Take a fresh look at your lifestyle.

ఎంఎల్‌సి ఫలితాలు లోకసభ ఎన్నికలకు సంకేతమా..?

తెలంగాణలో తాజాగా వెలువడిన మూడు ఎంఎల్‌సి ఫలితాలు, త్వరలో జరుగనున్న లోకసభ ఎన్నికలకు సంకేతమా అన్న చర్చ జరుగుతున్నది. ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కారు జోరు పుంజుకున్న విషయం తెలియంది కాదు. ఇక్కడి ప్రతిపక్షాలన్ని కారుజోరుతో బేజారు అయిన పరిస్థితులను కూడా చూస్తున్నాము. గుడ్డిలో మెల్లగా కొన్ని స్థానాలను గెలుచుకున్నా, వారిని కూడా కాపాడుకునే పరిస్థితిలో విపక్షాలు లేవు. ఫలితంగా అటు శాసనసభలోనూ, ఇటు విధాన సభలోనూ ఆ పార్టీలు క్రమేణ ప్రాతినిధ్యాన్ని కోల్పోతున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ విషయానికి వొస్తే ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పందొమ్మిది మంది ఎంఎల్‌ఏలను గెలిపించుకోగా, మెజార్టీ ఎంఎల్‌ఏలంతా అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి క్యూకడుతున్న విషయాన్ని చూస్తున్నాం. అలాగే విధానసభలో కూడా అదే పరిస్థితి. విధాన సభలో కాంగ్రెస్‌ ‌పార్టీకి ఆరుగురు సభ్యులుండగా ఇప్పటికే నలుగురు కారెక్కేశారు. ఎంఎస్‌ ‌ప్రభాకర్‌రావు, టి సంతోష్‌కుమార్‌, ‌డి దామోదర్‌ ‌రెడ్డి, ఆకుల లలిత గులాబి కండువ కప్పుకోవడంతోపాటు, మెజార్టీ సభ్యులు టిఆర్‌ఎస్‌లోకి మారుతున్నందున తమ ఏకపక్ష విలీనాన్ని ఆమోదించాల్సిందిగా వారు విధానసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేయడంతో కాంగ్రెస్‌కు సభలో సంఖ్యా బలం లేకుండా పోవడంతోపాటు ప్రతిపక్ష హోదాను కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకంటే మిగిలిన ఇద్దరు ఎంఎల్‌సిల పదవీకాలం మరో కొద్దికాలంలో ముగిసిపోనుంది. మహ్మద్‌ ‌షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌ ‌రెడ్డి పదవీకాలం ఈనెల అంటే మార్చ్ 29‌తో ముగియనుంది. దీంతో ఎట్టి పరిస్థితిలో విధానసభలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్య ఉండే అవకాశాలు లేవనుకున్నారు. కాని విధి బలీయమైనదన్నట్లు తుఫాను తాకిడితో కొట్టుకుపోతున్న కాంగ్రెస్‌కు ఓ గడ్డిపోచ అడ్డుపడినట్లు ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గానికి తాజాగా జరిగిన ఎన్నికల్లో తాటిపర్తి జీవన్‌రెడ్డి గెలవడం ఆపార్టీకి స్థైర్యాన్నిచ్చినట్లు అయింది. మరో నెల రెండు నెలల్లో విధాన సభలో కాంగ్రెస్‌ ‌సభ్యుల సంఖ్య శూన్యం అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా అధికార పార్టీపైన కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. కరీంనగర్‌, ‌మెదక్‌, ‌నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ ‌పట్టభద్రుల నియోజక వర్గం నుండి అధికార పార్టీకి చెందిన మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్‌పైన ఆయన విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో దాదాపు పదిసార్లు ఆయన ఎన్నికల్లో పాల్గొన్నారు. చివరి మూడు ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ ఎంఎల్‌సి పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రం మొదటిసారిగా ఆయన విజయం సాధించారు. చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పదిహేడు మంది ఈ ఎన్నికల్లో పోటీపడినా చివరకు జీవన్‌రెడ్డినే విజయం వరించింది.

అలాగే ఉమ్మడి వరంగల్‌, ‌ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల్లో కూడా టిఆర్‌ఎస్‌(‌పరోక్ష) అభ్యర్థి పూల రవీందర్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక్కడ టిఎస్‌యుటిఎప్‌ ‌బలపర్చిన అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అనూహ్యంగా విజయం సాధించాడు. గతంలో ఆయన పిఆర్‌టియు తరఫున ఎంఎల్‌సిగా ఎన్నికై తర్వాత టిఆర్‌ఎస్‌లో కలిశాడు. ఆయనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, రాష్ట్రీయ ఉపాధ్యా పండిత పరిషత్‌, ‌ప్రభుత్వ గెజిటెడ్‌ ఉపాధ్యాయుల సంఘం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలతో పాటు తెరాస పార్టీకూడా మద్దతిచ్చినా లాభం లేకుండా పోయింది. అదే విధంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌మెదక్‌ ఉపాధ్యాయ ఎంఎల్‌సి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన పాతూరి సుధాకర్‌రెడ్డి కూడా అనూహ్యంగా అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన నాల్గవ స్థానానికి పడిపోవడాన్ని తెరాస జీర్ణించుకోలేకపోతున్నది. ఆయనపై పిఆర్‌టియు టిఎస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్న కూర రఘోత్తమరెడ్డి విజయం సాధించారు. ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఎన్నికల్లో ఓడిన ముగ్గురు ప్రత్యక్షంగానో, మరోక్షంగానో తెరాసకు చెందినవారిగా ముద్ర ఉన్నవారే. ఈ ఎన్నికలు కేవలం విద్యాధికుల కోసం నిర్వహించినవే అయినప్పటికీ, రాష్ట్రప్రభుత్వ పాలనా తీరు, ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందనడానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది వివిధ పార్టీలు అంతర్గత సర్వేలు చేయించుకోవడం చూస్తున్నాం. రహస్య సర్వేలతో పనిలేకుండానే ఈ ఎన్నికలు ప్రత్యక్ష ఫలితాలనిచ్చాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకన్నా ముందు జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ ఎన్నికలపైన తప్పకుండా ఉండే అవకాశాలుంటాయంటున్నారు. భాషా పండితులకు పదోన్నతి విషయంలోనైతేనేమీ, పిఆర్సీ విషయంలో నైతేనేమీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిపట్ల ఉపాధ్యాయులు ఈ విధంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారనుకుంటున్నారు. తెలంగాణలో విజయం దిశగా దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌కు ఒక విధంగా ఈ ఎన్నికలు హెచ్చరికే అవుతుందంటున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!