వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎన్‌ఆర్సీ ఒక ప్రహసనం కాకూడదు..!!

September 4, 2019

అసోంకు బయట నివసిస్తున్న అనేక మంది భారతీయ పౌరులు ఇటువంటి పలు కారణాలతో ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కించుకోలేక పోవటమో లేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవటమో జరుగుతోంది. నిరక్షరాస్యత, రికార్డులు నిర్వహించాలనే అవగాహన లేకపోవటం వల్ల తమ పౌరసత్వాన్ని అంటే 1971 మార్చి 25 కంటే ముందు నుంచీ ఇక్కడే ఉంటున్నామని నిరూపించుకోవటం చాలా మంది సవాలుగా మారింది. జాబితాలో తమ పేరు లేకపోతే దేశం నుంచి బయటకు గెంటివేస్తారనే భయాందోళనతో 50 మంది వరకు అస్సామీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పలు మానవహక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి.

 

అతని పేరు జితేంద్ర నాథ్‌. ఆరుగురు అన్నదమ్ముల పెద్ద కుటుంబం. పుట్టింది, పెరిగింది గౌహతినే. ఉద్యోగ నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడ్డారు. జితేంద్ర నాథ్‌ ‌హైదరాబాద్‌లో నివాసం. ఎన్‌ఆర్‌సీ వ్యవహారం వచ్చినప్పుడు గౌహతికి వెళ్ళి పౌరసత్వాన్ని నిరూపించుకునే ఆధారాలు అన్నీ నిబంధనల ప్రకారం సమర్పించారు.
2017 డిసెంబరులో విడుదల చేసిన డ్రాఫ్ట్ ‌లిస్ట్‌లో తన పేరు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరి పేర్లు ఉండటంతో నిర్ఘాంతపోయారు. అప్పటి నుంచి తాజాగా ప్రభుత్వం  విడుదల చేసిన చివరి జాబితా వరకు అంటే సుమారు ఏడాదిన్నర కాలం పాటు జితేంద్రనాథ్‌ ‌మానసిక ఒత్తిడితోనే కాలం గడిపారు. రెండు దఫాలు హియరింగ్‌కు హాజరుకావటం, సమస్య పరిష్కారం అయ్యిందనుకుంటున్న సమయంలో మరో హియరింగ్‌కు రావల్సిందిగా అధికారుల నుంచి నోటీసు రావటం వంటి సంఘటనలు ఈ కాలంలో జరిగాయి. చివరకు ఎన్‌ఆర్‌సీలో తన పేరు ఉండటంతో ఊపిరి పీల్చుకున్నారు. తన పేరు లేకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందో అన్న ఆందోళన ఈయన అనుభవించారు. తీరా ఇంత ప్రహసనానికి కారణం జితేంద్రనాథ్‌ ‌వివరాలు నమోదు చేసేటప్పుడు యాంకర్‌ ‌కోడ్‌(‌తండ్రికి సంబంధించిది) తప్పుగా పడటం. క్లరికల్‌ ఎ‌ర్రర్‌. ‌మరో ఉదంతం చెబుతాను. ఆమె హైదరాబాదీ వ్యక్తిని వివాహమాడి అసోం వదిలి నగరానికి తరలి వచ్చింది. 2015లో ఎన్‌ఆర్‌సీలో పేర్లు నమోదు చేసుకోవాల్సి వచ్చినప్పుడు పెళ్లి తర్వాత ఆమె కుటుంబం మారిపోయింది కదా అనే ఆలోచనా ధోరణితో అసలు దరఖాస్తే పెట్టలేదు. తేరుకునేటప్పటికి దరఖాస్తు గడువు ముగిసిపోయింది. రేపో మాపో మరోసారి దరఖాస్తుకు అవకాశం వస్తుందని ఆశపడిన ఆమె తీరా తుది జాబితా ప్రకటించే సరికి …భయాందోళనలో కూరుకుపోయింది. కనీసం నా పేరు జాబితాలో లేదు అని బహిరంగంగా చెప్పుకోవటానికి ధైర్యం చేయలేని స్థితి. అసోంకు బయట నివసిస్తున్న అనేక మంది భారతీయ పౌరులు ఇటువంటి పలు కారణాలతో ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కించుకోలేక పోవటమో లేక అనేక ఇబ్బందులను ఎదుర్కోవటమో జరుగుతోంది. నిరక్షరాస్యత, రికార్డులు నిర్వహించాలనే అవగాహన లేకపోవటం వల్ల తమ పౌరసత్వాన్ని అంటే 1971 మార్చి 25 కంటే ముందు నుంచీ ఇక్కడే ఉంటున్నామని నిరూపించుకోవటం చాలా మంది సవాలుగా మారింది. జాబితాలో తమ పేరు లేకపోతే దేశం నుంచి బయటకు గెంటివేస్తారనే భయాందోళనతో 50 మంది వరకు అస్సామీలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పలు మానవహక్కుల సంఘాల నివేదికలు చెబుతున్నాయి.

