Take a fresh look at your lifestyle.

ఎపి వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు

ధవలేశ్వరం వద్ద పెరిగిన గోదావరి ఉధృతి
ప్రకాశం బ్యారేజి వద్ద పెరుగుతున్న నీటిమట్టం
అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశాలు

అమరావతి/ కాకినాడ,సెప్టెంబర్‌ 7 : ‌రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్‌కు వరద ఉధృతి అధికంగా ఉంది. ప్రకాశం బ్యారేజ్‌ ఎగువ భాగంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని రామిలేరు, తమిలేరు, వైరా, కీసర మునేరుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ ‌ప్లో 65 వేల క్యూసెక్కులు, ఔట్‌ ‌ఫ్లోలో 57 క్యూసెక్కులుగా ఉంది. కృష్ణా తూర్పు, పశ్చిమ కాల్వలకు సాగు, త్రాగు నీటి అవసరాల కోసం 8 వేల క్కుసేకుల నీటిని అధికారులు విడుదల చేశారు. సాయంత్రానికి లక్ష క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో కాకినాడ, రాజమహేంద్ర వరం నగరాలతో సహా ప్లలెలు, పట్టణాలన్నీ తడిసి ముద్దవుతున్నాయి.  భారీ వర్షాల వల్ల ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం  స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద నీటిమట్టం 7.90 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 175 గేట్లు ఎత్తివేసి 3.28 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 4,700  క్యూసెక్కుల సాగునీటిని జలవనరుల శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు.  ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ ‌ఫ్లోలో, ఔట్‌ ‌ఫ్లోలో 1.31 లక్షల క్యూసెక్కులు కొనసాగుతుంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 874 అడుగులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 161.29 టీఎంసీలు ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.ముసురుపట్టడంతో ఉష్ణోగ్రతలు పడిపోయి చలితో వణుకుతున్నాయి. ఇక బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో రెవెన్యూ శాఖ అప్రమత్తమైంది. కలెక్టరేట్‌ ‌సహా ఆర్డీవో కార్యాలయాలు, తీర ప్రాంత మండలాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటు చేసింది. రానున్న మూడు రోజులపాటు మత్య్సకారులు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి.  భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పెద్దవాగు ప్రాజెక్ట్ ‌గేట్లను తెలంగాణ అధికారులు మంగళవారం తెరిచారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో పంట పొలాల్లో  పెద్ద వాగు వరద నీరు  ప్రవహిస్తోంది. మరోవైపు వరదలో చిక్కుకున్న వందలాది గొర్రెలను స్థానికులు, రెస్క్యూ టీమ్‌ ‌రక్షించారు.  అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో  భారీ వర్షాలకు వాగులు, వంకలు  పొంగుతున్నాయి. బ్రిడ్జీలు కుంగుతున్నాయి.

రహదారులు గుంటలు పడుతున్నాయి. వందల ఎకరాల  పంట పొలాలు నీటమునిగాయి. కుక్కునూరు మండలం, దాచారం వద్ద గుండేటి వాగు వంతెనపైకి వర్షం నీరు చేరడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దు వాగు కాజ్వేపై గోదావరి వరద నీరు చేరింది. దీంతో ఏజెన్సీలో 15 గ్రామాలకు రాకపోకలు నిలచిపోయాయి. భారీ వర్షాలకు లోతు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఏజెన్సీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. పాలగూడెం సపంలోని రహదారిపై వరదనీరు ప్రవహిస్తోంది. వాగు దాటే ప్రయత్నంలో ప్రవాహవేగానికి భయపడి ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనాన్ని వదిలేశాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ట్రాక్టర్‌లోని వ్యక్తులు గమనించి తాడు సాయంతో కొట్టుకుపోతున్న బైక్‌ను బయటకు లాగారు.  అటు మెట్ట, డెల్టా ప్రాంతాల్లో రెండ్రోజులుగా కుండపోత వానలతో  పంట పొలాలు నీట మునిగాయి. పిలక దశలో ఉన్న ఈ చేలల్లోకి నీళ్లు చేరి కుళ్లిపోయే పరిస్థితి ఉంది. అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల జిల్లాలో కుండపోత వర్షాలు పడ్డాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ప్రజలు అవస్థలకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

అక్కడక్కడా పంటలు నీటి మునిగాయి. విశాఖ ఏజెన్సీలో గిరిజనుడు గల్లంతయ్యాడు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతగిరి మండలం గరుగుబిల్లి పంచాయతీ పరిధి పైడిపర్తి గ్రామానికి చెందిన పాడి కన్నయ్య పశువుల మేత కోసం వెళ్తుండగా గెడ్డలో మునిగి గల్లంత య్యాడు. శ్రీకాకుళం జిల్లాలో వర్షాలపై హై అలర్ట్ ‌ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శ్రీ‌కేష్‌ ‌లాఠకర్‌ ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 46.8 మిల్లీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. పాత పట్నం, మెళియాపుట్టి, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం లో కుండపోత వర్షాలు కురిశాయి.  రాజమహేంద్రవరం, కాకినాడ భారీ వర్షాలకు పలు రోడ్లు నీట మునిగాయి. ఏజెన్సీలోని రాజవొమ్మంగిలో కొండ కాలువలు పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. గొల్లప్రోలులో వరి చేలు ముంపునకు గురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు, పోలవరం మండలాల్లో భారీ వర్షం కురిసింది. పోలవరం ప్రాజెక్టు ఎగువకు వెళ్లే రోడ్డు మార్గం బురదమయంగా మారడంతో పోలవరం ప్రాజెక్టు కార్మికులు ఇబ్బంది పడ్డారు. కృష్ణా జిల్లాలో 26 మండలాల్లో వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కడప, కర్నూలు జిల్లాలో చిరు జల్లులు పడ్డాయి. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశాలు న్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు మరో రెండు రోజుల వరకూ సముద్రంపై వేటకు వెళ్లొద్దంటూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటన జారీ చేసింది.

Leave a Reply