వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎంఐఎం ‌టిఆర్‌ఎస్‌కు బలమా? బలహీనతా?

August 12, 2019

తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం తప్ప మరేపార్టీతో మిత్రత్వం లేదు. ఎంఐఎకు కూడా తెరాసతో తప్ప ఇంకో పార్టీతో అంతగా సంబంధాలులేవు. ఈ ప్రాంతంలోని గత రాజకీయాలను పరిశీలిస్తే ఈ రెండు పార్టీలు కూడా మునుపెన్నడు మరే పార్టీతో లేనంతగా గాఢమైన అనుబంధాన్ని పెనవేసుకున్నాయి. ఈ రెండింటిలో దేనిమీద విమర్శలు వచ్చినా ఎండగట్టేందుకు మరోపార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటున్నది. గత పాలనలను విశ్లేషించుకుంటే రాష్ట్ర రాజధాని ప్రాంతమైన పాతబస్తీ మతఘర్షణలు, అల్లర్లకు పెట్టిందిపేరుగా ఉండింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అలాంటి అల్లర్లు మచ్చుకు కూడా లేవంటేనే ఎఐఎంతో పాటు, ఇతర మైనార్టీ వర్గాలు అధికార పార్టీతో ఏమేరకు స్నేహపూరిత వాతావరణాన్ని కలిగి ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ఈ స్నేహ బంధాన్ని సవాల్‌చేసే పరిణామాలు ఇప్పుడు తెలంగాణలో ముంచుకు వస్తున్నాయి. చాలా కాలంగా దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా తెలంగాణ నుండే తన జైత్రయాత్రను ప్రారంభించాలని సంకల్పించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనవంతు పాత్రపోషించినప్పటికీ ఆ పార్టీకి ఇక్కడ అనుకున్నంత మైలేజీ రాలేదు. 2014 ఎన్నికలు ముగిసినప్పటి నుండే 2019 ఎన్నిక)పై ఆ పార్టీ దృష్టిసారిస్తూ వచ్చింది. అయితే టిఆర్‌ఎస్‌ ‌రాజకీయ ఎత్తుగడలతో ఇక్కడి కాంగ్రెస్‌, ‌టిడిపి పార్టీలు విలవిలలాడిపోయాయి. దీంతో బిజెపిగూడా పెద్దగా పట్టును సాధించలేకపోయింది. కాని, అనూహ్యంగా తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణలో నాలుగు ఎంపి స్థానాలను గెలుచుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. విచిత్ర విషయమేమంటే ఊహించని విధంగా కెసిఆర్‌ ‌కూతురు కవిత, పార్టీ సీనియర్‌ ‌నాయకుడు వినోద్‌కుమార్‌లాంటివారి వోటమి చవిచూడాల్సిరావడం. ఈ రెండు స్థానాలు కూడా బిజెపినే గెలుచుకోవడం మరో పరిణామం. దీంతో బిజెపికి ఇక తెలంగాణలో పాగా వేయగలమన్న నమ్మకం ఏర్పడింది. ఒక పక్క దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీని బిజెపి సాధించడం, మరో పక్క తెలంగాణలో ఊహించని విధంగా నాలుగు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడంతో ఆ పార్టీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. అలాగే ఆ పార్టీకి కర్నాటక సంక్షోభం కలిసివచ్చింది. కాశ్మీర్‌పై తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒకవైపు, మరోవైపు త్రిపుల్‌ ‌తలాఖ్‌ ‌బిల్లు ఆమోదం లాంటి ఘటనలు పార్టీ వర్గాల్లో ద్విగిణీకృత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణలో ఆ పార్టీ పాగా వేయడానికి అదనంగా కలిసివచ్చిన అంశాలుగా మారాయి. ఇప్పటికే ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీని టిఆర్‌ఎస్‌ ఎప్పుడో బలహీనపర్చింది. ఉన్న కొద్దిమంది సీనియర్లను కూడా ఇప్పుడు బిజెపి లాగేసుకుంటున్నది. టిఆర్‌ఎస్‌లో ఇముడలేని వారు, కాంగ్రెస్‌, ‌టిడిపిల్లో ఉండలేని వారంతా ఇప్పుడు కాషాయ కండువా కప్పుకునేందుకు