Take a fresh look at your lifestyle.

ఎపిలో తెరుచుకున్న మద్యం దుకాణాలు

  • ఉత్సాహంగా రోడ్డెక్కిన మందు ప్రియులు
  • ధరలు పెంచినా లెక్క చేయకుండా క్యూ కట్టిన మందుబాబులు
  • తమిళనాడు సరిహద్దుల్లో ఉద్రిక్తత..దుకాణాల మూసివేత
  • తిరుపతిలో మహిళల ఆందోళన
  • ధరల పెంపును సమర్థించుకున్న ప్రభుత్వం

అమరావతి,మే 4 : ఎపిలో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఎన్నాళ్లో వేచిన ఉదయం అంటూ ..మందుబాబులంతా రోడ్డున పడి మందు కోసం క్యూ కట్టారు. క్యూ కిలోర్‌ ‌మేర ఉన్నా సామాజిక దూరం పాటిస్తూ నిలుచున్నారు. కొన్నిచోట్ల మహిళలు తమ భర్తల కోసం క్యూల్లోకి వచ్చి మందును కొనుగోలు చేశారు. లాక్‌ ‌డౌన్‌ ‌సడలింపుల్లో భాగంగా వైన్‌ ‌షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఉదయం 11గంటలకు మద్యం షాపులు తెరుచు కున్నాయి. దీంతో మందుబాబులు ఉదయం నుంచే మద్యం షాపులవద్ద క్యూలో నిలబడ్డారు. దీంతో కొన్ని చోట్ల క్యూ లైన్లు కిలోటర్లమేర పెరిగాయి. రాత్రి 7 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగనున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వైన్‌ ‌షాపులను తెరుస్తూనే ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25శాతం పెంచింది. అయినా మందుబాబులు వెనుకడుగు వేయడంలేదు. కిక్‌ ‌కోసం బారులుతీరారు. గుంటూరు జిల్లా నందివెలుగులో అయితే ఓ వైన్‌ ‌షాపు వద్ద ఏకంగా 4 కి.. మేర క్యూ పెరిగింది. ఎండ ఠారెత్తిస్తున్నా మద్యం కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చెప్పులు లైన్‌లో ఉంచారు. ఇదిలావుంటే ఆంధప్రదేశ్‌- ‌తమిళనాడు సరిహద్దుల్లో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడంతో.. నెల్లూరు జిల్లాలోని తడ మండలం బీవీ పాలెం, రామాపురం ప్రాంతాల్లోని మద్యం షాపుల వద్దకు తమిళులు భారీగా చేరకుంటున్నారు. ఒక్కసారిగా తమిళులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో వైన్‌ ‌షాపుల వద్ద తోపులాట చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మద్యం షాపులను మూయించి పరిస్థితిని అదుపులోని తీసుకువచ్చారు. అలాగే చిత్తూరు జిల్లాను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన మద్యం ప్రియులు ఆంధ్రాకు క్యూ కట్టారు. తమిళనాడులో మద్యం అమ్మకాలు జరగకపోవడంతో… అక్కడినుంచి మందుబాబులు చిత్తూరు జిల్లా పాలసముద్రానికి తరలిచ్చారు. మద్యం కొనుగోలు కోసం దుకాణాల మందు బుద్ధిగా బారులు తీరి మరీ నిలుచున్నారు. దాదాపు 40 రోజుల తర్వాత షాపులు ఓపెన్‌ ‌కావడంతో మందుబాబులు క్యూకట్టారు. మద్యం ప్రియుల రద్దీతో దుకాణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్టాల్రు మాత్రం లాక్‌డౌనన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోమద్యం దుకాణాలకు అనుమతినివ్వలేదు. పక్కనే ఉన్న ఏపీలో మద్యం అమ్మకాలు ప్రారంభం కావడంతో తమిళనాడు, తెలంగాణ సరిహద్దులోని మందుబాబులు అక్కడికి క్యూలు కడుతున్నారు. తమిళనాడు నుంచి చిత్తూరుకు పెద్ద ఎత్తున మందుబాబులు తరలివస్తున్నారు. తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు జిల్లా పాలసముద్రంలో మద్యం దుకాణం తెరచుకోవడంతో తమిళనాడు ప్రాంతవాసులు ఇక్కడికి తరలివచ్చారు. వైన్‌ ‌షాప్‌ ‌ముందు స్థానికులతో పాటు తమిళనాడు వాసులు కూడా క్యూకట్టారు. అయితే… విషయం అధికారులకు తెలియడంతో… అక్కడ మద్యం అమ్మకాలను నిలిపివేయాలని తమిళనాడు తహసీల్దార్లు ఏపీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో చిత్తూరు జిల్లా అధికారులు పాలసముద్రంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. కాగా… తమిళనాడు నుంచి రాకుండా చర్యలు తీసుకోవాలని గానీ.. ఇక్కడ మద్యం షాపులను మూసివేయడమేమిటని మద్యం బాబులు ఆక్షేపిస్తున్నారు. ఇకపోతే తిరుపతి నగరంలోని రేణిగుంట మండలం పాపానాయుడుపేట వద్ద సోమవారం మహిళలు ఆందోళనకు దిగారు. ఇళ్ల మధ్యలో ఉన్న బ్రాందీ షాప్‌లను మూసివేయాలని వారు డిమాండ్‌ ‌చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. పోలీసుల జోక్యంతో మూడు మద్యం షాపులను తాత్కాలికంగా మూసివేశారు. చిత్తూరు జిల్లాలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. జిల్లాలోని కంటోన్మెంట్‌ ‌ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి.