గతంలో ఏం జరిగిందంటే…
ఎన్‌ఆర్‌సీ జాబితా తయారు చేయటం అసోంలో ఇదే మొదటిసారి కాదు. స్వాతంత్య్రానంతరం 1951లో మొదటిసారి జాతీయ పౌరసత్వ జాబితా తయారయ్యింది. ఆ తర్వాత నాలుగేళ్ళకు భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావల్సిన నిబంధనలన్నీ ఇందులో పేర్కొన్నారు. అయితే 1951, 1965, 1971ప్రాంతాల్లో మన దేశంలోని అక్రమ చొరబాట్లు పెరిగాయి. ఫలితంగా స్థానికులకు, స్థానికేతరులకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. 1979నుంచే అసోంలో అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా ఉద్యమం బీజం పడింది. మరో నాలుగేళ్ళకు జరిగిన నైలేలీ మారణకాండతో ఈ అంశం కీలక మలుపు తిరిగింది. సుమారు 3వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో వలసదారులకు వ్యతిరేక చట్టానికి ఆమోద ముద్ర పడింది. ట్రిబ్యునళ్ళ ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలయ్యింది. 1985లో భారత ప్రభుత్వం, ఆల్‌ అసోం స్టూడెంట్స్ ‌యూనియన్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మార్చి 25,  1971 తేదీన అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్‌ ‌తేదీగా నిర్ణయించారు. పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఏ ‌ప్రకారం, 1966 జనవరి1కి ముందు నుంచి అస్సాంలో నివసిస్తున్నవారు భారతీయ పౌరులు. 1966 జనవరి, 1971మార్చి 25 మధ్య అస్సాంలో నివాసం ఉండేందుకు వచ్చినవారైతే వచ్చిన తేదీ నుంచి 10 ఏళ్ళకు భారతీయ పౌరుడిగా గుర్తింపు వస్తుంది. అలా కాకుండా బంగ్లాదేశ్‌ ‌యుద్ధం ప్రారంభం అయిన తేదీ మార్చ్ 25 ‌తర్వాత భారత దేశంలోని ప్రవేశించినట్లయితే వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. ఇటువంటి వారిని విచారణ అనంతరం విదేశీయుల ట్రిబ్యునల్‌ ‌దేశం నుంచి బహిష్కరిస్తుంది. అయితే తర్వాత న్యాయపరమైన అంశాలు చోటు చేసుకున్నాయి.  2005లో 1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని సుప్రీమ్‌ ‌కోర్టు కొట్టేసింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్‌ అసోం స్టూడెంట్స్ ‌యూనియన్‌ల మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగాయి. చర్చల ఫలితంగా 1951 నాటి ఎన్‌ఆర్‌సీ సవరణకు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీనితో యూపీఏ 2 హయాంలో ఎన్‌ఆర్‌సీ సవరణకు పైలెట్‌ ‌ప్రాజెక్ట్‌ను చేపట్టారు. అసోం బార్‌పేటలోని ఛాయాగావ్‌లో పైలెట్‌ ‌ప్రాజెక్ట్ ‌మొదలు పెట్టగానే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. నలుగురు చనిపోవటంతో ఈ ప్రాజెక్ట్‌ను అర్థాంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత ఈ సవరణ అంశాన్ని పక్కన పెట్టారు. సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలతో మరోసారి సవరణ అంశం పట్టాలెక్కింది.  2015లో అస్సామీల నుంచి పౌరసత్వ నిరూపించుకునేందుకు దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 2017 డిసెంబర్‌ 31‌న ఎన్‌ఆర్‌సీ తొలి ముసాయిదా జాబితా విడుదల చేశారు. అభ్యంతరాల స్వీకరణ, వాటిపై విచారణ వంటి ప్రక్రియ పూర్తి చేసి తాజాగా తుది జాబితాను విడుదల చేశారు. నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్‌లో చోటు కోసం మూడు కోట్ల 30 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పలు మార్పులు, చేర్పులు, సవరణల తర్వాత మూడు కోట్ల 11 లక్షల మందికి ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కింది. మిగిలిన 19లక్షల మందికి భారతీయ పౌరసత్వం లేదన్నట్లు లెక్క. అయితే ఇప్పటికీ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. తగిన ఆధారాలు ఉన్నా ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కని వారు 120 రోజుల్లో విదేశీ ట్రిబ్యునల్‌కు అప్పీల్‌ ‌చేసుకోవచ్చు. ఆ తర్వాత హైకోర్టు, అవసరం అయితే సుప్రీమ్‌ ‌కోర్టు గుమ్మం ఎక్కే అవకాశం కూడా వీరికి ఉంటుంది.

