వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎస్సీ వర్గీకరణ బిల్లు సాధనకు పోరాటమే శరణ్యం

August 23, 2019

బిజెపి ప్రభుత్వం బిల్లుకు సిద్దమే అంటూ…..
బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం
తిరుమల కొండ, భద్రాద్రి రాముడు సాక్షిగా హామీ ఇచ్చిన బిజెపి
విలేఖరుల సమావేశంలో యంఆర్‌పిఎస్‌ ‌జాతీయ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని యంఆర్‌పిఎస్‌ ‌జాతీయ అధ్యక్షులు మందా కృష్ణమాదిగ విమర్శించారు. ఎంతో క్లిష్టమైన బిల్లులను కూడా ఇటీవల కాలంలో పాస్‌ ‌చేయించుకున్న బిజెపి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు మాత్రం పార్లమెంటులో ప్రవేశపెట్టకపోవడం అతిదారుణం అన్నారు. శుక్రవారం నాడు కెకె ఫంక్షన్‌ ‌హాలు నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా బహిరంగ సభలో ఎస్సీ వర్గీకరణ బిల్లులు తమ ప్రభుత్వమే ప్రవేశపెడుతుందని అన్నీ వర్గాలను కూడకట్టుకొని పాస్‌ ‌చేయించే భాధ్యత తమదేనని చెప్పిందని గుర్తు చేసారు. అలాగే భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి సాక్షిగా జరిగిన బిజెపి రాష్ట్ర స్థాయి సమావేశాల్లో కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడతామని చెప్పి నేటికి ప్రవేశపెట్టకపోవడం విచారకరమని మందాకృష్ణ మాదిగ విమర్శించారు. ఒకవైపు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తాము అనుకూలంగా ఉన్నామని చెపుతూనే బిల్లు పెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. గత యూపిఏ ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టాలని బిజెపి పదేపదే చెప్పిందని అన్నారు. అప్పుడు పట్టుబట్టిన బిజెపి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన బిల్లులు ప్రవేశపెట్టకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం తమ నాయకుల నిర్లక్ష్యం కూడ ఉందని గుర్తు చేసారు. గత యుపిఏ ప్రభుత్వంలో బిజెపి ప్రతిపక్షనేత ఎల్‌కె అధ్వానీ కూడా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని యుపిఏ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరిగిందని చెప్పారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి సుష్మస్వరాజ్‌ ‌కూడ ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెడితే బిజెపి సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా అన్నీ పార్టీలను ఏకతాటిపై తీసుకువచ్చే భాధ్యత తమదేనని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేసారు.తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికల్లో బిజెపి మ్యానిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలంగా ఉన్నామని చెప్పటం జరిగిందని గుర్తు చేసారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బిల్లు పెట్టమని అప్పటి యుపిఏ ప్రభుత్వాన్ని కోరింది బిజెపి అని ఇప్పుడు ప్రస్తుతం బిల్లు పెడతామని చెప్తున్నది బిజెపి అని కానీ కార్యరూపం దాల్చటం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణకు తాము ఎప్పుడు మద్దతు ఉంటుందని బిజెపి ప్రభుత్వం మాయ మాటలు చెప్తుందని అన్నారు. జిఎస్టీ లాంటి బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకున్న చరిత్ర బిజెపి ఉందని గుర్తు చేసారు. ప్రధాని నరేంద్రమోడీ జఠిలమైన బిల్లులు కూడ అవలీలగా పాస్‌ ‌చేయించుకుంటున్నారని 20 సంవత్సరాలలో పాస్‌ ‌కావాల్సిన బిల్లులు కేవలం 5 సంవత్సరాలలోనే అన్నీ బిల్లులు పాస్‌ ‌చేయించుకుంటున్నారే తప్ప ఎస్సీ వర్గీకరణ బిల్లు మాత్రం అనుకూలం అని చెప్పుకుంటూ పార్లమెంటులో ప్రవేశపెట్టడంలో వైఫల్యం చెందారన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే అవలీలగా ఆమోదం పొందుతందని అన్నారు. అన్నీ వర్గాలు ఆమోదిస్తాయని చెప్పారు. జఠిలమైన 370 బిల్లును రద్దు చేసినప్పుడు కాంగ్రెస్‌, ‌డియంకె పార్టీలు వ్యతిరేకించినప్పటికి బిల్లును ఆమోదించుకున్నారని తెలిపారు. అటువంటి క్లిష్టమైన బిల్లులు ఆమోదించుకున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఎందుకు ప్రవేశపెట్టడం లేదని బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.