వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సి విచారణ

December 7, 2019

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సి) విచారణ చేపట్టింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సి నిందితుల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర వివరాలను సేకరించింది. ఈమేరకు శనివారం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ‌విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏడుగురు సభ్యులతో కూడిన ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందంలో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌స్థాయి న్యాయమూర్తితో పాటు సీనియర్‌ ఎస్పీ స్థాయి పోలీసుల అధికారి, ఫోరెన్సిక్‌ ‌నిపుణుడు, మహిళా అధికారి ఉన్నారు. ఈ బృందం సభ్యులు శంషాబాద్‌ ‌విమానాశ్రయం నుంచి నేరుగా మహబూబ్‌నగర్‌ ‌ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో భద్రపరచిన దిశ నిందితుల మృతదేహాలను బృందం సభ్యులు నిశితంగా పరిశీలించారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాలపై ఎన్ని బుల్లెట్‌ ‌గాయాలున్నాయి ? సభ్యులు పరిశీలించారు. పోస్టుమార్టం నివేదికను ఫోరెన్సిక్‌ ‌నిపుణుల బృందం పరిశీలించింది. అనంతరం చటాన్‌పల్లికి చేరుకుని ఎన్‌కౌంటర్‌ ‌స్థలిని చేరుకుని శంషాబాద్‌ ‌డిసిపి ప్రకాశ్‌ ‌రెడ్డి నుంచి వివరాలు సేకరించారు. అలాగే, నిందితుల కుటుంబ సభ్యుల వాగ్మూలoతో పాటు స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఎన్‌హెచ్‌ఆర్‌సి బృందం సభ్యులు ఎన్‌కౌంటర్‌పై చేపట్టిన విచారణకు సంబంధించిన పూర్తి నివేదికను చైర్మన్‌కు సమర్పించనున్నారు.నిందితుల గ్రామాల్లో ఉద్రిక్తత
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై మెజార్టీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా, నిందితుల బంధువులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. నిందితులను కోర్టులు శిక్షించాలి కానీ, పోలీసులకు ఆ హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దిశ హత్య ఘటనలో నలుగురు నిందితులలో ప్రధాన నిందితుడైన ఆరిఫ్‌ది జక్లేర్‌ ‌గ్రామం కాగా, మిగతా ముగ్గురు నిందితులైన జొల్లు శివ,నరేష్‌, ‌చెన్నకేశవులది గుడిగండ్ల గ్రామం. ఎన్‌కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ వారి బంధువులు గుడిగండ్ల రోడ్లపై బంధువులు ధర్నాకు దిగారు. అన్యాయంగా తమ బిడ్డలను చంపారంటూ వాపోయారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో హంతకుల గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మహిళా సంఘాల పిటిషన్‌
‌దిశ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా మహిళా సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అలాగే, ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో కూడా పిల్‌లు దాఖలయ్యాయి. పోలీసు కస్టడీలో ఉన్న నిందితులను ఎన్‌కౌంటర్‌ ‌చేయడం చట్టవిరుద్ధమని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు పిటిషన్‌లో కోరారు.
దిశ కుటుంబ సభ్యుల అభ్యంతరం
దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సి విచారణ చేప్టడాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. తమ కుమార్తెపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎందుకు స్పందించలేదని దిశ తండ్రి ప్రశ్నించారు. ఇటీవల వరంగల్‌లో చిన్నారిపై, అలాగే, హాజీపూర్‌లో యువతులపై అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసిన ఘటనలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. బాధితులకు న్యాయం చేయడానికి కాకుండా నిందితుల పక్షాన విచారణ చేపట్టడం ఏమిటని ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.