చిత్తూరు ఎక్సైజ్‌ ‌జిల్లా పరిధిలో 160 దుకాణాల్లో అమ్మకాలు చేపట్టారు. కాగా జిల్లాలో ఎక్కడ కూడా సామాజిక భౌతిక దూరం పాటించని పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకే మందుబాబులు అధికసంఖ్యలో మద్యం షాపుల వద్ద బారులు తీరారు. దీంతో మద్యం ప్రియులను నియంత్రించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కరోనా వచ్చి చనిపోతారో లేదో తెలియదు గాని మద్యం లేక చాలా మంది చనిపోయారని మందుబాబులు చెప్పారు. తిరిగి మద్యం దుకాణాలు తెరచుకోవడంతో కొత్త ఉత్తేజం, కొత్త శక్తి వచ్చిందంటున్న మద్యం ప్రియులు తెలిపారు. ధర ఎంత పెరిగినా పర్వాలేదు మద్యం దొరికితే చాలు అని మందుబాబులు తేల్చిచెప్పారు. విజయనగరం జిల్లాలో దుకాణాలు తెరుచుకోలేదు. గ్రీన్‌జోన్‌ ‌ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో మందు బాబులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉదయం నుంచి మద్యం దుకాణాల వద్ద వేచి చూస్తున్నారు. అయితే ఎంతసేపటికి మద్యం షాపులు తెరుచుకోకపోవడంతో మద్యం ప్రియులు ఆందోళనకు దిగారు. కాగా పాత ధరల నుండి కొత్త ధరలు మార్చటంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మద్యం షాపులు తెరవలేదని అమ్మకందార్లు చెబుతున్నారు. మద్యం విక్రయిస్తారని నిన్న చెప్పటంతో వేకువజాము నుండే క్యూలో ఉన్నామని మందుబాబులు లబోదిబోమంటున్నారు.

మరోవైపు కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఏపీలో మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్‌ ‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ ‌భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. మద్యంపై రాబడిని ఆదాయవనరులుగా చూడ్డంలేదని ప్రభుత్వం చెబుతోంది. కొనుగోలుదారులను నిరుత్సాహపరిచేందుకే అదనపు సర్‌చార్జ్ ‌వేశామని చెబుతోంది. ప్రజారోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. సుదీర్ఘ విరామం తర్వాత ఒక్కసారిగా ఏర్పడే రద్దీని నియంత్రించేందుకు మద్యం కొనుగోళ్లపై ప్రజలను నిరుత్సాహపరిచేందుకే ధరలు పెంచామంటోంది. అయితే ఆదాయం పెంచుకునే లక్ష్యంతోనే ప్రభుత్వం మద్యం షాపులు తీస్తోందని విపక్ష నేతులు ఆరోపిస్తున్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌పూర్తిగా ఎత్తివేసే వరకు మద్యం షాపులు తెరవద్దని డిమాండ్‌ ‌చేస్తున్నారు. వైన్‌ ‌షాపులు తెరిస్తే కరోనా మరింతగా వ్యాపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరం నిబంధన అమలు చేయడం కష్టమని రద్దీని నియంత్రించడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. కేంద్రం అనుమతి ఇచ్చినా.. రాష్ట్రంలో ఎందుకు వైన్‌ ‌షాపులు తెరవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్యం, మద్యనిషేదం వంటివి షాకేనని, కరోనా కష్టకాలంలో ఖజానాను నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శలున్నాయి. మద్య నిషేధమే ప్రభుత్వం లక్ష్యమైతే.. లాక్‌ ‌డౌన్‌తో వచ్చిన అవకాశంతో షాపులను పూర్తిగా బంద్‌ ‌చేయవచ్చుకదా అని ప్రశ్నిస్తున్నారు. హడావుడిగా ధరలు పెంచి షాపులు తెరవాల్సిన అవసరం ఏమొచ్చిందని పలు వర్గాలు ప్రశ్నిస్తున్తున్నాయి. కాగా తెలంగాణలో వైన్‌ ‌షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

Leave a Reply