్దీపనాలు తాత్కాలిక ఉపసమనాలే కాని శాశ్వత పరిష్కారాలు కాదు. బ్యాంకులు డిపాజిట్‌ ‌రేట్లను రెపో రేటుకు అనుసంధానం చేయాలని ఆర్‌బీఐ కోరుతోంది. ఎస్‌బీఐ ఇప్పటికే ఈ పని చేసింది. దీని వల్ల మొండి బకాయిల సమస్యల నుంచి తొందరగా బ్యాంకులు బయటపడే అవకాశాలుంటాయని అంటోంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించటంపై ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించాలి. ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించాలి. సమాచార సేకరణ విధానాన్ని ఆధునీకరించాలి. విశ్వసనీయత పెంచాలి.