లైన్‌ ‌కడుతున్నారు. ఒకవైపు వీరిని చేర్చుకుంటూనే టిఆర్‌ఎస్‌ ‌బలహీనతలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వర్గాలు పక్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నాయి. హైదరాబాద్‌లో కూడ కాశ్మీర్‌ ‌ప్లాన్‌ అమలు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాశ్మీర్‌ను రెండుగా విడగొట్టి కేంద్రం తన పాలనలోకి తెచ్చుకుంది. ఇంతకాలం కాశ్మీర్‌లో ఏ మైనార్టీలనైతే బూచిగా చూపించి ఇతర పార్టీలు పబ్బంగడుపుకోవాలని చూశాయో, అదే మైనార్టీ అంశంతో తెరాసను టార్గెట్‌ ‌చేయాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్యమకాంలో సెప్టెంబర్‌ 17‌ను రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని పట్టుపట్టిన తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని పక్కకు పెట్టింది. ఆరోజును విధ్వంస దినంగానా.. విద్రోహదినంగానా.. విమోచనదినంగా పాటించాలా అన్న అంశం ఆరేళ్ళుగా వివాదగ్రస్తంగా మారింది. సెప్టెంబర్‌ 17‌ను విమోచన దినంగా పాటిస్తే ఎంఐఎం ఎక్కడ అలిగిపోతుందోనని టిఆర్‌ఎస్‌ ఆవూసే ఎత్తడంలేదన్నది బిజెపి ఆరోపణ. తెలంగాణపై దండయాత్రకు ఇదేసరైన ఆయుధంగా బిజెపి ఇప్పుడు భావిస్తోంది. సెప్టెంబర్‌ 17‌ను విమోచన దినాంగా పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నాహం చేస్తోంది. ఆ రోజున ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్రం కూడా ఆదేశిస్తుండడంతో అధికార టిఆర్‌ఎస్‌ ఇరకాటంలో పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకను చేసినా, చేయకపోయినా కేంద్రం అండదండలతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈ వేడుకను జరిపేందుకు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రణాళిక రచిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సాక్షాత్తు కేంద్ర హోంశాఖా మాత్యుడు అమిత్‌షాను అహ్వానించడం ద్వారా తెరాస ప్రభుత్వం తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం మైనార్టీల కొమ్ముకాస్తూ సెప్టెంబర్‌ 17 ‌పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ప్రజలముందుంచాలన్నది బిజెపి వ్యూహంగా కనిపిస్తున్నది. 1948 సెప్టెంబర్‌ 17‌న సర్దార్‌ ‌వల్లభాయి పటేల్‌ ‌తీసుకున్న పోలీసు చర్య ఫలితంగానే హైదరాబాద్‌ ‌సంస్థానం ఇండియన్‌ ‌యూనియన్‌లో కలిసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా దేశం విడిపోయిన తర్వాత అప్పటివరకు నిజాం ఏలుబడిలో ఉన్న ప్రాంతాలు కొన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో అంతర్భాగమైనా సెప్టెంబర్‌ 17‌న ఆ ప్రాంతాలు విమోచనదినాన్ని పాటిస్తున్నాయి. కాని, టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మాత్రం దీన్ని ఏనాడు పాటించలేదు. మిత్రపక్షమైన ఎంఐఎం కారణంగానే టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఈ వేడుకను జరుపడం లేదని, ఈ బలహీనతనే తాము ఆయుధంగా మల్చుకుని రాష్ట్రంలో తమపార్టీ ప్రాపకాన్ని సాధించుకోవాలన్నది బిజెపి వ్యూహరచన. ఇప్పటి వరకు శాసనసభలో సంఖ్యాబలానికి కొదవలేదనుకుంటున్న టిఆర్‌ఎస్‌కు ఎంఐఎం భవిష్యత్‌లో బలమవుతుందా? బలహీనానికి కారణమవుతుందా అన్నది బిజెపి కార్యాచరణపై ఆధారపడి ఉంది.