వారి భవితవ్యం ఏమిటి?
నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్స్ ‌జాబితాలో చోటు దక్కని 19 లక్షల మంది భవితవ్యం ఏమిటనేది తాజా ప్రశ్న. వీరిని అక్రమవలసదారులుగా పరిగణించి తిప్పి పంపించాలనుకున్నా…వెనక్కి తీసుకునేందుకు బంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వం ఎంత వరకు అంగీకరిస్తుందనేది చర్చనీయాంశం. ముందుగా వీరిని డిటెయిన్‌ ‌సెంటర్స్‌కు తరలిస్తారు అని అంటున్నారు. కాని ఇంత మందిని డిటెయిన్‌ ‌సెంటర్లలో పెట్టడం అంత తేలిగ్గా సాధ్యమయ్యే విషయం కాదు. భవిష్యత్తు అంశాన్ని పక్కన పెడితే వెంటనే వీరు పలు సవాళ్ళను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు, పథకాలకు వీరు అనర్హులవుతారు. రిజర్వేషన్లు వర్తించవు. ఆస్థుల కొనుగోళ్లు, అమ్మకాలకు అవకాశం ఉండకపోవచ్చు. వోటు హక్కు ఉండదు. వోటు హక్కే లేకపోతే ఇక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదనేది స్పష్టం. అంటే రాజకీయ ప్రాతినిధ్యానికి వీరు అనర్హులు అవుతారు. అయితే కొన్ని పరిమిత హక్కులతో ప్రైవేటు రంగం, అసంఘటిత రంగాల్లో పని చేసే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ అన్ని అంశాలపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ముగింపు : అసోంలో అక్రమంగా వచ్చి నివసిస్తున్న బంగ్లాదేశీయులను వెనక్కి పంపాలన్న డిమాండ్‌ ‌దశాబ్దాలుగా ఉన్నదే. అయితే తాజా జాబితా తయారీలో అనేక పొరపాట్లు దొర్లాయి అని విపక్షాలే కాకుండా అధికార బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, నిజమైన అస్సామీల్లో కొంత మంది పేర్లు గల్లంతవగా, రెండోది చాలా మంది అక్రమ వలసదారులు ఎన్‌ఆర్‌సీ జాబితాలో చోటు దక్కించుకున్నారన్నది. ఈ సమస్యను ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందనేది వేచి చూడాల్సిందే.